దిగ్విజయ్ ఆశలపై నీళ్లు చల్లిన కమల్ నాథ్
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆశలపై కేంద్ర మంత్రి కమల్ నాథ్ నీళ్లు చల్లినట్టు కనిపిపిస్తోంది. మధ్యప్రదేశ్ లో యువ ముఖ్యమంత్రిని చూడబోతున్నారంటూ కమల్ నాథ్ వ్యాఖ్యలు చేయడంతో దిగ్విజయ్ సింగ్ కు రుచించడం లేదు. కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా దిగ్విజయ్ ను ప్రశ్నించగా.. ఆయన వ్యక్తిగతం అని అన్నారు.
అంతేకాకుండా మధ్య ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు రాహుల్ గాంధీ, జనార్ధన్ ద్వివేది, అజయ్ మాకెన్ లు చేసే వ్యాఖ్యలనే అధికారికంగా పరిగణించాలని దిగ్విజయ్ సూచించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి విధి విధానాల అనుసరించి నూతనంగా ఎన్నుకోబడిన శాసన సభ్యుల మాత్రమే ముఖ్యమంత్రి ఎన్నుకునే సాంప్రదాయం ఉంది అని అన్నారు.
మరో కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా సమక్షంలోనే కమల్ నాథ్ వ్యాఖ్యలు చేయడం మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే సింధియా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలున్నట్టు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రచారం ఊపందుకోవడం దిగ్విజయ్ సింగ్ కు ఇబ్బందిగా మారింది.