ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం
కుల, మత రాజకీయాలు చేస్తోంది
కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
నాగపూర్: దేశంలో కాంగ్రెస్‌తోపాటు అర్బన్ నక్సలైట్ల విద్వేషపూరిత కుట్రలను ప్రజలు ఎంతమాత్రం సహించడం లేదని, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుట్రలకు బలి కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. హరియాణాలో బీజేపీ విజయం దేశ ప్రజల మూడ్‌ను ప్రతిబింబిస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ బాధ్యత లేని పార్టీ, అది విద్వేషాలను వ్యాప్తి చేసే ఫ్యాక్టరీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మధ్య విభజన తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రయత్నమని ఆరోపించారు. దేశంలో భిన్నవర్గాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో రూ.7,600 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 10 నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి అధికారం కోసం రాష్ట్రాన్ని బలహీనపర్చాలని చూస్తోందని విమర్శించారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార మహాయుతి కూటమి రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, ఇలాంటి పరిణామం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కేవలం అవినీతి అక్రమాల్లోనే వేగం కనిపించిందని ఎద్దేవా చేశారు
హరియాణాలో కాంగ్రెస్‌కు గుణపాఠం
విభజన రాజకీయాలు చేస్తూ స్వలాభం కోసం ఓటర్లను తప్పుదోవ పటిస్తున్న కాంగ్రెస్ పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గంలో భయోత్పాతం సృష్టించి, వారిని ఓటుబ్యాంక్‌గా మార్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం హిందువులను విభజించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. హరియాణాలో చరిత్రాత్మక విజయం సాధించామని, మహారాష్ట్రలోనూ అంతకంటే పెద్ద విజయం సాధించబోతున్నామని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు.
ముస్లిం కులాలపై మాట్లాడరా?
ముస్లిం వర్గంలోనూ ఎన్నో కులాలు ఉన్నాయని ఇప్పటిదాకా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా చెప్పలేదని ప్రధానమంత్రి మండిపడ్డారు. ముస్లిం కులాల ప్రస్తావన వచి్చనప్పుడల్లా కాంగ్రెస్ నేతలు నోటికి తాళం వేసుకుంటున్నారని విమర్శించారు. హిందువుల విషయంలో మాత్రం కులం కోణంలో మాట్లాడుతుంటారని ధ్వజమెత్తారు. హిందువుల్లో ఒక కులంపైకి మరో కులాన్ని ఉసిగొల్పడమే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. హిందువులు ఎంతగా చీలిపోతే రాజకీయంగా అంత లాభమని ఆ పార్టీ భావిస్తోందన్నారు. హిందువుల మధ్య నిప్పు పెట్టి చలి కాచుకోవాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment