![Haryana facing hung assembly, Dushyant Chautala emerges as kingmaker - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/25/BJPMM2.jpg.webp?itok=onVdaq9K)
సంబరాలు చేసుకుంటున్న బీజేపీ కార్యకర్తలు
న్యూఢిల్లీ/చండీగఢ్: హరియాణాలో రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు తప్పాయి. రాష్ట్ర అసెంబ్లీలో 90 సీట్లుండగా ‘ఈసారి 75కు పైగా సీట్లు మనవే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ... ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలు కూడా సాధించలేకపోయింది. సీఎం ఖట్టర్ కేబినెట్‌లోని మెజారిటీ మంత్రులు అనూహ్యంగా ఓటమి చవిచూశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా బీజేపీతో పోటీగా మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఫలితాల సరళిని బట్టి కొత్తగా అవతరించిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారింది.
90 సీట్లున్న హరియాణా అసెంబ్లీలో తాజా ఫలితాలను బట్టి బీజేపీ 40, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జేజేపీ 10 సీట్లలో, స్వతంత్ర అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీటిని బట్టి, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు దుష్యంత్ చౌతాలాతో పాటు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్లు కానున్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తొహానా స్థానం నుంచి ఓటమి పాలైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ సుభాష్ బరాలా... పార్టీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
బీజేపీయేతరులు ఏకం కావాలి: హూడా
బీజేపీయేతర పక్షాలన్నీ తమతో చేతులు కలపాలని కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా పిలుపునిచ్చారు. మిశ్రమ ఫలితాల నేపథ్యంలో అధికారం చేజిక్కించుకునేందుకు యంత్రాంగాన్ని వాడుకుని స్వతంత్రులపై ఒత్తిడి పెంచుతూ, వారిని బీజేపీ ఎటూ వెళ్లకుండా చేస్తోందని హూడా ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి సెల్జా మాట్లాడుతూ.. ‘బీజేపీని ప్రజలు తిరస్కరించారు. న్యాయం కోసం కొత్త మార్పును కోరుకున్నారు’ అని పేర్కొన్నారు.
ఇది బీజేపీకి నైతిక ఓటమి: కాంగ్రెస్
హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి నైతిక ఓటమి రుచి చూపాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఉన్న 90 సీట్లలో 47 సీట్లతో గతంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు 40 స్థానాలకు పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఇప్పుడు దాదాపు 31 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తుకు గతంలో కంటే మంచి ఫలితాలు వచ్చాయని, బీజేపీ మెజార్టీ తగ్గిందని అన్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది: దుష్యంత్
తాజా ఫలితాలపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా మాట్లాడుతూ.. సీఎం ఖట్టర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ‘ఎవరికి మద్దతిచ్చేదీ ఇప్పుడే చెప్పలేం. ముందుగా మా పార్టీ తరఫున గెలిచిన వారితో సమావేశం ఏర్పాటు చేసి, అసెంబ్లీ నేతను ఎన్నుకుంటాం. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా’ అని అన్నారు. 75 సీట్లలో గెలవాలన్న బీజేపీ లక్ష్యంపై ఆయన స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నారు. అందుకే ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది’అని వ్యాఖ్యానించారు.
గెలిచిన ప్రముఖులు వీరే...
ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు 45 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సీనియర్ మంత్రి అనిల్ విజ్ అంబాలా కంటోన్మెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిపై 20 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ అతిరథులైన మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా, కుల్దీప్ బిష్ణోయి, కిరణ్ ఛౌధరీ విజయం సాధించారు. ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రేమ్‌లతపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా 47వేలకు పైగా ఓట్లతో ఘన విజయం నమోదు చేసుకున్నారు. ఇంకా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీకి చెందిన ఒకే ఒక అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా ముందంజలో ఉండగా హరియాణా లోఖిత్ పార్టీ (హెచ్‌ఎల్‌పీ) అధ్యక్షుడు గోపాల్ కందా సిర్సా స్థానంలో గెలుపు సాధించారు. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ విజయం సాధించారు.
ప్రముఖుల ఓటమి
హరియాణా మంత్రివర్గంలోని కెప్టెన్ అభిమన్యు, కవితా జైన్, కృష్ణకుమార్ బేడీతో పాటు రెజ్లర్ బబితా ఫొగట్ ఓటమిపాలయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా, అసెంబ్లీ స్పీకర్ కన్వర్‌పాల్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ ఓటమిపాలయ్యారు. లోక్‌తంత్ర సురక్ష పార్టీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ రాజ్‌కుమార్ సైనీ గొహానాలో ఓడిపోయారు.
జాట్ల కంచుకోటలో కాంగ్రెస్
జాట్ల కంచుకోటలైన రొహ్‌తక్, జజ్జర్, సోనిపట్ జిల్లాల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కేవలం సోనిపట్ జిల్లాలోని రాయ్ సీటును మాత్రం బీజేపీ గెలుచుకోగలిగింది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ 10చోట్లకు పైగా గెలిచి, మరో 11 చోట్ల ముందంజ లో ఉంది. దక్షిణ హరియాణా, ఫరీదాబాద్ జిల్లాల్లో బీజేపీ ప్రభావం చూపగలిగింది.
బీజేపీ ముందు 3 దారులు!!
హంగ్ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఏం చేస్తాయి? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమ నేత దుష్యంత్ చౌతాలాని ముఖ్యమంత్రిని చేస్తే మద్దతిస్తామని ఇప్పటికే జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) తేల్చి చెప్పింది. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈ విషయంలో బీజేపీ ముందు మూడు మార్గాలున్నాయి.
1. మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రిగానే ఉంచి దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు బీజేపీ ముందుకు రావచ్చు. ఇది బీజేపీకి సమస్యేమీ కాదు. అయితే జాట్‌యేతర ముఖ్యమంత్రి ఖట్టర్ కింద డిప్యూటీ సీఎంగా చేరడం జాట్ ఓట్ల పునాదులపై గెలిచిన దుష్యంత్ చౌతాలా రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారవచ్చు.
2. జేజేపీ మినహా ఇతర స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందే అవకాశం బీజేపీకి ఉంది. ఇప్పటికే ఏడుగురు స్వతంత్రులతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ఖట్టర్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టవచ్చు. హెచ్‌ఎల్‌పీ అధ్యక్షుడు గోపాల్ గోయల్ కందా, సప్నా చౌదరికి బీజేపీ వర్గాలతో సాన్నిహిత్యం ఉంది. వారిద్వారా మిగిలిన స్వతంత్ర అభ్యర్థులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది.
3. ఈ ఎన్నికల్లో జాట్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించే అవకాశమూ ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కనుక బీజేపీ సీఎం పదవిని దుష్యంత్ చౌతాలాకు అప్పగించే అవకాశమూ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే అది అంత తేలిక కాదు.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ నుంచి సీఎంగా..
బీజేపీ నేత, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రోహ్‌తక్ జిల్లా మహమ్ తెహసిల్‌లోని నిదాన గ్రామంలో 1954 మే 5న జన్మించారు. తండ్రి హర్బాస్ లాల్ ఖట్టర్ వ్యాపారి. భారతదేశ విభజన సమయంలో ఇక్కడకు వలస వచ్చిన కుటుంబానికి చెందినవారు. ఖట్టర్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అవివాహితుడు. హరియాణాకు 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో 24 ఏళ్ల వయసులో ఖట్టర్ ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1980 నుంచి దాదాపు 14 ఏళ్ల పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పని చేశారు.
1994లో బీజేపీలో చేరారు. క్షేత్రస్థాయి కార్యకర్తగా బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న ఖట్టర్.. బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2014లో మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో హరియాణా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment