పదేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలూ...దాదాపు ఆరేళ్లనుంచి ప్రజా ప్రభుత్వం జాడా లేని జమ్మూ–కశ్మీర్‌లో ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దఫాలుగా ఈ ఎన్నికలుంటాయని ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ సెప్టెంబర్ 30లోగా అక్కడ ఎన్నికలు నిర్వహించి తీరాలని సుప్రీంకోర్టు నిరుడు డిసెంబర్‌లో ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ ప్రకటన తప్పలేదు. జమ్మూ–కశ్మీర్ ఆఖరి దశ ఎన్నికలతోపాటే... అంటే అక్టో బర్ 1న హరియాణా అసెంబ్లీకి కూడా ఎన్నికలుంటాయి.
రెండుచోట్లా ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న వెల్లడవుతాయి. హరియాణాతోపాటే నవంబర్ నెలాఖరుకు గడువు ముగుస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలుంటాయని అందరూ భావించారు. జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే జనవరితో పూర్తవుతుంది. కానీ మహారాష్ట్రలో గణేశ్ చతుర్థి, దీపావళి కారణంగా ఆ ఎన్నికలు విడిగా నిర్వహిస్తామని ఈసీ చెబుతోంది. కశ్మీర్‌లో ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటలముందు భారీ స్థాయిలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు జరVýæటం యాదృచ్ఛికం కాదు.
విపక్షంలో ఉండగా కశ్మీర్ పరిణామాలపై ఒంటికాలిపై లేచిన బీజేపీకి అధికారం వచ్చిన తొలినాళ్లనుంచీ అదొక అంతుచిక్కని పజిల్‌గా మారిందన్నది వాస్తవం. గవర్నర్ పాలన వచ్చినా, ఆ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తినిచ్చే 370 అధికరణను రద్దుచేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు– జమ్మూ–కశ్మీర్, లద్దాఖ్‌లుగా విభజించి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించినా ఆశించిన స్థాయిలో ప్రశాంతత ఏర్పడలేదు. కశ్మీర్ లోయ ఎంతో కొంత నయం. అంతక్రితం పెద్దగా ఉగ్రవాద ఘటనల జాడలేని జమ్మూ ప్రాంతంలో ఆ ఉదంతాలు పెరిగాయి.
21 మంది జవాన్లు ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు బలయ్యారు. నిరుడు ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకొచ్చాక ఇంతవరకూ 17 సార్లు భద్రతా బలగాలపై ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 18మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈమధ్య ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు జనం మార్పు కోరుకోవటంతోపాటు ఆ మార్పులో భాగస్వాములయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్న వైనం కళ్లబడిందని ప్రధాన ఎన్నికల కమిష నర్ రాజీవ్ కుమార్ అన్నారు. వారు బుల్లెట్లకన్నా బ్యాలెట్లే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎక్కడి ప్రజలైనా బుల్లెట్లు కోరుకోరు. తమ జీవనం సజావుగా సాగాలనీ, కనీస అవసరాలు తీరా లనీ కాంక్షిస్తారు. అది అసాధ్యమైనప్పుడే ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
దాన్ని ఏ శక్తులు ఎలా ఉపయోగించుకుంటాయన్నది వేరే విషయం. ఆయనన్నట్టు మొన్న లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ– కశ్మీర్, లద్దాఖ్‌లలో జనం బారులు తీరిన మాట వాస్తవం. కానీ అంతక్రితం కూడా ఇదే పరిస్థితి. అది రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014 నవంబర్, డిసెంబర్ నెలల్లో చివరిగా ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్ని కలప్పుడు సైతం ఉగ్రవాదుల బెదిరింపులు, వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపు బేఖా తరు చేసి వోటర్లంతా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. కానీ వారికి దక్కిందేమిటి? ఎవరికీ మెజారిటీ రాని స్థితిలో మూడు నెలల పాటు గవర్నర్ పాలన తప్పలేదు. ఆ తర్వాత ఊహించని రీతిలో పీడీపీ–బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనా అది ముచ్చటగా మూడేళ్లు కూడా నడవలేదు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. జమ్మూ ప్రాంతానికి ఆరు, కశ్మీర్‌కు ఒకటి అదనంగా వచ్చాయి. దీనికితోడు పాక్ ఆక్ర మిత కశ్మీర్ ప్రాంతానికి 24 స్థానాలున్నాయి. మొత్తంగా అసెంబ్లీ స్థానాలు 107 నుంచి 114కు పెరి గాయి. ఈమధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల సరళి గమనిస్తే 24.36 శాతం ఓట్లతో బీజేపీ ముందంజలో ఉండగా, 22.3 శాతంతో నేషనల్ కాన్ఫరెన్స్ రెండోస్థానంలో ఉంది.
కాంగ్రెస్‌కు 19.38శాతం, పీడీపీకి 8.48 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు చెరో రెండు సీట్లూ గెల్చుకున్నాయి. యూఏపీఏ కింద అరెస్టయిన పాత్రికేయుడు ఇంజనీర్ రషీద్ జైల్లోవుంటూ బారా ముల్లా స్థానంనుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. మొత్తానికి ప్రస్తుతం తనకు అనుకూల వాతా వరణం ఉన్నదని బీజేపీ విశ్వసిస్తోంది. తాజా ఎన్నికల ప్రకటనకు అది కూడా కారణం కావొచ్చు.
హరియాణాలో ఈసారి ఒంటరి పోరుకు సిద్ధపడుతున్న బీజేపీకి పరిస్థితి ఆశాజనకంగా లేదు. 2014లో 90 స్థానాలున్న అసెంబ్లీలో 47 స్థానాలు గెల్చుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ... 2019లో 40తో సరిపెట్టుకుంది. ఆ ఎన్నికల్లో పది సీట్లు గెల్చుకున్న దుష్యంత్ చౌతాలాతో కూటమి కట్టి పాలించింది. అయితే ఆ పార్టీ మూణ్ణెల్లక్రితం మద్దతు ఉపసంహరించుకోగా దిన దినగండంగా నెట్టుకోస్తోంది. ఈసారి స్పష్టమైన మెజారిటీతో అధికారం ఖాయమని కాంగ్రెస్ అను కుంటున్నా అదంత సులభం కాదని విశ్లేషకుల అంచనా. అంతర్గత పోరును అదుపు చేసుకుని, విప క్షాలతో కలిస్తేనే బీజేపీని నిలువరించటం వీలవుతుందని వారంటున్నారు.
కొత్తగా ఏర్పడే ప్రభుత్వా లెలా ఉంటాయన్న సంగతి పక్కనబెడితే... ముందు ఎన్నికలకు విశ్వసనీయత తీసుకురాటం ఎలా గన్నది ఈసీ పరిశీలించాలి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో 140 స్థానాల్లో పోలైన వోట్లకన్నా లెక్కించిన ఓట్లు అయిదు కోట్లు అధికమని వోట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్‌డీ) బయటపెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ అధిక వోట్లు 47 లక్షలు. పర్యవసానంగా ఇతర రాష్ట్రాల మాటెలావున్నా ఏపీలో కూటమి సర్కా రుకు ఈవీఎం ప్రభుత్వమన్న ముద్రపడింది. పైగా కొన్నిచోట్ల సీల్ చేసిన ఈవీఎంల బ్యాటరీచార్జింగ్ పెరిగిన వైనం కూడా వెల్లడైంది. ఇంత అస్తవ్యస్తంగా నిర్వహణ ఉంటే ఇలాంటి ఎన్నికలను ఎవరైనా విశ్వసించగలరా? ఎన్నికల సంఘం ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment