సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది.
కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ
ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్‌మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.
ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వం మాదే: బొమ్మై
ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి.
సంప్రదింపులు.. బేరసారాలు
కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి.
వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment