నేడు వేడుకలు, పాల్గొంటున్న రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియగా నిలిచే లోక్‌సభ ఎన్నికలు. అందుకు ఏ మాత్రమూ తగ్గని పలు పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. సుమారు 100 కోట్ల ఓటర్లు. లక్షల్లో పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది. వేలాది మంది అభ్యర్థులు. ఇంతటి భారీ ప్రజాస్వామిక క్రతువు సజావుగా జరిగేలా చూసే గురుతర బాధ్యతను మోస్తూ వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
1950 జనవరి 25న ఏర్పాటైన ఈసీ శనివారం 76 ఏట అడుగు పెడుతోంది. ఈ క్రమంలో బాలారిష్టాలను దాటి ‘ఇంతింతై’ అన్నట్టుగా ఎదిగి, నేడు అత్యాధునిక పద్ధతుల ద్వారా ఎన్నికల ప్రక్రియను దేశవ్యాప్తంగా ఆసాంతమూ డేగకళ్లతో పర్యవేక్షించగల స్థాయికి చేరుకుంది. ఆ క్రమంలో ఎన్నో మెరుపులు మెరిపించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.
ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎంతటి అద్భుతాలు సాధ్యమో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టి.ఎన్.శేషన్ ఆచరణలో చూపించారు. అభ్యర్థుల ఆస్తుల వెల్లడి మొదలుకుని ప్రచార వ్యయ నియంత్రణ దాకా నిబంధనలన్నింటినీ కట్టుదిట్టంగా అమలు చేసి ఔరా అనిపించుకున్నారు. ఈసీ అధికారాలు ఎంతటివో పార్టీలు, నేతలతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలిసొచ్చేలా చేశారు.
అలాంటి చరిత్ర ఉన్న ఈసీ పనితీరుపై కొన్నేళ్లుగా ఎన్నెన్నో ప్రశ్నలు! పారదర్శకత లోపిస్తున్న తీరుపై ప్రజలు మొదలుకుని ప్రతిపక్షాల దాకా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి! మొత్తంగా ఈసీ వ్యవహార శైలిపైనే ఆరోపణల మరకలు. ఈ పరిణామాలు ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు గుండెకాయ వంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) విశ్వసనీయతపైనే నానాటికీ సందేహాలు పెరుగుతున్నాయి. వాటికి మద్దతుగా సహేతుక వాదనలు తెరపైకి వస్తున్నాయి.
ఈవీఎంల పనితీరును మేధావులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక చివరి గంటల్లో పోలింగ్ శాతంలో అనూహ్యంగా నమోదవుతున్న భారీ పెరుగుదలను స్వయానా ఈసీ మాజీ సారథులే ప్రశ్నిస్తున్న పరిస్థితి! వీటన్నింటినీ మించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉంటున్న వైనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వందల స్థానాల్లో ఇదే పరిస్థితంటూ పలు గణాంకాలు వెల్లువెత్తాయి.
ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ప్రజాస్వామిక ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అరకొర వివరణలతో సరిపెట్టడం, ప్రధాన సందేహాలపై మౌనాన్ని ఆశ్రయిస్తుండటం అనుమానాలను మరింతగా పెంచుతోంది. ప్రభుత్వ పెద్దల చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారుతోందని విపక్షాలు ఆరోపించడం పరిపాటిగా మారింది. చివరికి ఎన్నికల కమిషనర్ల నియామకం కూడా తరచూ వివాదాస్పదంగా మారుతోంది. వాటిని సవాలు చేస్తూ పలు పార్టీలు సుప్రీంకోర్టు దాకా వెళ్తున్న పరిస్థితి!
ఓటర్ల జాబితాతోనూ చెలగాటం
ఎన్నికల ప్రక్రియకు అతి కీలకమైన ఓటర్ల జాబితాతో ప్రభుత్వాలు, పాలక పెద్దలు చెలగాటమాడుతున్న తీరు కూడా ఈసీ పనితీరుపై మచ్చగా మారుతోంది. తమకు అనువైన చోట్ల ఇష్టారాజ్యంగా ఓటర్లను చేరుస్తున్నారని, లేనిచోట్ల భారీగా పేర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరోపణలు పదేపదే వినిపించాయి. ఇక తాజాగా జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైతే ఈ రచ్చ కనీవినీ ఎరగని స్థాయికి పెరిగింది.
రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన అంబేడ్కర్ ఈ విపరిణామాన్ని ముందే ఊహించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఎన్నికల జాబితాను ఒకటిగా ఆయన అభివర్ణించారు. ‘‘జాతి, సంస్కృతి, భాష తదితరాలపరంగా తమవారు కారని భావించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించే అవకాశముంది.
ఇలాంటి పెడపోకడలకు చెక్ పెట్టేందుకే ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటును ప్రతిపాదిస్తూ 1949 జూన్‌లో రాజ్యాంగ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో అంబేడ్కర్ స్పష్టం చేశారు. నేటి పరిస్థితులు చూస్తే నాటి భయాలే నిజమవుతున్నాయని ఆయన ఆవేదన చెందేవారేమో.
..అలా మొదలైంది
ఎన్నికల సంఘం ఉనికిలోకి వచ్చిన రెండేళ్లకే 1952 తొలి సాధారణ ఎన్నికల రూపంలో అతి పెద్ద సవాలును ఎదుర్కొంది. ఉన్నది ఒక్క ఎన్నికల కమిషనర్, చాలీచాలని సిబ్బంది. వనరులు, వసతులు అంతంతమాత్రం. ఓటర్లలో మెజారిటీ అక్షరజ్ఞానం కూడా లేనివారే. వారందరినీ చేరుకోవడం, ఓటేసేలా చూడటమే అతి పెద్ద సవాలుగా మారిన పరిస్థితి! అన్ని ప్రతికూలతల మధ్య కూడా తొలి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించి ఔరా అనిపించుకుంది.
రవాణా సదుపాయాలే లేని అతి మారుమూల ప్రాంతాలకు కూడా సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని చేర్చి ప్రక్రియ వీలైనంత సమగ్రంగా జరిగేలా చూసింది. అందుకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చింది. దాంతో తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ దేశ విదేశాల్లో పాపులరయ్యారు. ఎన్నో దేశాలు తమ ఎన్నికల ప్రక్రియను గాడిన పెట్టేందుకు ఆయన సేవలను వాడుకున్నాయి.
తర్వాత ఈసీ క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది. ప్రపంచంలోకెల్లా అతి బృహత్తరమైన ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆద్యంతం శాంతియుతంగా నిర్వహించడంలో తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. 1989లో ఎన్నికల కమిషనర్ల సంఖ్యను మూడుకు పెరిగింది.
ఈసీ 76వ వార్షికోత్సవ వేడుక శనివారం హస్తినలో జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎక్సలెన్స్ అవార్డులు అందజేస్తారు.
‘ఇండియా వోట్స్–2024’ పేరిట ఇటీవలి లోక్‌సభ ఎన్నికలపై ఈసీ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను, ఆ ఎన్నికలకు సంబంధించిన మానవాసక్తి కథనాల కూర్పు ‘బిలీఫ్ ఇన్ ద బ్యాలెట్’ను విడుదల చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియపై ‘ఇండియా డిసైడ్స్’ పేరిట వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment