మైసూరులోని కేఎం హళ్లిలో రాత్రి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
మైసూరు :రాష్ట్రంలో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఉన్న చాముండేశ్వరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి సీఎం సిద్ధరామయ్య పోటీ చేస్తుండగా, జేడీఎస్ పార్టీ నుంచి జీటీ.దేవెగౌడ బరిలో ఉన్నారు. శుక్రవారం మంచి రోజు కావడంతో సీఎం సిద్దు నామినేషన్ దాఖలు చేయగా, జేడీఎస్ నుంచి జీటీ దేవెగౌడ సైతం నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ముందస్తుగా పోలీసులు సీఎం సిద్దరామయ్యకు నామినేషన్ దాఖలుకు మధ్యాహ్నం 12.30 గంటలకు సమయం కేటాయించారు.
అదే సమయంలో జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడకు మధ్యాహ్నం 1.30 గంటలకు సమయం ఇచ్చారు. సీఎం సిద్దు ఆలస్యంగా రావడంతో జీటీ దేవెగౌడ సహా ఆయన అభిమానులు, కార్యకర్తలు పోలీసులు ఇచ్చిన సమయానికి అక్కడికి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పరిస్థితి అదుపు చేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి తరిమివేశారు. అనంతరం సీఎం సిద్దు భారీ బందోబస్తు మధ్య నామినేషన్ దాఖలు చేయగా అనంతరం జీటీ దేవెగౌడ కూడా నామినేషన్ దాఖలు చేసి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment