కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టేదెవరో ఇంకా తేలనప్పటికీ ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడినా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గనుక ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకుంటే ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో యువనాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న జ్యోతిరాదిత్య సింధియాతోపాటు మరో సీనియర్ నేత కమల్ నాథ్ కూడా కాంగ్రెస్ తరఫున మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్నారు.
అనుభవజ్ఞుడికే బాధ్యతలు ఇస్తారా?
చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ 9 సార్లు ఎంపీగా గెలిచారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఓ సారి ఇందిర చింద్వారాకు ఎన్నికల ప్రచారానికి వచ్చి, నా మూడో కొడుకు కమల్‌నాథ్‌ను గెలిపించండి అని ప్రజలను కోరారు. ఇవి చాలు రాజకీయాల్లో కమల్‌నాథ్‌కు ఉన్న అనుభవమేమిటో చెప్పడానికి. ఇప్పుడు అనుభవజ్ఞుడైనందున కమల్‌నాథ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపొచ్చనే అంచనాలున్నాయి. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కాస్త ముందు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కమల్‌నాథ్ సీఎం రేసులో ముందున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కమల్‌నాథ్ అంతా తన భుజస్కం«ధాలపైనే నడిపించారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన పార్లమెంటేరియన్ కమలనాథ్‌కు ఏరికోరి ఎన్నికల వేళ పీసీసీ పగ్గాలు అప్పగించిందనే విశ్లేషణలైతే ఉన్నాయి. కానీ మాస్ ఫాలోయింగ్‌లో ఆయన వెనుకబడే ఉన్నారు.
మాస్ ఫాలోయింగ్ జ్యోతిరాదిత్యకే
మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్ రాచ కుటుంబానికి చెందిన సింధియా జనాకర్షణ కలిగిన నేత. గత కొన్నేళ్లుగా గ్రామ స్థాయి పర్యటనలు చేస్తూ తన పట్టు పెంచుకున్నారు. 32 శాతం మంది ప్రజలు జ్యోతిరాదిత్య సీఎం కావాలని కోరుకున్నారంటే ఆయనకు ఏ స్థాయిలో ప్రజల్లో ఆదరణ ఉందో అర్థమవుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆయన మధ్యప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలతో ఎల్లప్పుడూ విభేదిస్తూనే వచ్చారు. కాంగ్రెస్ మాజీ నేత మాధవరావు సింధియా కుమారుడు కావడం, రాహుల్ గాంధీకి కుడి భుజంగా ఉండడం జ్యోతిరాదిత్యకు కలిసొచ్చే అంశాలు. మరో నాలుగు నెలల్లోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలున్నందున ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సింధియాకు కాంగ్రెస్ సీఎంగా అవకాశం ఇవ్వొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment