నా పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదు | Rahul Gandhi Slams PM Modi In Bharat Bachao Rally Delhi | Sakshi
Sakshi News home page

నిరసన జ్వాలల్లో తగులబెట్టారు

Published Sat, Dec 14 2019 1:31 PM | Last Updated on Sat, Dec 14 2019 6:12 PM

Rahul Gandhi Slams PM Modi In Bharat Bachao Rally Delhi - Sakshi

న్యూఢిల్లీ: తాను నిజాలు నిర్భయంగా మాట్లాడతానని.. అందుకు ఎన్నటికీ క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. తన పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదని... రాహుల్‌ గాంధీ అంటూ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. ఈ క్రమంలో ‘రేప్‌ ఇన్‌ ఇండియా’ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాహుల్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక రామ్‌లీలా మైదానంలో శనివారం భారత్‌ బచావో ర్యాలీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, రైతు సమస్యలు, లైంగిక దాడులను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. (రాహుల్‌ వ్యాఖ్యలు.. లోక్‌సభలో దుమారం

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ... నేను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నిన్న పార్లమెంటులో డిమాండ్‌ చేసిందని.. సత్యం మాట్లాడినందుకు తానెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. ‘ఏదో ఒకరోజు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా జాతిని క్షమాపణ కోరే సమయం వస్తుంది. అందుకు కారణాలు నేను చెబుతాను. మోదీ విధానాలతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోంది. పేదల వద్ద దోచుకుని అంబానీ, అదానీలకు ఆయన దోచిపెడుతున్నారు. మోదీ వారికి 25 పెద్ద కాంట్రాక్టులు ఇచ్చారు. దేశంలో కిలో ఉల్లి ధర రూ. 200 ఐనా పట్టించుకోవడం లేదు’ అని కేంద్ర సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు.

అదే విధంగా... ‘జీడీపీ వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. నేడు జీడీపీ వృద్ధి 4 శాతంగా ఉంది. అది కూడా బీజేపీ తన పద్ధతిలో జీడీపీని అంచనా వేసినపుడు. గతంలోలాగా ఇప్పుడు కూడా జీడీపీని కొలిస్తే.. అది ప్రస్తుతం 2.5 శాతానికి దిగజారుతుంది. ఇక దేశంలో నేడు వ్యక్తమవుతున్న నిరసనలకు వాళ్లిద్దరే కారణం. మతాల మధ్య చిచ్చుపెట్టి జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రేఖలు సృష్టించారు. అసోం, మిజోరాం, మణిపూర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు వెళ్లి చూడండి. మోదీ ఆ రాష్ట్రాలను నిరసన జ్వాలల్లో తగులబెట్టారు’ అని దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. ‘ టీవీలో ఒక యాడ్‌ ముప్పై సెకన్లపాటు కొనసాగాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. అలాంటిది నరేంద్ర మోదీ టీవీలో రోజూ కనిపిస్తున్నారు. ఆ ఖర్చును ఎవరు భరిస్తారు? వాళ్లందరికీ మోదీ ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోవడం’ లేదు అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్‌ విమర్శల వర్షం కురిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement