ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు (సోమవారం) ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా ఎంపీక చేయటంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ ఎంపీలు నిరసన తెలిపారు. అయితే దీనిపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
‘‘ పార్లమెంట్ సమావేశాల తొలిరోజే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా హడావుడి చేస్తోంది. కేవలం సొంతంగా 99 సీట్లు గెలిచినందుకే ఇలా చేస్తోంది. ఇప్పటివరకు మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన అన్ని సీట్లు కలిపినా.. 2014లో బీజేపీ సాధించిన సీట్ల కంటే కూడా తక్కువ. అంటే కాంగ్రెస్ మూడు ఎన్నికల్లో సైతం 240 సీట్లు కూడా గెలవలేకపోతోంది’ అని సింధియా ఎద్దేవా చేశారు. (కాంగ్రెస్ పార్టీ 2014-56 సీట్లు, 2019-42 సీట్లు, 20124-99 సీట్లు గెలుచుకుంది).
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారని సింధియా అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా భారత్ ఎదుగుతుందనే పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఇక.. 2024 ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలు గెలుపొందింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవటంతో మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించగా.. ఇండియా కూటమి 234 సీట్లకే పరిమితమైంది. సోమవారం పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ‘ఇండియా కూటమి’ ఎంపీలు.. నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్, ప్రోటెం స్పీకర్ ఎంపీక, పార్లమెంట్‌లోని విగ్రహాలను మరోచోటుకు తరలించటం వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగం బుక్‌తో నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment