ఈసీకి కశ్మీర్ రాజకీయ పార్టీల డిమాండ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలు ప్రధానంగా డిమాండ్ చేశాయి. గురువారం శ్రీనగర్‌లో ఎన్నికల కమిషన్ ఇక్కడి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని బృందం షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్‌కేఐసీసీ)లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ), బీజేపీ, కాంగ్రెస్, జమ్మూకశ్మీర్ పాంథర్స్ పార్టీ(జేకేపీపీ) తదితర పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది.
సీఈసీతోపాటు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, ఎస్‌ఎస్ సంధుల బృందం ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఈసీ అధికారులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర పాలితప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌ను ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు వినిపించాయని వెల్లడించారు.
జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు నిష్పాక్షికంగా, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని కూడా పార్టీల ప్రతినిధులు కోరారన్నారు. అనంతరం ఈసీ బృందం ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లతోపాటు చీఫ్ సెక్రటరీ, పోలీస్ డైరెక్టర్ జనరల్‌తో సమీక్ష సమావేశం జరిపింది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వారితో చర్చించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment