జమిలి జరగాలంటే... | Changes to the constitution and public order law are mandatory for Jamali elections | Sakshi
Sakshi News home page

జమిలి జరగాలంటే...

Published Sun, Aug 19 2018 1:14 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

Changes to the constitution and public order law are mandatory for Jamali elections - Sakshi

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. దేశంలో తరచూ ఎన్నికల వల్ల అభి వృద్ధి పనులకు అవరోధం ఏర్పడుతోందని, వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ వల్ల ప్రజా ధనం వృథా అవుతోందన్న వాదన వినిపిస్తోంది. దీన్ని నివారించేందుకు రాష్ట్రాలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే డిమాండ్‌ కొన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాలకూ కాకపోయినా అతితక్కువ గడువు మాత్రమే ఉన్న 12 రాష్ట్రాల అసెంబ్లీలతో కలిపి లోక్‌సభకూ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, లోక్‌సభ నిబంధనలు, ఫిరాయింపుల నిరోధక చట్టం వంటి వాటికి కేంద్రం యుద్ధప్రాతిపదికన సవరణలు చేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులు... 
చట్టసభలు నిర్ణీత ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంటేనే జమిలి ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతుంది. అవిశ్వాస తీర్మానాలతో ప్రభుత్వాలు పడిపోయినప్పుడు, హంగ్‌ ఏర్పడి ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తినప్పుడు, అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసినప్పుడు సాధారణ ఎన్నికలతో కాకుండా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని నివారించడానికి ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. ఇందుకు రాజ్యాంగ సవరణల ఆవశ్యకత ఏర్పడుతుంది. అవి ఏమిటంటే... 
- ఆర్టికల్‌ 83, 172 (1): లోక్‌సభ కాలావధి ఐదేళ్లు అని రాజ్యాంగంలోని 83 (2) క్లాజ్‌ చెబు తోంది. అసెంబ్లీల పదవీకాలం మొదటిసారి సమావేశమైనప్పటి నుంచి ఐదేళ్లు అని ఆర్టికల్‌ 172 (1) సూచిస్తోంది. ఈ రెండింటికీ కాలా వధి ఒకే రీతిలో ఉండేలా సవరణ చేయాలి. 
ఆర్టికల్‌ 85, 174: లోక్‌సభ రద్దు, వాయిదా, సుప్తచేతనావస్థలో ఉంచే అధికారం రాష్ట్రపతికి కల్పించే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్‌ 85. రాష్ట్రాల గవర్నర్లకు ఇవే హక్కులు ఇచ్చే నిబంధన ఆర్టికల్‌ 174. ఈ రెండింటిలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలావధి కంటే ముందే ఏదైనా సభ రద్దయితే మిగిలిన సమయానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో ఏర్పడిన సభ 2020లోనే రద్దు అయితే మిగిలిన కాలానికి అంటే 2024 వరకూ అసెంబ్లీ ఉండేలా ఎన్నికలు జరుగుతాయన్నమాట. సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్న పరిస్థితుల్లో పార్లమెంటుకు కూడా ఈ పద్ధతి వర్తిస్తుంది. 
రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాన్ని కుదించాలన్నా, పొడిగించాలన్నా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొత్త క్లాజులు చేర్చాలి. కుదింపు/పొడిగింపు ఎంతకాలం అనే దానిపై పరిమితి ఉండరాదు. 
అవిశ్వాస తీర్మానంతోపాటు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం చూపుతూ విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాలి. రెండింటికీ ఒకేసారి ఓటింగ్‌ జరగాలి. తద్వారా చట్ట సభలు ముందస్తుగా రద్దయ్యే అవకాశాలు తగ్గుతాయి. 
సాధారణ ఎన్నికలకు కొంచెం సమయం మాత్రమే ఉన్నప్పుడు ఏవైనా చట్ట సభలు రద్దయితే రాష్ట్రపతి పాలన విధించాలి. తాను నియమించుకున్న మంత్రుల ద్వారా పాలన సాగించే అధికారం రాష్ట్రపతికి ఉండాలి. అసెంబ్లీలకు సంబంధించి ఈ పనిని గవర్నర్‌ చేసేలా చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలి. 
హంగ్‌ ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోయినా, ఏదైనా ప్రభుత్వం రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేకున్నా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అయితే కాలపరిమితి ఐదేళ్లు ఉండదు. మిగిలిన సమయానికి మాత్రమే కొత్త సభ మనుగడలో ఉంటుంది. 
- ఆర్టికల్‌ 356: దీని ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఆరు నెలల వరకూ మాత్రమే విధించ వచ్చు. పొడిగించాల్సి వస్తే మళ్లీ రాష్ట్రపతి ఆమో దం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదంతో మూడేళ్లపాటు రాష్ట్రపతి పాలన కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంది. ఐదేళ్ల అవధి మధ్యలో ఏదైనా అసెంబ్లీలో రాష్ట్రపతి పాలన విధించి మూడేళ్ల రాష్ట్రపతి పాలన ముగిశాక కూడా సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పుడు ఏం చేయాలన్న అంశాన్ని కూడా నిర్వచించి ఈ ఆర్టికల్‌లో చేర్చాల్సి ఉంటుంది. 

ఇదీ జమిలి చరిత్ర... 
1952లో లోక్‌సభ తొలి సార్వత్రిక ఎన్నికలతోపాటు దాదాపు అన్ని రాష్ట్రాల (ఒకటి రెండు మినహాయింపులతో) అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1967 దాకా ఈ పరిస్థితే కొనసాగింది. 1967లో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పడగా అంతర్గత కుమ్ములాటలు లేదా కేంద్రమే రాష్ట్రపతి పాలన విధించడంతో ఆ తర్వాత కొన్ని అసెంబ్లీలు రద్దయ్యాయి. 1971లో ఏడాది ముందుగానే అప్పటి ప్రధా ని ఇందిరాగాంధీ లోక్‌సభ ఎన్నికలకు వెళ్లడంతో జమిలి ఎన్నికల శకం ముగిసింది. 1999లో జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి సారథ్యంలోని లా కమిషన్‌ తన నివేదికలో ఎన్నికల సం స్కరణలపై పలు సూచనలు చేసింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసి ంది. 2014 సెప్టెంబర్‌లో సుదర్శన్‌ నాచియప్పన్‌ చైర్మన్‌గా పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటైంది. 2015 డిసెంబర్‌లో ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ 2016 సెప్టెంబర్‌లో తొలిసారిగా జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు.

వాస్తవ దృష్టితో చూస్తే పార్లమెంటుతోపాటు 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నాచియప్పన్‌ కమిటీ, నీతి ఆయోగ్‌ అభిప్రాయపడ్డాయి. 2019లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలంటే అస్సాం, కేరళ, తమిళనాడు అసెంబ్లీల కాలపరిమితిని రెండేళ్లు తగ్గించాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ అసెం బ్లీల పదవీకాలాన్ని దాదాపు మూడేళ్లు కుదించాలి. ఈ త్యాగాలకు అక్కడి అధికార పార్టీలు అంగీ కరించే అవకాశం లేనందున మధ్యేమార్గాన్ని అనుసరించాలని నాచియప్పన్‌ కమిటీ, నీతి ఆయోగ్‌ సూచిం చాయి. కొన్ని రాష్ట్రాలను 2019 ఏప్రిల్‌–మేలలో (మొదటి దశ) జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికలతో కలిపితే... మిగతా వాటిని 2021 అక్టోబర్‌–నవంబర్‌లలో (రెండో దశ) కలిపి ఎన్నికలు నిర్వ హించాలనేది సూచన. ఈ విధంగా దేశంలో ఐదేళ్లలో రెండుసార్లే ఎన్నికలు జరుగుతాయి. 2019 మే తర్వాత రెండున్నర ఏళ్లకు 2021 నవంబర్‌లో మళ్లీ ఎన్నికలుంటాయి. 

ఫిరాయింపుల నిరోధక చట్టం..
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ కొన్ని సవరణలు చేస్తేగానీ జమిలి ఎన్నికలు సాధ్యం కాదన్నది న్యాయ కమిషన్‌ ముసాయిదా చెబుతున్న విషయం. పదవ షెడ్యూల్‌లోని ఈ అంశంలో పార్టీలు జారీ చేసే విప్‌లు సభ్యులు అతిక్రమించకూడదని ఈ షెడ్యూల్‌ చెబుతుంది. అయితే, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినప్పుడు విప్‌లు జారీ చేయకుండా చేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభమవుతుంది. తద్వారా ఆ ప్రభుత్వం ఐదేళ్లు నడిచేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే విప్‌ల జారీ విషయంలో ఉన్న కఠిన నిబంధనలను సడలించాల్సి ఉంటుంది.

చట్ట సవరణ పద్ధతులు... 
జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేసేందుకు నిర్దిష్ట పద్ధతి ఉంటుంది. చేయాల్సిన మార్పులను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. మార్పుల ముసాయిదాను కేంద్ర కేబినెట్‌ పరిశీలించి ఆమోదించాలి. చట్టాలు, నిబంధనల మార్పు కోరుతూ ఓ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ మార్పులన్నీ చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. ఇవన్నీ జరిగాయనుకున్నా మార్పులు, చేర్పుల కారణంగా రాజ్యాంగం తాలూకూ మౌలిక స్వభావానికి విఘాతం కలిగిందని ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉండటం కొసమెరుపు! 

ప్రజాప్రాతినిధ్య చట్టం...  
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోనూ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంట్లోని సెక్షన్‌ 14 లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబందించినది. ఇందులోని రెండవ క్లాజ్‌ ప్రకారం లోక్‌సభ కాలావధి ముగిసేందుకు 6 నెలలకంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారం లేదు. లోక్‌సభ నిర్ణీత కాలావధి ముగిశాక లేదా రద్దయినప్పుడే నోటిఫికేషన్‌ విడుదల చేయవచ్చు. అసెంబ్లీ, లోక్‌సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఈ క్లాజ్‌ను సరి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏకకాల ఎన్నికలకు సంబంధించిన నిర్వచనాన్ని చేర్చాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అనుకూల వాదన... 
- ఏటా ఏదో ఒక ఎన్నికలు (పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఉండటం మంచిది కాదు. గత 30 ఏళ్లలో ఏ ఒక్క ఏడాదీ ఎన్నికలు లేకుండా గడవలేదు. సగటున తీసుకున్నా ఏటా 5 లేదా 6 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ఎన్నికల ప్రవర్తనా నియామవళి కారణంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏ పథకాలు, పనులను చేపట్టే పరిస్థితి లేదు. ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. గత మూడేళ్లలో చూస్తే 2014లో ఏడు నెలలు, 2015లో మూడు నెలలకుపైగా, 2016లో రెండు నెలలపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. 
జమిలి ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదా అవుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రూ. 3,780 కోట్లు ఖర్చయింది. జమిలి ఎన్నికలు పెడితే రూ. 4,500 కోట్లు సరిపోతాయని ఎన్నికల కమిషన్‌ అంచనా వేసింది. లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగితే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. 
ఎన్నికల నిర్వహణ కోసం భారీగా పారామిలటరీ, పోలీసులమోహరింపుతో శాంతిభద్రతల పర్యవేక్షణలో లోపం ఏర్పడుతుంది. 
తరచూ ఎన్నికలు జరిగితే కుల, మత, ప్రాంతీయ భావాలు కొనసాగుతూనే ఉంటాయి.

ప్రతికూల వాదన...
ఏకకాలంలో ఎన్నికలు వస్తే భారత్‌లో 77 శాతం ఓటర్లు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి ఓటేస్తారని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది.  
లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు వేర్వేరు ఎజెండాలపై జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలపై ఓటరు తీర్పు ఉంటుంది. జమిలి ఎన్నికలైతే జాతీయాంశాలు ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించి రాష్ట్రాలకున్న ప్రత్యేక సమస్యలు మరుగునపడతాయి. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకే పరిమితమై ఓటరు తీర్పునిచ్చే అవకాశాన్ని జమిలి ఎన్నికలు తగ్గిస్తాయి. 
మనది సమాఖ్య వ్యవస్థ. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ నినాదంగా బాగానే ఉన్నా సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. లోక్‌సభతోపాటే ఎన్నికలు జరిగేలా రాష్ట్రాలను బలవంతంగా ఒప్పించినట్లే అవుతుందని, ఇది రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని మరింత పెంచినట్లవుతుందనేది నిపుణుల ఆందోళన. 

జమిలిపై పార్టీల వైఖరి ఏమిటి? 
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తదితర పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరపాలన్న కేంద్రంలోని అధికార బీజేపీ ఆలోచనతో ఏకీభవించడం లేదని ఇటీవల జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్, లా అండ్‌ జస్టిస్‌) సమావేశంలో విపక్ష పార్టీల సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. మరోవైపు తాము జమిలి ఎన్నికలకు సిద్ధమేనంటూ టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే ప్రకటించాయి. జమిలి ఎన్నికలకు జేడీ(యూ) పాక్షిక మద్దతు తెలిపినప్పటికీ ఆర్టికల్‌ 356 ఉన్నంత కాలం రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement