సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ల అభ్యర్థిగా బరాక్ ఒబామా పోటీ చేసినప్పుడు రిపబ్లికన్లు దిగజారుడు విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ఆయన భార్య మిషెల్ ఒబామా స్పందిస్తూ ‘వెన్ దే గో లో, వియ్ గో హై’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు భారత ఎన్నికల ప్రచారంలో అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. వారు నీచమైన విమర్శలకు దిగితే మేము అంతకన్నా నీచమైన విమర్శలకు దిగుతామంటూ పోటీ పడుతున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాల ఊసే లేదు. మేనిఫెస్టోలోని అంశాల గురించి చర్చే లేదు. అడపా దడపా తప్పించి అభివద్ధి కార్యక్రమాల ప్రస్థావనే లేదు.
పాలకపక్ష పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, చిన్న పార్టీ అయినా, పెద్ద పార్టీ అయినా పెద్ద తేడాలు లేవు. రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి, పరస్పరం దిగజారుడు విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లిదండ్రుల గురించి ఒకరు మాట్లాడితే, రాహుల్ గాంధీ తాత పుట్టుపూర్వోత్తరాల గురించి, గోత్రాల గురించి మరొకరు మాట్లాడుతున్నారు. పార్టీల అధికార ప్రతినిధులే మతాల ప్రస్థావన తీసుకొస్తున్నారు. మసీదును విష్ణు ఆలయంగా మార్చండంటూ పిలుపునిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ రాజకీయ నేతయితే ఏకంగా ‘ఆలి వర్సెస్ బజరంగ్ బలి’ యుద్ధం అంటున్నారు.
పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా, సమయం, సందర్భమూ ఏదైనా వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలనే సంస్కతి, సంస్కారాన్ని పాటించిన ఇంద్రజిత్ గుప్తా, చంద్రశేఖర్, అటల్ బిహారి వాజపేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్‌లు నేడెక్కడా?! నాటి నాయకులు విదేశాలకు వెళ్లినప్పుడు దేశ రాజకీయాల గురించి అసలు ప్రస్తావించేవారు. భారతీయుల ఐక్యతను, దేశం గొప్పతనాన్ని చాటిచెప్పే అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు కూడా బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. దేశ నాయకులు ప్రత్యర్థులను ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా చూస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘మౌత్ కా సౌదాగర్, చాయ్‌వాలా, నీచ్’ అని విమర్శిస్తే, సోనియా గాంధీని ‘జెర్సీ ఆవు’ అని, రాహుల్ గాంధీని ‘హైబ్రిడ్ చైల్డ్’ అని, డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ‘పాకిస్థాన్ ఏజెంట్’ అంటూ నీచంగా మాట్లాడుతున్నారు. గతంలో పార్లమెంట్ హాలులో ఎంపీలు వాడివేడిగా చర్చలు జరిపినా, ఘాటుకా విమర్శలు చేసుకున్నా, మళ్లీ పరస్పరం అభినందించుకున్న సన్నివేశాలు అనేకం ఉండేవి. అటల్ బిహారి వాజపేయి తొలిసారిగా ఎంపీగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ పండిట్ నెహ్రూ పాలనను తీవ్రంగా విమర్శించారు. నాడు వాజపేయి వాక్ ఛాతుర్యాన్ని అభినందించిన ప్రధాని పండిట్ నెహ్రూ, ఏదోరోజు వాజ్‌పేయి దేశానికి ప్రధాని అవుతారని కితాబు ఇచ్చారు. ఇందిరాగాంధీని కూడా దుర్గా దేవీగా ఓ సందర్భంలో వాజ్‌పేయి ప్రశంసించారు.
1984లో గ్వాలియర్ నుంచి పోటీ చేసిన వాజపేయి, మాధవరావు సింధియా చేతుల్లో ఓడిపోయినప్పటికీ ఆయన కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారని తెలిసి, ఆయన్ని అఫీసియల్ అసైన్‌మెంట్‌ఫై (1988లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశం కోసం) అమెరికాకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పంపించారు. అలా చేయడం వల్ల ప్రభుత్వం ఖర్చులతో ఆయన అమెరికా వెళ్లడమే కాకుండా ఆయనకు ట్రీట్‌మెంట్ కూడా అందింది. ‘నేడు నేను బతికున్నానంటే అందుకు రాజీవ్ గాంధీయే కారణం’ ఓ ఇంటర్వ్యూలో వాజ్‌పేయి వ్యాఖ్యానించారు కూడా. రాజకీయంగా గాంధీలకు వ్యతిరేకంగా పోరాడిన మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ జీవిత చరమాంకంలో క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రభుత్వ ఖర్చులపై చికిత్స కోసం అమెరికా వెళ్లడానికి నిరాకరిస్తే సోనియా గాంధీ స్వయంగా ఆయన్ని కలుసుకొని ఒప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment