సెక్షన్ -8 అమలు చేయండి | Section 8 apply in hyderabad, demands all parties | Sakshi
Sakshi News home page

సెక్షన్ -8 అమలు చేయండి

Published Thu, Feb 4 2016 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

సెక్షన్ -8 అమలు చేయండి

సెక్షన్ -8 అమలు చేయండి

గవర్నర్ నరసింహన్‌కు అఖిలపక్ష నేతల వినతి
 

  • మజ్లిస్ ఆగడాలపై అఖిలపక్ష నేతల ఆగ్రహం
  • జాతీయస్థాయిలో ఎండగట్టాలని నిర్ణయం
  • ఎంపీ అసదుద్దీన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్
  • 3 డివిజన్లలో రీ పోలింగ్ జరిపించాలని ఈసీకి విజ్ఞప్తి
  • టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేశారంటూ
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను విమర్శించిన చింతల
  • గులాబీ చొక్కా వేసుకోవాలని ఎద్దేవా..
  • రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై అభాండాలొద్దన్న ఎంపీ వీహెచ్

 
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్, మజ్లిస్ ఆగడాలను ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేశాయి. గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో మూడు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందని, ఆ ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని స్పష్టంచేసింది. బుధవారం శాసనసభ ఆవరణలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు.
 
ఎంఐఎం ఆగడాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై ఎంఐఎం నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి కారకుడైన ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారంతా గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన సెక్షన్ 8ని అమలు చేయాలని, దాడులకు పాల్పడ్డ ఎంఐఎం నేతలను అరెస్ట్ చేయాలని కోరారు.
 
ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ.రేవంత్‌రెడ్డి(టీడీపీ), కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ), ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వి.హనుమంతరావు, రామ్మోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), కె.శివకుమార్(వైఎస్సార్ కాంగ్రెస్) పాల్గొన్నారు. పాతబస్తీ తమ సొత్తు అన్నట్టుగా ఎంఐఎం నేతలు వ్యవహరించడాన్ని ఈ సమావేశంలో నేతలు దుయ్యబట్టారు.
 
ఆ ప్రాంతంలో ఇతర పార్టీల నేతలను అడ్డుకోవడం ద్వారా ఎంఐఎం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని విరుచుకుపడ్డారు. ఎంఐఎం ఆగడాల కారణంగా పోలింగ్ నిలిచిపోవడం, రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కోరారు.
 
దాడికి ప్రభుత్వానిదే బాధ్యత: జానా
ఎంఐఎం దాడి ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని, ఈ దాడికి సర్కారే బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం అరాచకాలు అత్యంత హేయమైనవని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, షబ్బీర్‌పై దాడికి పాల్పడ్డ వారిని, వారిని రెచ్చగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
 
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తే భవిష్యత్తులో హైదరాబాద్ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైతే పెట్టుబడులు రాకుండా పోతాయని, సామాన్య ప్రజల్లోనూ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నమ్మకం సడలిపోతుందని హెచ్చరించారు. సెక్షన్ 8 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు. గవర్నర్ తగిన రీతిలో స్పందించకపోతే జాతీయస్థాయిలో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని కలిసి ఎంఐఎం ఆగడాలు, అరాచకాలపై ఫిర్యాదు చేస్తామన్నారు.
 
కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో: కె.లక్ష్మణ్
పాతబస్తీలో ఎన్నికల ప్రకియ అంతా మజ్లిస్ కనుసన్నల్లోనే నడిచిందని, ఆ పార్టీ నేతల ఆదేశాల ప్రకారమే అధికారులు, పోలీసులు పనిచేశారని బీజేపీ శాసనసభా పక్షం నేత లక్ష్మణ్ ఆరోపించారు. మజ్లిస్ దాడులపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
 
హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్‌పై ఉందని, అవసరమైతే సెక్షన్ 8 ఇచ్చిన అధికారాలను వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోనివ్వకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, ఇతర పార్టీలపై దాడులకు దిగి భయభ్రాంతులను చేసి రిగ్గింగ్ చేసుకోవడం మజ్లిస్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
కేసీఆర్.. అభినవ నిజాం: ఎల్.రమణ

ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అభినవ నిజాంలా నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం దాడులు అత్యంత దుర్మార్గమని విమర్శించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గంలో చేర్చుకోవడం, ప్రశ్నించిన ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిపై సభల్లోనే దాడులకు దిగడం, గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్‌తో భౌతికదాడులు చేయించడం వంటి అప్రజాస్వామిక చర్యలకు సీఎం దిగుతున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ మినహా ఇతర పార్టీలు ఉండొద్దన్న రీతిలో సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ ఆగడాలను అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.
 
 
ప్రజాస్వామ్యంపై దాడి: కె.శివకుమార్
ఉత్తమ్, షబ్బీర్‌పై మజ్లిస్ దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాడులకు పాల్పడిన మజ్లిస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైతే మినీ ఇండియా లాంటి హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని హెచ్చరించారు.
 
 మూడు డివిజన్లలో రీ పోలింగ్ జరపాలి: ఈసీకి వినతి
 ఎన్నికల్లో అక్రమాలు జరిగిన మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి అఖిలపక్షం నేతలు వినతిపత్రం సమర్పించారు. పురానాపూల్, మన్సూరాబాద్, జంగంమెట్ డివిజన్లలో ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. ఈ మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు కోరారు.
 
 సమగ్ర విచారణ జరపాలి : గవర్నర్‌కు విన్నపం

 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ నరసింహన్‌కు అఖిలపక్ష నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, అంజన్‌కుమార్ యాదవ్, గౌస్‌ఖాన్(కాంగ్రెస్), ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ), ఎన్.రామచందర్‌రావు, చింతల రామచంద్రా రెడ్డి(బీజేపీ), కె.శివకుమార్(వైఎస్సార్ కాంగ్రెస్) తదితరులు బుధవారం సాయంత్రం గవర్నర్‌తో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని వివరించారు.
 
మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, పాషా ఖాద్రీ, బలాలా, వారి అనుచరులు దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అన్ని ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. జంగంమెట్‌లో ఎస్సీకి చెందిన మహేందర్ అనే అభ్యర్థిని దూషిస్తూ, దాడికి దిగినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
 
 
చింతల వర్సెస్ వీహెచ్
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డిని అఖిలపక్ష నేతలు కలిసిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేశావు.. గులాబీ చొక్కా వేసుకో..’ అని కమిషనర్ నాగిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాగిరెడ్డి నొచ్చుకున్నారు. ‘మీరలా మాట్లాడితే నేను చేయగలిగిందేం లేదు..’ అని బదులిచ్చారు. ఈ దశలో కాంగ్రె స్ ఎంపీ వి.హనుమంతరావు జోక్యం చేసుకుని రాజ్యాంగ పదవిలో ఉన్నవారి పట్ల అనుచితంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. దీంతో చింతలకు, వీహెచ్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అఖిలపక్ష నేతలు సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement