భోపాల్: కాంగ్రెస్ పార్టీ అంతిమ దశకు చేరుకుందని కేంద్రమంత్రి, ‘గుణ’ బీజేపీ ఎంపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా విర్శించారు. సైద్ధాంతికంగానూ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుంటోందని ఆయన శనివారం పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్నిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కొంతమందికి టికెట్లు ఇచ్చినా నామినేషన్ల తరువాత ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. వాస్తవానికి ఆ పార్టీతో ఉండాలని ఎవరూ అనుకోవడమూ లేదు’’ అని ఆయన విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీలో నేతలకు సముచిత గౌరవ మర్యాదలు ఉండవు అని కూడా ఆయన కుండబద్ధలు కొట్టారు. దేశంలో అత్యాయిక పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవడం మేలని అన్నారు. భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శిలను తిప్పికొడుతూ అది ఏ పార్టీతోనూ సాధ్యం కాని విషయమని అన్నారు.
కాంగ్రెస్‌పార్టీలో చాలాకాలం కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా 2020లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచిన 15 నెలలకు సింధియా.. 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరారు. ఫలితంగా కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment