కర్ణాటకలో విధానసభ ఎన్నికలు ముగియడంతో రాజకీయం వేడెక్కింది. దీనికితోడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాదని చెప్పడంతో దేశం యావత్తు కర్ణాటకాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ఎవరితో ఎవరు జతకడతారు? ఎవరు సీఎం అవుతారన్న చర్చ జోరందుకుంది. తామే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.
ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే జేడీఎస్ కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.హంగ్ వస్తే ఏం చేయాలనేదానిపై బీజేపీ నేతలతో చర్చలు జరిపేందుకే కుమారస్వామి విదేశీ పర్యటనకు వెళ్లినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇన్నిరోజులు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని తానే అని చెప్పుకున్న సిద్దరామయ్య.. పార్టీ ఆదేశిస్తే సీఎం పదవిని త్యాగం చేస్తానని చెప్పి అందరినీ విస్మయానికి గురిచేశారు. సీఎంగా దళితుడిని ఎంపిక చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే తమకు 125–130 సీట్లు ఖాయమని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ఓట్ల కౌంటింగ్ కోసం అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పిన నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి సింగపూర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జేడీఎస్ కింగ్‌మేకర్‌గా అవతరిస్తుందని మీడియా అంచనాల వేళ శనివారం రాత్రి ఆయన సింగపూర్‌కు వెళ్లడం పలు ఊహాగానాలకు తెరలేపింది. కర్ణాటకలో హంగ్ వస్తే ఏం చేయాలనేదానిపై బీజేపీ నేతలతో చర్చలు జరిపేందుకే కుమారస్వామి విదేశీ పర్యటన వెళ్లినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కుమారస్వామితో సన్నిహితంగా ఉందని ఆయన ప్రధాన అనుచరుడు ఒకరు పేర్కొన్నారు.
కాగా వైద్య చికిత్సల కోసమే తాను సింగపూర్ వెళ్లానని, ఓట్ల లెక్కింపు జరిగే 15న బెంగళూరు తిరిగి వస్తానని కుమారస్వామి చెప్పడం గమనార్హం. మద్దతిచ్చే పక్షంలో షరతులపై బీజేపీని కుమారస్వామి గట్టిగా డిమాండ్ చేసే అవకాశముంది. 2006లో బీజేపీ– జేడీఎస్ సంకీర్ణ కూటమి సర్కారులో కుమారస్వామి సీఎంగా పనిచేశారు. ఏడాదిన్నర అనంతరం ఒప్పందానికి అనుగుణంగా బీజేపీకి అధికారం అప్పగించేందుకు కుమారస్వామి నిరాకరించడంతో బీజేపీ మద్దతు ఉపసంహరించింది. ఆ పరిణామాల నేపథ్యంలో బీజేపీ– జేడీఎస్‌లు మళ్లీ కలిసి పనిచేస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దేవెగౌడ, కుమారస్వామిలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సిద్దరామయ్యకు గుణపాఠం చెప్పాలని వారు కృతనిశ్చయంతో ఉన్నారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: అమిత్‌షా
పణజి: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. పణజిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మెజారిటీ సీట్లు సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రచారానికి కొందరు ప్రముఖులు దూరం
నువ్వానేనా అన్నట్లు సాగిన కర్ణాటక ఎన్నికల పోరులో అతిరథమహారథులు తరలివచ్చి ప్రచారంలో పాల్గొనగా, కొందరు ప్రముఖ నేతలు మాత్రం దూరంగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ప్రచారంలో పాల్గొనలేదు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి, సినీనటి రమ్యను ప్రచారానికి ఆహ్వానించినా.. ఆసక్తి చూపలేదని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఆమ్ ఆద్మీ అభ్యర్థుల తరఫున ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రచారం చేయాల్సిఉన్నా బిజీగా ఉండడంతో గైర్హాజరయ్యారు.
సంపూర్ణ మెజారిటీతో అధికారం: యడ్యూరప్ప
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 125–130 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 70 స్థానాలకు, జేడీఎస్ 24–25 సీట్లకు పరిమితమవుతాయని జోస్యం చెప్పారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేశారు. తన అంచనాలు ఎన్నడూ తప్పలేదనీ, ఈసారి కర్ణాటకలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. ఓడిపోతానన్న భయంతోనే సీఎం సిద్దరామయ్య తనపై విమర్శలు చేస్తున్నారని యడ్యూరప్ప ఆరోపించారు. మే 15న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో భేటీ కానున్నట్లు వెల్లడించారు.
దళితుడిని సీఎం చేస్తే సమ్మతమే: సిద్దరామయ్య
బెంగళూరు/మైసూరు: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం పదవిని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. దళితుడ్ని అధిష్టానం ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే తనకు ఆమోదయోగ్యమేనని వ్యాఖ్యానించారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సహా అందరూ సమ్మతిస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం సముచితమన్నారు. మైసూర్‌లోని ఆయన మాట్లాడుతూ.. ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రావడంపై స్పందిస్తూ.. ‘అవి రెండ్రోజుల పాటు సాగే వినోదం మాత్రమే. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం’ అని ట్వీట్ చేశారు.
రికార్డు స్థాయి ఓటింగ్
కర్ణాటకలో శనివారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 72.13శాతం ఓటింగ్ నమోదైంది. 1952 సాధారణ ఎన్నికల తర్వాత ఇదే అత్యధికమని ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్‌కుమార్ తెలిపారు. మహిళలు, యువత ఎక్కువమంది ఓటు హక్కు వినియోగించుకోవటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 2013 ఎన్నికల్లో 71.45శాతం ఓటింగ్ రికార్డు కాగా, ఈసారి అంతకంటే ఎక్కువ నమోదు కావటం విశేషమన్నారు. ఈ ఎన్నికల్లో రూ.94 కోట్ల నగదుతోపాటు రూ.24.78 కోట్ల విలువైన మద్యం, రూ.66 కోట్ల విలువైన వాహనాలు, దుస్తులు, ఇతర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. భారీగా నకిలీ ఓటరు కార్డులు లభ్యం కావటంతో నిలిచిన రాజరాజేశ్వరి నియోజకవర్గ ఎన్నికలను ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment