విధానసభలో ప్రసంగించిన అనంతరం బయటకు వెళ్లిపోతున్న యడ్యూరప్ప, గవర్నర్ వజూభాయ్ వాలాకు రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్న యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో ఐదురోజుల సస్పెన్స్‌కు తెరపడింది. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. కీలకమైన విశ్వాసపరీక్షకు ముందు బల నిరూపణ చేసుకోలేకపోతున్నానంటూ రాజీనామా చేశారు. గవర్నర్ వజూభాయ్ వాలా బలనిరూపణ కోసం యెడ్డీకి 15 రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్–జేడీఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు శనివారం సాయంత్రమే విశ్వాసపరీక్ష జరపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేకుండానే.. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగింది.
సభలో ఉద్వేగ భరిత ప్రసంగం చేసిన యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని బీజేపీయేతర విపక్ష నేతలు పేర్కొన్నారు. అనంతరం మమతా బెనర్జీ సహా వివి ధ పార్టీల అధ్యక్షులు కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు ఫోన్‌లో అభినందనలు తెలిపారు. కాగా, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు రావాలంటూ.. జేడీఎస్ నేత కుమారస్వామిని గవర్నర్ ఆహ్వానించారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోనియా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మమత, కేసీఆర్, చంద్రబాబు తదితరులను కుమారస్వామి ఆహ్వానించారు.
ఉదయం నుంచీ ఉత్కంఠ
శనివారం ఉదయం నుంచీ బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో బసచేసిన రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉదయమే వేర్వేరు బస్సుల్లో బెంగళూరులోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయంలో వీరిని పటిష్టమైన భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అక్కడ ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య.. ఎన్నికైన అందరు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదంతా జరుగుతుండగానే.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ మిత్రులైన బీజేపీ సభ్యులతోనూ మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ హోటల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అనంతరం సిద్దరామయ్య కాంగ్రెస్ సభ్యులకు విప్ జారీ చేశారు. మరోవైపు, వీలైనంత ఎక్కువ మందిని లాగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా.. ఓ గంటముందు నుంచీ బీజేపీలో విశ్వాసం సన్నగిల్లటం ప్రారంభమైంది.
యడ్యూరప్పే రంగంలోకి దిగినా..
గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినప్పటినుంచీ విశ్వాస పరీక్షలో గెలుస్తామంటూ యడ్యూరప్ప ధీమాగా కనిపించారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన గానీ, బీజేపీ నేతలు గానీ పరీక్షలో నెగ్గటంపై నమ్మకంగా కనిపించలేదు. బలపరీక్షలో నెగ్గేందుకు ఏడుగురు అదనపు ఎమ్మెల్యేల బలం అవసరం ఉండగా.. జేడీఎస్, కాంగ్రెస్ కూటమిలోని ఎమ్మెల్యేలను ఒప్పించటంలో యడ్యూరప్ప బృందం విఫలమైంది. యడ్యూరప్పే స్వయంగా రంగంలోకి దిగి పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడినా పెద్దగా లాభం లేకపోయింది.
కూటమి ఎమ్మెల్యేల్లో యెడ్డీ సహా పలువురు బీజేపీ నేతలు మాట్లాడిన ఆడియో టేపులను కాంగ్రెస్ విడుదల చేయటం సంచలనం రేపింది. వారికి మంత్రి పదవులు ఇస్తామని యడ్యూరప్ప స్వయంగా భరోసా ఇవ్వడంతో బలనిరూపణలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను బీజేపీ బంధించిందని ఆరోపణలు రాగా.. ఈయన సరిగ్గా యడ్యూరప్ప ప్రసంగానికి ముందు సభలో ప్రవేశించారు. అసెంబ్లీలో ప్రకటన అనంతరం రాజ్‌భవన్ చేరుకున్న యడ్యూరప్ప.. గవర్నర్ వజూభాయ్ వాలాకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. యెడ్డీ రాజీనామాతో జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు (కాంగ్రెస్ మద్దతుతో) చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికైన 221 సీట్లలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి 117 ఎమ్మెల్యేల బలముంది.
న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు: ఆజాద్
గులాంనబీ ఆజాద్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ‘గవర్నర్ మా రెండు పార్టీలను (జేడీఎస్, కాంగ్రెస్) చీల్చేందుకు యడ్యూరప్పకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ.. ఎమ్మెల్యేల బేరసారాలు జరగకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా న్యాయవ్యవస్థ వ్యవహరించినందుకు కృతజ్ఞతలు’ అని ఆజాద్ పేర్కొన్నారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన యడ్యూరప్ప 2007లో ఏడు రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అనంతరం 2008లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాక దాదాపు మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఐదురోజుల సస్పెన్స్
మే 15న వెల్లడైన ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో కన్నడ నాట అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఫలితాలు వెలువడుతుండగానే జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. కూటమి కంటే ముందే యడ్యూరప్ప గవర్నర్‌ను కలసి అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరారు. అటు, మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువమందే తమకు మద్దతుగా ఉన్నారంటూ జేడీఎస్, కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలసి తమ ఎమ్మెల్యేల జాబితాను ఇచ్చారు. కొంత సమయం తీసుకున్న గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం, బల నిరూపణకు 15 రోజుల గడువు ఇవ్వడంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అర్ధరాత్రి కోర్టు తలుపులు తట్టి.. మరునాడు జరగాల్సిన యెడ్డీ ప్రమాణస్వీకారాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించింది. తమ అభ్యర్థులు చేజారకుండా బౌన్సర్లతో పటిష్టమైన భద్రత నడుమ రిసార్టులు, హోటళ్లలో వారిని ఉంచింది. అయితే.. యెడ్డీ ప్రమాణస్వీకారానికి అడ్డుతగలబోమన్న సుప్రీంకోర్టు.. శనివారం సాయం త్రం 4కు బలనిరూపణ జరగాల్సిందేనని ఆదేశించింది. దీంతో రాత్రికి రాత్రి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారమంతా వీరితో సమావేశమై విశ్వాస పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. అయినా ఇరు పార్టీల నేతలకు మనస్సులో ఎక్కడో శంక. తమ ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో చేజారతారన్న అనుమానం వెంటాడా యి. కానీ శనివారం అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు లేకుండానే యడ్యూరప్ప రాజీనామాను ప్రకటించటంతో ఐదురోజుల థ్రిల్లర్ ప్రస్తుతానికి ముగిసినట్లే కనబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment