కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. కానీ, తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏవీ కూడా.. ఏ పార్టీకి మెజార్టీని, అధికారాన్ని కట్టబెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మాత్రమే దాదాపు చాలావరకు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు వెల్లడించాయి. విచిత్రంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో(ప్రధాన పార్టీలు మారాయంతే) ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికాగా.. ఆ సమయంలో ఆ జోస్యమే ఫలించింది కూడా!.
👉 కర్ణాటక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. 2023 ఎన్నికల తరహా ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయ్యాయి. అయితే అప్పుడు తుది ఫలితం కూడా అంచనాలకు తగ్గట్లే వచ్చింది. ఆరు జాతీయ వార్తా సంస్థలతో పాటు ఓ రీజినల్ ఛానెల్ సర్వే కూడా బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పాయి. చెప్పినట్లుగానే బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి.
👉 అదే సమయంలో వేసిన హంగ్ అంచనా కూడా ఫలించింది. గత ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ.. కానీ, ప్రభుత్వ ఏర్పాటు కోసం నాటకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎంగా ప్రమాణం చేసిన యాడ్యూరప్ప.. మూడు రోజులకే రాజీనామా చేశారు. ఆపై కాంగ్రెస్, జేడీఎస్‌లు సర్కార్‌ను ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
కానీ, 14 నెలల తర్వాత బీజేపీలోకి కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలతో సీన్ మారింది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. కాషాయ పార్టీ బలం 116కు చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
👉 అప్పుడు ఎగ్జిట్‌పోల్స్ మాదిరే ఇప్పుడు గణాంకాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నాలుగైదు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి కనిపిస్తోంది.
👉 ఇక.. గత ఎగ్జిట్‌పోల్స్‌కి ఇప్పటి ఎగ్జిట్‌పోల్స్‌కు ప్రధానంగా కనిపిస్తున్న మూడో సారుప్యత.. జేడీఎస్ పార్టీ.
గత ఎన్నికల్లో 20 నుంచి 40 స్థానాల నడుమ గెలుస్తుందని వేసిన అంచనా జేడీఎస్ విషయంలో నిజమైంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కింగ్‌మేకర్ అవుతుందని కూడా ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన జోస్యం ఫలించింది.
👉 ఇప్పుడు కూడా ఎగ్జిట్‌పోల్స్.. జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్ల దాకా రావొచ్చని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమయ్యే స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవచ్చని భావిస్తున్న తరుణంలో.. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ అయ్యే అవకాశమూ లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment