సోనియా గాంధీతో రాహుల్ (పాత ఫొటో)
సాక్షి, బెంగళూరు : కర్ణాటక సాధారణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం తీవ్ర స్థాయిలో స్పందించారు. తాను చూసిన చాలా మంది భారతీయుల కేంటే సోనియానే గొప్ప భారతీయురాలని అన్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రత్యేకించి తనపైనా, తల్లి సోనియాపైనా వ్యక్తిగత విమర్శలు సంధించడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘నా తల్లి ఇటలీ దేశస్తురాలు. కానీ ఆమె జీవితంలో అధిక భాగం భారత్‌లోనే గడిపారు. దేశ సేవకే అంకితమయ్యారు. భారతీయులమని చెప్పుకునే చాలా మంది కంటే.. తానొక భారతీయురాలినని గొప్పగా చెప్పుకునేందుకు ఆమెకు మరింత అర్హత ఉంది’ అని రాహుల్ పేర్కొన్నారు.
ప్రధాని స్థాయిని మరచి, దిగజారి మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటాన్ని ఆయన విజ్ఞతకే వదిలిస్తున్నానని అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని తరచూ‘‘నామ్‌దార్’’ (పేరు పెట్టుకున్నవాడు) అంటూ రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడంపై మాట్లాడుతూ.. బుద్ధుడి మాటలను రాహుల్ ఉదహరించారు. ఓ కోపిష్ఠి ఎంత తిడుతున్నా బుద్దుడు స్పందించలేదనీ, ఆగ్రహాన్ని తనకు బహుమతిగా ఇచ్చాడని బుద్ధుడు శిష్యులతో పేర్కొన్నారని వివరించారు.
‘ప్రధాని మోదీ మనసులో ఆగ్రహం ఉంది. అందరిపైనా ఆయనకు కోపమే. నాతో ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారు. అందుకే నేనంటే ఆయనకు కోపం. అయితే కోపం అనేది ఆయనకే సమస్యగానీ నాకు కాదు.’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment