all parties leaders
-
తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు జరపండి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలు ప్రధానంగా డిమాండ్ చేశాయి. గురువారం శ్రీనగర్‌లో ఎన్నికల కమిషన్ ఇక్కడి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని బృందం షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ), బీజేపీ, కాంగ్రెస్, జమ్మూకశ్మీర్ పాంథర్స్ పార్టీ(జేకేపీపీ) తదితర పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. సీఈసీతోపాటు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, ఎస్ఎస్ సంధుల బృందం ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఈసీ అధికారులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర పాలితప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌ను ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు వినిపించాయని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు నిష్పాక్షికంగా, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని కూడా పార్టీల ప్రతినిధులు కోరారన్నారు. అనంతరం ఈసీ బృందం ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లతోపాటు చీఫ్ సెక్రటరీ, పోలీస్ డైరెక్టర్ జనరల్‌తో సమీక్ష సమావేశం జరిపింది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వారితో చర్చించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. -
రేపటి నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ: ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా ఆదివారం అన్ని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఈ సెషన్ ఉద్దేశం వారికి వివరించి, అభిప్రాయాలు తెలుసుకోనుంది. అయిదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ది అడ్వొకేట్స్(సవరణ)బిల్లు–2023, ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023, ది పోస్టాఫీస్ బిల్లు–2023లను ఈ సెషన్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఈసారి చర్చకు పెట్టనుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా సాగుతోంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు కోటా కల్పించే బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రత్యేక సెషన్ సమయంలోనే పార్లమెంట్‌ను నూతన భవనంలోకి మార్చనుందని భావిస్తున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ మే 28వ తేదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోకి మారాక వివిధ విభాగాల సిబ్బందికి కొత్త యూనిఫాం అందజేసేందుకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ఈ యూనిఫాంపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం ముద్రించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ అంశంపైనా ప్రత్యేక సెషన్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడ్డే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ సారథ్యంలో దేశ రాజధానిలో ఇటీవల విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్రం అంశాన్ని పాలకపక్షం చర్చకు తీసుకు వస్తుందని భావిస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. నూతన భవనంపై నేడు పతాకావిష్కరణ పార్లమెంట్ నూతన భవనంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి కొత్త భవనంలోనే ప్రారంభం కానున్న దృష్ట్యా జగదీప్ ధన్‌ఖడ్ గజద్వారంపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
ఉక్కుపై గళమెత్తిన అఖిలపక్షం
కడప కార్పొరేషన్ : విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఈనెల 25న నిర్వహించే బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వైఎస్ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో ‘ఉక్కు సాధన ఐక్యవేదిక’ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షులు బి. నారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమకు కావలసిన అన్ని రకాల ఖనిజాలు జిల్లాలో ఉన్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగాలంటే ఉక్కు పరిశ్రమ కావాలని దివంగత వైఎస్ఆర్ బ్రహ్మణి స్టీల్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయిందన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఉలుకూపలుకూ లేకుండా ఉందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటులో ఒత్తిడి తెచ్చినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని చెప్పారు. మేధావి సమాఖ్య అధ్యక్షులు ఎం. వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలవాలని సూచించారు. న్యాయవాదుల తరుపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు మస్తాన్‌వలీ తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ కరస్పాండెంట్ల సంఘం నాయకులు జోగిరామిరెడ్డి, ఇలియాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బండి జకరయ్య, అవ్వారు మల్లికార్జున, దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, కిషోర్‌కుమార్, సీఆర్వీ ప్రసాద్, బీఎస్పీ అధ్యక్షుడు సగిలి గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు చొరవ తీసుకోవాలి ఈనెల 25న బంద్‌కు సంబంధించి ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉక్కు సాధన ఐక్యవేదిక అధ్యక్షులు బి. నారాయణ అన్నారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతిరోజూ రెండు గంటల పాటు వీధుల్లో ప్రదర్శనలు చేయాలని తెలిపారు. ముందే విద్యాసంస్థలను మూసేయకుండా, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన తర్వాత బంద్‌లో పాల్గొనే విధంగా చేయాలని సూచించారు. మద్దతు ఉపసంహరించవచ్చు కదా! కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు కమిటీలు వేయడం కాలయాపన చేసేందుకేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. కేంద్రం సాయం చేయకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని సీఎం చెప్పడం సరికాదని, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే సరిపోతుందన్నారు. రాజధానిని కోల్పోయినప్పుడే అస్థిత్వం కోల్పోయాం–సీహెచ్ రాయలసీమ ప్రజలు రాజధానిని కోల్పోయినప్పుడే అస్థిత్వం కోల్పోయారని రాయలసీమ, కార్మిక, కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ ఎందుకు నిర్వహిస్తున్నది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని, ఎన్జీఓ నాయకులను కలసి ప్రభుత్వ కార్యాలయాలు మూయించాలన్నారు. ఓటుకు కోట్లు కేసువల్లే గట్టిగా నిలదీయలేని పరిస్థితి– ఎమ్మెల్యే ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆరోపించారు. రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి తీరాలన్నారు. ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా కడప ఉక్కు పరిశ్రమ గూర్చి కేంద్రాన్ని అడగకపోవడం దారుణమని తెలిపారు. -
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా
-
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా
హైదరాబాద్/ఢిల్లీ: ఢిల్లీకి వెళ్లాల్సిన తెలంగాణ అఖిలపక్షం వాయిదా పడింది. ఎల్లుండి అపాయింట్ మెంట్ ను ప్రధానమంత్రి కార్యాలయం శనివారం రాత్రి రద్దు చేసింది. తిరిగి అపాయింట్ మెంట్ ఎప్పుడనేది మళ్లీ చెబుతామని పీఎంవో అధికారులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్న తెలంగాణ అఖిలపక్షం తమ పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. -
కొనసాగుతున్న ‘వికారాబాద్’ ఆందోళనలు
సీఎం దిష్టిబొమ్మ దహనం మోమిన్‌పేట: రంగారెడ్డి జిల్లాను రెండుగానే విభజించాలని అఖిలపక్ష నాయకులు గురువారం మండల కేంద్రంలో ర్యాలీ, మానవహరం నిర్వహించారు. మండల పరిధిలోని వెల్చాల్లో రోడ్డుకు అడ్డంగా మిషన్ భగీరథ పైపులను వేయడంతో నాలుగు గంటలు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మోమిన్‌పేటలో అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. జిల్లాను రెండుగానే విభజించాలన్నారు. డ్రాప్టు నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వం వెలువరించిన 19మండలాలలతో కూడిన జిల్లానే కావాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మోమిన్‌పేట గ్రామ పంచాయతీ పాలకవర్గం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. పాలన పరంగా జిల్లా ప్రజలందరికి అందుబాటులో ఉండేలా వికారాబాద్ పేరు మీదనే జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ కోణంతో కాకుండా విభజన శాస్త్ర్రీయపరంగా చేయాలన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇజాజ్పటేల్, టీడీపీ మండల అధ్యక్షుడు సిరాజోద్దీన్, మోమిన్‌పేట సర్పంచ్ వడ్ల చంద్రయ్య, నాయకులు ఒగ్గు మల్లయ్య, మాణయ్య, చంద్రకాంత్, సురేందర్, హఫిజ్‌ఖాన్, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
సెక్షన్ -8 అమలు చేయండి
గవర్నర్ నరసింహన్‌కు అఖిలపక్ష నేతల వినతి మజ్లిస్ ఆగడాలపై అఖిలపక్ష నేతల ఆగ్రహం జాతీయస్థాయిలో ఎండగట్టాలని నిర్ణయం ఎంపీ అసదుద్దీన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ 3 డివిజన్లలో రీ పోలింగ్ జరిపించాలని ఈసీకి విజ్ఞప్తి టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను విమర్శించిన చింతల గులాబీ చొక్కా వేసుకోవాలని ఎద్దేవా.. రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై అభాండాలొద్దన్న ఎంపీ వీహెచ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్, మజ్లిస్ ఆగడాలను ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేశాయి. గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో మూడు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందని, ఆ ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని స్పష్టంచేసింది. బుధవారం శాసనసభ ఆవరణలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఎంఐఎం ఆగడాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై ఎంఐఎం నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి కారకుడైన ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారంతా గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన సెక్షన్ 8ని అమలు చేయాలని, దాడులకు పాల్పడ్డ ఎంఐఎం నేతలను అరెస్ట్ చేయాలని కోరారు. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ.రేవంత్‌రెడ్డి(టీడీపీ), కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ), ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వి.హనుమంతరావు, రామ్మోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), కె.శివకుమార్(వైఎస్సార్ కాంగ్రెస్) పాల్గొన్నారు. పాతబస్తీ తమ సొత్తు అన్నట్టుగా ఎంఐఎం నేతలు వ్యవహరించడాన్ని ఈ సమావేశంలో నేతలు దుయ్యబట్టారు. ఆ ప్రాంతంలో ఇతర పార్టీల నేతలను అడ్డుకోవడం ద్వారా ఎంఐఎం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని విరుచుకుపడ్డారు. ఎంఐఎం ఆగడాల కారణంగా పోలింగ్ నిలిచిపోవడం, రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కోరారు. దాడికి ప్రభుత్వానిదే బాధ్యత: జానా ఎంఐఎం దాడి ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని, ఈ దాడికి సర్కారే బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం అరాచకాలు అత్యంత హేయమైనవని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, షబ్బీర్‌పై దాడికి పాల్పడ్డ వారిని, వారిని రెచ్చగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తే భవిష్యత్తులో హైదరాబాద్ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైతే పెట్టుబడులు రాకుండా పోతాయని, సామాన్య ప్రజల్లోనూ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నమ్మకం సడలిపోతుందని హెచ్చరించారు. సెక్షన్ 8 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు. గవర్నర్ తగిన రీతిలో స్పందించకపోతే జాతీయస్థాయిలో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని కలిసి ఎంఐఎం ఆగడాలు, అరాచకాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో: కె.లక్ష్మణ్ పాతబస్తీలో ఎన్నికల ప్రకియ అంతా మజ్లిస్ కనుసన్నల్లోనే నడిచిందని, ఆ పార్టీ నేతల ఆదేశాల ప్రకారమే అధికారులు, పోలీసులు పనిచేశారని బీజేపీ శాసనసభా పక్షం నేత లక్ష్మణ్ ఆరోపించారు. మజ్లిస్ దాడులపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్‌పై ఉందని, అవసరమైతే సెక్షన్ 8 ఇచ్చిన అధికారాలను వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోనివ్వకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, ఇతర పార్టీలపై దాడులకు దిగి భయభ్రాంతులను చేసి రిగ్గింగ్ చేసుకోవడం మజ్లిస్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. అభినవ నిజాం: ఎల్.రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అభినవ నిజాంలా నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం దాడులు అత్యంత దుర్మార్గమని విమర్శించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గంలో చేర్చుకోవడం, ప్రశ్నించిన ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిపై సభల్లోనే దాడులకు దిగడం, గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్‌తో భౌతికదాడులు చేయించడం వంటి అప్రజాస్వామిక చర్యలకు సీఎం దిగుతున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలు ఉండొద్దన్న రీతిలో సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ ఆగడాలను అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై దాడి: కె.శివకుమార్ ఉత్తమ్, షబ్బీర్‌పై మజ్లిస్ దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాడులకు పాల్పడిన మజ్లిస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైతే మినీ ఇండియా లాంటి హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. మూడు డివిజన్లలో రీ పోలింగ్ జరపాలి: ఈసీకి వినతి ఎన్నికల్లో అక్రమాలు జరిగిన మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి అఖిలపక్షం నేతలు వినతిపత్రం సమర్పించారు. పురానాపూల్, మన్సూరాబాద్, జంగంమెట్ డివిజన్లలో ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. ఈ మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు కోరారు. సమగ్ర విచారణ జరపాలి : గవర్నర్‌కు విన్నపం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ నరసింహన్‌కు అఖిలపక్ష నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, అంజన్‌కుమార్ యాదవ్, గౌస్‌ఖాన్(కాంగ్రెస్), ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ), ఎన్.రామచందర్‌రావు, చింతల రామచంద్రా రెడ్డి(బీజేపీ), కె.శివకుమార్(వైఎస్సార్ కాంగ్రెస్) తదితరులు బుధవారం సాయంత్రం గవర్నర్‌తో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని వివరించారు. మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, పాషా ఖాద్రీ, బలాలా, వారి అనుచరులు దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అన్ని ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. జంగంమెట్‌లో ఎస్సీకి చెందిన మహేందర్ అనే అభ్యర్థిని దూషిస్తూ, దాడికి దిగినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చింతల వర్సెస్ వీహెచ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డిని అఖిలపక్ష నేతలు కలిసిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశావు.. గులాబీ చొక్కా వేసుకో..’ అని కమిషనర్ నాగిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాగిరెడ్డి నొచ్చుకున్నారు. ‘మీరలా మాట్లాడితే నేను చేయగలిగిందేం లేదు..’ అని బదులిచ్చారు. ఈ దశలో కాంగ్రె స్ ఎంపీ వి.హనుమంతరావు జోక్యం చేసుకుని రాజ్యాంగ పదవిలో ఉన్నవారి పట్ల అనుచితంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. దీంతో చింతలకు, వీహెచ్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అఖిలపక్ష నేతలు సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.