చామరాజ్‌నగర్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చామరాజ్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.
ఇది మాటల సర్కార్ మాత్రమే...
‘కర్ణాటకలో చట్టం సరిగ్గా అమలు కావటం లేదు. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. లోకాయుక్త ప్రమాదకర స్థితిలో ఉంది. అలాంటప్పుడు సాధారణ ప్రజలకు భద్రత ఎక్కడుంది. సిద్ధరామయ్యది మాటల సర్కార్ మాత్రమే. ఓడిపోతానన్న భయంతో సిద్దరామయ్య రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. మంత్రులు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారు. అభివృద్ధి కుంటుపడింది. కర్ణాటకలో ఇప్పుడు 2+1 ఫార్ములాతో రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలను పట్టించుకోకుండా నిద్రలో మునిగిపోతున్న ముఖ్యమంత్రి ఆలోచనే ఇది. ఇది కాంగ్రెస్ మార్క్ రాజకీయం. కేంద్రం సాయం చేస్తుందంటే నిరాకరిస్తారు. మళ్లీ కేంద్రంపైనే విమర్శలు చేస్తారు. దిగజారుడు రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకోవటమే వారి లక్ష్యం’ అని మోదీ మండిపడ్డారు.
రాహుల్‌కు సవాల్...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మోదీ విసుర్లు విసిరారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు బీజేపీని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు. ఆయనకు వారసత్వంపైనే నమ్మకం ఎక్కువ. ప్రధాని పీఠం ఎక్కాలని కలలుకంటున్నారు. ప్రజా నాడి ఏంటో ఆయనకు ఎప్పటికీ అంతుబట్టదు. రాహుల్‌కి ఇదే నా సవాల్. ‘రాహుల్ జీ.. దమ్ముంటే ఓ 15 నిమిషాలపాటు కర్ణాటకలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గురించి పేపర్ చూడకుండా మాట్లాడండి. హిందీ, ఇంగ్లీష్ లేదా మీ మాతృ భాషలో అయినా సరే. మాట్లాడండి చాలూ. బహుశా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆత్రంలో మీరు విచక్షణ మరిచి విమర్శలు చేస్తున్నారు. మీ పార్టీలో ఉన్న మాజీ ప్రధాని(మన్మోహన్ సింగ్) మాటలు కూడా మీరు వినట్లేదని తెలిసింది. కనీసం మీ తల్లి(సోనియాగాంధీని ఉద్దేశిస్తూ) చెప్పే మాటలైనా వినండి. ప్రజలను మూర్ఖులను చేయాలని ప్రయత్నించకండి’ అని మోదీ రాహుల్‌పై విమర్శలు సంధించారు.
యెడ్డీనే సీఎం...
‘కర్ణాటకలో మార్పుల గురించి ఢిల్లీలో ఎప్పటికప్పుడు తెలుస్తుంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీజేపీ పని చేస్తోంది. ఇక్కడ కూడా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. కర్ణాటకకు కాబోయే సీఎం యాడ్యురప్పే’ అని మోదీ ఉద్ఘాటించారు.ఇక కేంద్రం సౌభాగ్య యోజన పథకం కింద 39 గ్రామాలకు.. 4 కోట్ల ఇళ్లకు కరెంట్ సరాఫరా చేసిందని.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఆ పని చేయలేకపోయిందని మోదీ తెలిపారు. బీజేపీ గాలి వీస్తోంది.. అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ, ఇది బీజేపీ సునామీ అని వాళ్లు గుర్తించాలి అని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment