![Parliament special session to be held from Sept 18-22, all-party meet on 17 Sept 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/17/1694000582_1685190622_PARLI.jpg.webp?itok=WG4M1YZf)
న్యూఢిల్లీ: ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా ఆదివారం అన్ని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఈ సెషన్ ఉద్దేశం వారికి వివరించి, అభిప్రాయాలు తెలుసుకోనుంది. అయిదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ది అడ్వొకేట్స్(సవరణ)బిల్లు–2023, ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023, ది పోస్టాఫీస్ బిల్లు–2023లను ఈ సెషన్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఈసారి చర్చకు పెట్టనుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా సాగుతోంది.
లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు కోటా కల్పించే బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రత్యేక సెషన్ సమయంలోనే పార్లమెంట్‌ను నూతన భవనంలోకి మార్చనుందని భావిస్తున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ మే 28వ తేదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
అందులోకి మారాక వివిధ విభాగాల సిబ్బందికి కొత్త యూనిఫాం అందజేసేందుకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ఈ యూనిఫాంపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం ముద్రించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ అంశంపైనా ప్రత్యేక సెషన్‌లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడ్డే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ సారథ్యంలో దేశ రాజధానిలో ఇటీవల విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్రం అంశాన్ని పాలకపక్షం చర్చకు తీసుకు వస్తుందని భావిస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి.
నూతన భవనంపై నేడు పతాకావిష్కరణ
పార్లమెంట్ నూతన భవనంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి కొత్త భవనంలోనే ప్రారంభం కానున్న దృష్ట్యా జగదీప్ ధన్‌ఖడ్ గజద్వారంపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment