Video Posted
-
హత్య చేసి.. ఆపై ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసి
నిజాంపేట్: ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ గ్యాంగ్ ప్రత్యర్థి కోసం కాపు కాసి పక్కా స్కెచ్‌తో అదును చూసి అంతమొందించింది. ఆపై హత్యకు ఉపయోగించిన కత్తులు పట్టుకొని నృత్యాలు చేస్తూ రక్తంతో తడిసిన చేతులతో రీల్స్ చేసి లెక్క సరిపోయింది..పగ తీర్చుకున్నామంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టి సంచలనం సృష్టించింది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలోని బోరబండలో నివాసముండే షేక్ షరీఫ్ గ్యాంగ్‌స్టర్. చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండేవాడు. ఓ కేసు విషయంలో షేక్ షరీఫ్ జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన దగ్గర నంబర్–2గా ఉన్న తరుణ్‌రాయ్ గ్యాంగ్ మొత్తానికి తన ఆదీనంలోకి తీసుకున్నాడు. దీంతో షరీఫ్, తరుణ్రాయ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2023లో దసర పండగరోజున రావణ దహనం సందర్భంగా షరీఫ్ గ్యాంగ్ తరుణ్రాయ్ను హత్య చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాలుపంచుకోగా, ప్రగతినగర్‌లో హత్యకు గురైన తేజస్ అలియాస్ తేజు అలియాస్ డీల్ ఏ3గా ఉన్నాడు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన తేజస్ బెయిల్‌పై బయటకు వచ్చాక తేజస్ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లోబతుకమ్మకుంట వద్ద ఓ అపార్ట్మెంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. తన గ్యాంగ్ స్నేహితులతో మాట్లాడటం, కలిసి పార్టీలు చేసుకోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో తేజస్ తన స్నేహితులతో నెక్ట్స్ టార్గెట్ సమీర్ అని..అతడిని కూడా లేపేస్తామంటూ మాట్లాడినట్టు ప్రత్యర్థులకు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తేజస్ తల్లి ఇంట్లో లేకపోవడంతో బోరబండ నుంచి స్నేహితులు మహేశ్, శివప్ప, మహేశ్‌లు ప్రగతినగర్‌కు వచ్చారు. తేజస్ ఇంట్లో నలుగురు కలిసి మద్యం సేవిస్తున్నారు. వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో శివప్ప రెండు గ్యాంగ్‌లకు కామన్ ఫ్రెండ్. దీంతో ప్రత్యర్థులు శివప్పతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసి, శివప్పతో లోకేషన్ షేర్ చేయించుకున్నారు. దాని ఆధారంగా ప్రగతిగనగర్లోని తేజస్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు.. తెల్లవారుజామున ఫుల్‌గా తాగిన తేజస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బైక్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తేజస్‌పై కత్తులతో సమీర్, శివప్ప, సిద్దేశ్వర్, జయంత్‌లు విచక్షణరహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం కత్తులు చూపుతూ రీల్స్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రీల్స్‌కు రక్తచరిత్ర సినిమాలోని పాటను జత చేశారు. హత్యకు పాల్పడిన వారిని, తేజస్‌తో మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
అమిత్ మాలవీయాపై కర్ణాటకలో కేసు నమోదు
బెంగళూరు/న్యూఢిల్లీ: బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయాపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు మాలవీయాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మాలవీయా ఓ వీడియోను పోస్టు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు రగిలించడమే మాలవీయా ఉద్దేశమని ఆరోపించారు. ఇదిలా ఉండగా, తనపై కర్ణాటకలో కేసు నమోదు కావడంపై మాలవీయా ట్విట్టర్లో ప్రతిస్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో రాహుల్ గాంధీ ఓ పావు అని విమర్శించారు. మాలవీయాపై కేసు పెట్టడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తప్పుపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. -
5 టు 95
మానవ పరిణామక్రమం లాగే మనిషి వయసుకు సంబంధించిన రూప పరిణామక్రమం కూడా ఆసక్తికరమే. అయిదు సంవత్సరాల వయసు ఉన్న బాలిక 95 ఏళ్ల వృద్ధురాలు అయ్యేక్రమంలో ఎన్ని రూపాల్లో కనిపిస్తుందో చూపే ఈ వీడియో వైరల్ అవుతోంది. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈ హైపర్ రియలిస్టిక్ ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేస్తే 1.8 లక్షల వ్యూస్ వచ్చాయి. బోలెడు లైక్‌లు వచ్చాయి. ‘మా అమ్మ వయసు 72 సంవత్సరాలు. ఆమె పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు దిగిన ఫొటో మా ఇంట్లో ఉంది. ఆ ఫొటోను, అమ్మను చూసినప్పుడల్లా ఈ ఇద్దరూ నిజంగా ఒకరేనా? లేకపోతే వయసు ఆధారంగా కొత్త వ్యక్తులు ఆ వ్యక్తిలోకి వస్తుంటారా!’ అనే ధర్మసందేహాన్ని వెలిబుచ్చాడు ఒక నెటిజనుడు. ఈ సందేహం మాట ఎలా ఉన్నా ‘ఈ హైపర్ రియాలిటీ ఏఐ టెక్నాలజీతో 95 ఏళ్ల వయసులో నేను ఎలా ఉంటానో చూసుకోవాలని ఉంది’ అని సందడి చేస్తున్న నెటిజనుల సంఖ్యే ఎక్కువ. -
కాంట్రాక్టులన్నీ అదానీకే ఎందుకు: రాహుల్
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు ఎయిర్‌పోర్టుల కాంట్రాక్టులను అదానీ గ్రూప్‌కే కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మేజిక్‌తో అదానీ లాభపడ్డారని పేర్కొన్నారు. సోమవారం మిత్ర–కాల్ పేరుతో రాహుల్ గాంధీ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఒక వీడియోను విడుదల చేశారు. ‘మిత్ర–కాల్లో కబ్జారాజ్యం నడుస్తోంది. విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, భద్రతాబలగాలు, మీడియా, బొగ్గు, ఇంధనం..ఇలా అన్నిటిపై పెత్తనాన్ని ఒక్కరికే అప్పగించారు. వీటిపై మీడియా మాట్లాడదు. నా ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పరు’అని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌లో అక్రమాలు, దేశ సంపద లూటీ అవుతున్న తీరుపై పార్లమెంట్లో వెల్లడించిన నిజాలను ప్రభుత్వం రికార్డులనుంచి తొలగించిందని అందులో పేర్కొన్నారు. ‘ఫకీర్ తన మేజిక్‌తో సంచీలోంచి తీసిన ఎయిర్‌పోర్టును అదానీ చేతుల్లో పెట్టారు’అంటూ ఆయన ట్వీట్ చేశారు. గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తాను తప్ప వ్యాపార సంస్థలను కాదని రాహుల్ చెప్పారు. -
ఆస్పత్రి బయట ట్రంప్ చక్కర్లు
వాషింగ్టన్: మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ ఉన్నట్లుండి ఆస్పత్రి బయటకు వచ్చి కారులో తన అభిమానులకు అభివాదం చేస్తూ కలియదిరిగారు. ట్రంప్ చర్య సబబుకాదని మిలటరీ ఆస్పత్రి వైద్యుడు, డెమొక్రాట్లు విమర్శలు చేశారు. అయితే తన ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేస్తున్న అభిమానులకు ఉత్తేజం కలిగించేందుకే ఇలా చేసినట్లు ట్రంప్ చెప్పారు. గురువారం ట్రంప్, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే! అనంతరం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం మిలటరీ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తన అభిమానుల కోసం ఆయన బయటకు వచ్చి కలియదిరిగారు. ఇదే వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాస్కు ధరించి కనిపించారు. కరోనాపై పలు అంశాలను ఆస్పత్రిలో చేరడంతో తెలుసుకున్నానని ఆయన చెప్పారు. ఈ చక్కర్లకు తగిన భద్రత కల్పించామని వైట్‌హౌస్ అధికారులు చెప్పారు. మెడికల్ టీమ్ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు. అయితే ఒకపక్క 2లక్షలకు పైగా ప్రజలు కరోనాతో మరణించారని, ఈ సమయంలో కూడా ట్రంప్ తన ప్రచార యావ వదలడం లేదని డెమొక్రాట్ నేత హకీమ్ జెఫర్రీస్ విమర్శించారు. అదేవిధంగా ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ జేమ్స్ ఫిలిప్స్ సైతం ట్రంప్ చర్యను తప్పుబట్టారు. ఈ పర్యటనతో కరోనా వ్యాప్తి ముప్పు పెరుగుతుందన్నారు. ట్రంప్ చర్యతో ఈ చక్కర్లలో పాల్గొన్న వారంతా 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సిఉంటుందన్నారు. ఇది అనాలోచిత చర్యగా విమర్శించారు. డబ్ల్యూహెచ్‌సీఏ సైతం ట్రంప్ చర్యను ఆక్షేపించింది. కాగా, సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) ట్రంప్ డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని, తదుపరి చికిత్స వైట్ హౌజ్‌లో కొనసాగించవచ్చని డాక్లర్లు కూడా చెప్పారన్నాయి. అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల గడువు కూడా లేకపోవడంతో.. అనారోగ్యాన్ని పక్కనబెట్టి మరీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. కాగా వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ఎనానీకి సైతం సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. -
కోలుకుంటున్నాను.. కానీ...
వాషింగ్టన్: కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వైట్‌హౌస్ కూడా అధ్యక్షుడి ఆరోగ్యంపై పూటకో రకంగా ప్రకటనలు చేయడం, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడంతో ట్రంప్ ఆరోగ్యం ఎలా ఉందా అన్న సందేహాలు అందరినీ వేధించాయి. ప్రధానంగా వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ ట్రంప్ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉందని, మరో రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని, తన పేరు బయటకు వెల్లడి చేయొద్దంటూ విలేకరులకు చెబుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయన నేరుగా మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడిని ఆస్పత్రికి తీసుకురావడానికి ముందు ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గిపోయాయని, ఆయనకు కృత్రిమంగా శ్వాస అందించామని వెల్లడించారు. వైద్య నిపుణుల సలహా మేరకే ఆయనను మిలటరీ ఆస్పత్రికి తరలించామన్నారు. తన ఆరోగ్యం గురించి అలా మాట్లాడిన మీడోస్పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. కాగా ట్రంప్ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యబృందం తెలిపింది. రాబోయే రోజుల్లో అసలు పరీక్ష ఈ పరిణామాలతో ట్రంప్ శనివారం స్వయంగా వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి ఒక వీడియో విడుదల చేశారు. నాలుగు నిమిషాలు ఉన్న ఆ వీడియోలో తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలోనే ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. అయితే రాబోయే రోజుల్లోనే అసలైన పరీక్ష ఎదురవబోతోందన్నారు. ‘‘నేను ఆస్పత్రికి వచ్చిన సమయానికి నాకు వంట్లో అంతగా బాగా లేదు. కానీ ఇక్కడ చికిత్స మొదలయ్యాక బాగానే ఉంది. నేను కోలుకోవడానికి అందరం కలిసి అత్యంత శ్రమిస్తున్నాం. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలపడానికి నేను త్వరగా బయటకి రావాలి’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘‘నేను కరోనా వైరస్‌తో పోరాడుతున్నాను. త్వరలోనే దానిని ఓడిస్తాను. ఇంకా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాల్సి ఉంది. కానీ అసలు సిసలైన పరీక్ష ముందుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలీదు. ఈ సమయంలో అన్ని వర్గాల వారు నాకు అండగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. మెలానియా కూడా ధైర్యంగా పోరాడుతున్నారు’’ అని ట్రంప్ ఆ వీడియోలో చెప్పారు. తాను గతంలో కరోనా వైరస్‌కు ఇవ్వాల్సిన మందుల గురించి చెబితే అందరూ తనని హేళన చేశారని, ఇప్పుడు అవే ఔషధాలు తనకు ఇవ్వడం వల్ల త్వరగా కోలుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. ఆ వీడియోలో ట్రంప్ తెల్ల షర్టు, బ్లూ కోటు వేసుకొని ఉన్నారు. ఆయన చూడడానికి బాగానే ఉన్నప్పటికీ, మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఉన్నంత ఉత్సాహం కనిపించలేదు. ఆస్పత్రిలోనే ఉంటూ ట్రంప్ అధ్యక్షుడిగా రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఆరోగ్యం ప్రమాదకరమా? ట్రంప్ వీడియో విడుదల చేయడానికి ముందు వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే అధ్యక్షుడు ఇంకా ప్రమాదం నుంచి బయటడపడలేదని వెల్లడించారు. అయితే ఆస్పత్రి వైద్యులు ట్రంప్ త్వరగా కోలుకుంటారన్న ఆశాభావంతో ఉన్నారని అన్నారు. గత 24 గంటల్లో ట్రంప్‌కి జ్వరం కూడా రాలేదన్న కాన్లే మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్‌లో ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నాయని తెలిపారు. ట్రంప్‌కి రెమిడెసివిర్ ఇంజెక్షన్ రెండో డోసు ఇచ్చా మని చెప్పారు. మరోవైపు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ కూడా ట్రంప్ బాగా కోలుకుంటున్నారని చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఓ ఇంటర్వ్యూలో..ఆస్పత్రిలో చేరిన తర్వాత ట్రంప్ ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చిందన్నారు. వీడియో ఎడిట్ చేశారా? అధ్యక్షుడు ట్రంప్‌కి దగ్గు బాగా ఎక్కువగా ఉందని, ఆ విషయం తెలీకుండా ఆయన విడుదల చేసిన వీడియోని ఎడిట్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియో చూసిన నెటిజన్లు ట్రంప్ మధ్యలో కాస్త వెక్కినట్టుగా అనిపించిందని, ఆయన భుజం కూడా కాస్త పైకి కదిలిన శబ్దం వినిపించిందని సందేహాలు వ్యక్తం చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా దగ్గు వచ్చిందని, అది తెలీకుండా ఆ వీడియోని ఎడిట్ చేసి పోస్టు చేశారని అంటున్నారు. ఎంఏజీఏ ప్రచారం ప్రారంభం కోవిడ్–19తో ట్రంప్ ఆస్పత్రిలో పోరాడుతూ ఉన్న సమయంలోనే ఆయన శిబిరం కొత్త ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (ఎంఏజీఏ) అన్న కలని సాకారం చేసుకోవడానికి ఆపరేషన్ ఎంఏజీఏ పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ట్రంప్ కుటుంబ సభ్యులు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ట్రంప్ కరోనాతో పోరాడుతున్నప్పటికీ ఏ మాత్రం వెనుకబడి పోకుండా ఉండడానికి స్వింగ్ స్టేట్స్లో ఈ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించనున్నారు. -
ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి
‘‘కొన్ని రోజులుగా ఓ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ సోషల్ మీడియాలో ఉన్న నెగటివిటీ వల్ల ఏం మాట్లాడాలో ఎవరితో చెప్పాలో అర్థం కావడం లేదు’’ అన్నారు అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలీవుడ్లో డ్రగ్స్ కాంట్రవర్శీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం గురించి అక్షయ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘మమ్మల్ని స్టార్స్‌ని చేసింది ప్రేక్షకులే. సినిమాల ద్వారా మన దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని మేం ప్రచారం చేస్తుంటాం. సుశాంత్ మరణం తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. మన ఇండస్ట్రీలో ఉన్న తప్పొప్పుల్ని సమీక్షించుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. కానీ అందరూ తీసుకుంటారని కాదు. ప్రతి ఒక్కరినీ దోషులుగా చూడొద్దు. ఇది కరెక్ట్ కాదు’’ అని అన్నారు అక్షయ్ కుమార్. -
పిల్లలు బంక మట్టిలాంటివాళ్లు
‘‘పసి పిల్లల మనసు, శరీరం రెండూ బంక మట్టిలాంటివి. మనం ఎలా మలిస్తే అలా తయారవుతారు. అందుకే చిన్నప్పుడే మంచి అలవాట్లు, మంచి ఆటలు నేర్పిద్దాం’’ అంటున్నారు శిల్పా శెట్టి. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా విలు విద్య ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు శిల్పా. గతంలో ఓ ట్రిప్‌లో భాగంగా ఈ విద్య నేర్చుకున్నారట. అప్పుడు తీసిన వీడియో ఇది అని, నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. క్రీడల ప్రాముఖ్యత గురించి శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘క్రీడలు పిల్లలకు వ్యాయామంలా ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన పోటీ అలవాటు చేస్తాయి. ఏదో నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తాయి. ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. మనం ఆడండి అని పిల్లలకు చెప్పడం కంటే మనం ఆడుతుంటే చూసి ఇంకా చురుకుగా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. శుక్రవారంతో ఫిట్ ఇండియా ఉద్యమానికి ఏడాది పూర్తవుతుంది. తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే... మీ పిల్లలకు ఏదో ఒక ఆట నేర్పిస్తూ ఉండండి. మీరు కూడా నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా ఉండండి’’ అన్నారు. -
అసంపూర్ణం కూడా సంపూర్ణమే!
బాడీషేమింగ్ చేసేవాళ్లను ఉద్దేశించి ‘షేమ్ షేమ్’ అంటున్నారు సమీరా రెడ్డి. ‘‘మనం ఎలా ఉంటే అలా స్వీకరించడాన్ని నేర్చుకుందాం. మనల్ని మనం ఇష్టపడదాం. పోల్చుకోవడం మానేద్దాం. పోల్చి చూడటం ఆపేద్దాం’’ అని కూడా అన్నారు సమీరా. బాడీషేమింగ్ గురించి ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారామె. ఇటీవలే తల్లి అయిన ఒక అమ్మాయి పంపిన మెసేజ్ చూసి ఈ విషయం మీద ఈ వీడియో చేసినట్టు తెలిపారు సమీరా. వీడియో సారాంశం ఈ విధంగా... ‘‘సమీరా.. ఈ మధ్యనే తల్లయిన నేను బరువు పెరిగాను. నా శరీరం నాకే నచ్చడం లేదు. అసహ్యంగా ఉన్నాను అనిపిస్తోంది’ అనే మెసేజ్ నాకు వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. మన దగ్గర ఏం లేదో (జీరో సైజ్ అయినా ఇంకేదైనా..) దాని గురించే పదే పదే ఆలోచించి బాధపడటం మానేద్దాం. మన దగ్గర ఉన్నదానితో సంతోషపడటం నేర్చుకుందాం. చిన్నప్పటి నుంచి నన్ను మా అక్కయ్యలతోనో ఎవరో ఒకరితోనో పోలుస్తూనే ఉన్నారు. తను అలా ఉంది.. నువ్వు ఇలా ఉన్నావు అని. ఇక నేను పని చేసిన ఇండస్ట్రీ చేసే పనే అది.. పోల్చి చూడటం. దాంతో నేను చూడటానికి బావుండాలని చేయని ప్రయత్నం లేదు. మేకప్, లెన్స్, ప్యాడ్స్.. ఇలా అన్నీ వాడాను. ఇలాంటివి చేసినా సంతోషంగా ఉన్నానా? అంటే అస్సలు లేదు. మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు. సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. చాలా ఏళ్లుగా ఇలాంటి షేమింగ్స్తో విసుగెత్తిపోయాను. పట్టించుకోవడం మానేశాను. మనం సంతోషంగా ఉన్నామా? లేదా అనే విషయం మీదే దృష్టి పెట్టాను. మీరు కూడా అదే పాటించండి. లావుగా ఉన్నారా? ఏం ఫర్వాలేదు.. మెల్లిగా తగ్గుతారు. కంగారుపడకండి.. కుంగిపోకండి. అనవసరమైన విమర్శలతో వేరే వాళ్లు కుంగిపోయేలా చేయకండి. సంతోషంగా ఉండటంపైనే ఫోకస్‌గా ఉండండి. అసంపూర్ణాన్ని కూడా ఆస్వాదిద్దాం. అసంపూర్ణం కూడా సంపూర్ణం అనుకుందాం. అప్పుడు చాలా బాగుంటుంది!’’ అని ఆ వీడియోలో సమీరా రెడ్డి చెప్పిన మాటలు చాలా అర్థవంతంగా, ధైర్యం నింపేలా ఉన్నాయి. సమీరా రెడ్డి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. తల్లయినప్పటి నుంచి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాంటి విషయాలు చర్చిస్తూ, అవగాహన తీసుకొస్తూ, అభద్రతాభావంతో బాధపడేవాళ్లకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. -
ధోనికి జీవా మేకప్
న్యూఢిల్లీ: ధనాధన్ ఆటతో క్రికెట్‌కు దూరమైన ధోని అభిమానులకు ఓ పాత వీడియో కొంత ఊరటనిస్తోంది. అతని గారాల తనయ జీవాతో తను తీర్చుకునే అచ్చట, ముచ్చట సామాజిక మాధ్య మాల్లో ధోని పంచుకుంటాడు. అయితే ధోనికి జీవా మేకప్ వేసే ఈ వీడియో మాత్రం అతను షేర్ చేయ లేదు. అతని మేకప్ ఆర్టిస్ట్ సప్న భవ్నానీ ఈ పాత వీడియోను పోస్ట్ చేసింది. జీవా తన చిట్టిపొట్టి చేతులతో తండ్రికి మెరుగులు దిద్దింది. ‘అందరికీ ముద్దొచ్చే మేకప్ ఇది. దీంతో నా ఉద్యోగానికి (మేకప్ ఆర్టిస్ట్) త్వరలోనే ఎసరొచ్చేలా ఉంది! మహి... మిస్ యూ దోస్త్’ అని ట్వీట్ చేసింది. ఇదిలావుండగా మాయదారి మహమ్మారి ప్రాణాల్ని తోడేస్తోంది. అలాగే ఎందరో ఆశల్ని చిదిమేస్తోంది. ఇప్పుడు ధోని అభిమానుల పట్ల అదే పని చేసింది. గత ప్రపంచకప్ సెమీస్ తర్వాత మాజీ కెప్టెన్ మహి మళ్లీ బరిలోకి దిగలేదు. కనీసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అయినా ఆడలేకపోతాడా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ కరోనా వైరస్ లీగ్‌ను జరగనివ్వడం లేదు. -
సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక యాదాద్రి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో వీడియోను పోస్టు చేశారు. ప్రతి ఫొటోలో యాదాద్రి పునర్ నిర్మాణ విశిష్టతను పేర్కొన్నారు. ‘యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. కొత్త హంగులతో ఆలయం భక్తులకు దర్శనం ఇవ్వనుంది. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం సీఎం కేసీఆర్ మరో గొప్పతనం’అని పేర్కొన్నారు. ఆలయం పునర్ నిర్మాణం మొత్తం రాతితోనే జరిగిందన్న ఆయన.. రెండున్నర లక్షల టన్నుల గ్రానైట్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. ఆలయం మొత్తం గ్రానైట్‌తో కట్టిన, దేశంలో అతిపెద్ద టెంపుల్‌గా యాదాద్రి నిలిచిపోతుందని, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం, ప్రాచీన కట్టడం మాదిరిగా పునర్ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే 2000 సంవత్సరాల వరకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, భారత్‌లోనే అద్భుత కట్టడంగా ఆలయం నిలిచిపోతుందని ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ పోస్టును స్థానిక యువకులు డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్‌గా, ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఇతరులకు షేర్ చేస్తున్నారు. -
మాజీ మిస్ ఇండియాకు వేధింపులు
కోల్‌కతా: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న తనను కొందరు ఆకతాయిలు వేధించారని మాజీ మిస్ ఇండియా, నటి ఉషోషి సేన్‌గుప్తాను తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపింది. 2010లో ఆమె మిస్ఇండియాగా గెలిచారు. కాగా, వేధింపుల వీడియోను ఆమె ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. సోమవారం రాత్రి 11:40 గంటలకు కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. ఉషోషి తెలిపిన వివరాల ప్రకారం.. సహోద్యోగితో కలసి వెళ్తున్న ఉషోషి కారును కొందరు ఆకతాయిలు బైక్‌తో ఢీకొట్టి, కారు డ్రైవర్‌ను బయటకు లాగారు. ఈ గొడవను ఆమె ఫోన్లో రికార్డ్ చేసి కేసు నమోదుచేయాలని దగ్గర్లోని పోలీస్స్టేన్కు వెళ్లారు. ఘటనప్రాంతం తమ పరిధిలోది కాదని చెప్పడంతో ఆమె ఇంటికి తిరుగుపయనమైంది. ఈ సమంలో ఆకతాయిలు మళ్లీ వచ్చి రాళ్లతో దాడి చేశారు. కాగా, ఫేస్బుక్ పోస్టును పరిశీలించిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
నీ లోటు తీరనిది
ఈ జూన్ 2న బోనీ కపూర్, శ్రీదేవి తమ 22వ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకోవాల్సింది. కానీ శ్రీదేవి దురదృష్టవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ట్వీటర్ అకౌంట్‌ను ఆమె భర్త బోనీ కపూర్ మొయింటేన్ చేస్తున్నారు. పెళ్లి రోజు సందర్భంగా శ్రీదేవి చివరిసారిగా దుబాయ్‌లో అటెండ్ అయిన వెడ్డింగ్ ఈవెంట్ వీడియోను పోస్ట్ చేసి– ‘‘ఈ రోజు మన 22వ వెడ్డింగ్ యానివర్శరీ అయ్యుండేది. జాన్.. నా సోల్‌మేట్, నువ్వు ప్రేమానురాగాలకు నిర్వచనం. నీ ప్రేమను, అనుభూతులను, జ్ఞాపకాలను ఎప్పటికీ నాలోనే దాచుకుంటాను. లెజెండ్ అన్న దాని కంటే కూడా నువ్వు ఎక్కువ. నువ్వు లేని లోటు కచ్చితంగా తీరనిది’’ అని పేర్కొన్నారు బోనీ. తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్శరీ సందర్భంగా ‘బోనీ శ్రీదేవిని ముద్దాడుతున్న’ ఫొటోను షేర్ చేశారు కుమార్తె జాన్వీ. బీటౌన్‌లో జాన్వీ నటించిన తొలి చిత్రం ‘ధడక్’ వచ్చే నెల 20న రిలీజ్ కానుంది. -
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దళిత వ్యతిరేకులు
న్యూఢిల్లీ: దళిత వ్యతిరేక ఆలోచనా ధోరణి కలిగిన బీజేపీ – ఆర్ఎస్ఎస్లు.. సమాజంలో దళితులు అట్టడుగునే కొనసాగాలన్న ఫాసిస్ట్ భావజాలంతో ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన .. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ల నేతల వ్యాఖ్యలు, కొన్ని ఘటనలతో కూడిన వీడియోను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. రెండు నిమిషాల నిడివున్న ఆ వీడియోలో 2016లో గుజరాత్లో జరిగిన ఉనా ఘటన, మధ్యప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక సందర్భంగా అభ్యర్థుల చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాయటం వంటివి ఉన్నాయి. మోదీ పాలనలో దళితులు లెక్కలేనన్ని దురాగతాలకు బలవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా ఆయన కాపాడలేక పోయారని ఆరోపించారు. దేశంలో ప్రతి 12 నిమిషాలకో దళితుడు వేధింపులకు, రోజుకు ఆరుగురు దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారన్నారు. -
మోదీజీ.. సమాధానమేదీ?
న్యూఢిల్లీ: కర్ణాటక విధానసభ ఎన్నికల్లో బీజేపీ అవినీతిపరులకు టికెట్లిచ్చిందనీ, దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ డిమాండ్ చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పపై 23 అవినీతి, మోసం, ఫోర్జరీ కేసులున్నాయనీ, ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు జరిపిన గాలి జనార్ధన రెడ్డి మనుషులకు 8 టికెట్లు ఇచ్చారని రాహుల్ దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థులు మోదీ సహా వివిధ బీజేపీ నాయకులతో దిగిన ఫొటోలతో కూడిన ఓ వీడియోను ‘కర్ణాటకాస్ మోస్ట్ వాంటెడ్’ పేరుతో రాహుల్ ట్వీటర్లో పోస్ట్ చేశారు. ‘మోదీ. మీరు చాలా ఎక్కువ మాట్లాడతారు. కానీ సమస్యేంటంటే మీ మాటలకు చేతలకు పొంతనే ఉండదు’ అని ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు శ్రీరాములు, సోమ శేఖర రెడ్డి, కట్టా సుబ్రమణ్య నాయుడు, సీటీ రవి మరికొందరు బీజేపీ అభ్యర్థులపై అవినీతి కేసులున్నాయని రాహుల్ వెల్లడించారు. మీదీ పీపీపీ పార్టీయే: సిద్దరామయ్య బెంగళూరు: కాంగ్రెస్‌ను మోదీ పీపీపీ–కాంగ్రెస్ (పంజాబ్, పుదుచ్చేరి, పరివార్–కాంగ్రెస్) అని విమర్శించడంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. బీజేపీ కూడా పీపీపీ పార్టీయేననీ, అంటే జైళ్లు (ప్రిజన్), ధరల పెరుగుదల (ప్రైస్ రైజ్), పకోడా పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల ఆస్తులు భారీగా పెరిగాయన్న మోదీ ఆరోపణపై స్పందిస్తూ.. ‘మీ సీఎం అభ్యర్థి ఏకంగా చెక్ ద్వారా లంచం తీసుకున్నారు. గాలి జనార్ధన రెడ్డి నోట్లరద్దు సమయంలో 500 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కూతురి పెళ్లి చేశారు’ అని సిద్దరామయ్య గుర్తుచేశారు. మోదీ అనవసర విషయాలు కాకుండా ఇక్కడి ప్రజల సమస్యలపై, కర్ణాటక విషయాలపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. -
జాకీ కూతురికి కష్టాలా?
‘‘నాకు ఇల్లు లేదు’’ అంటున్నారు జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్జీ. మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీ చాన్ కుమార్తెకు ఇల్లు లేకపోవటమేంటి? అనే సందేహం కలగవచ్చు. కానీ ఎట్టా ఎన్జీ జాకీ చాన్ సొంత కుమార్తె కాదు. హాంగ్‌కాంగ్ బ్యూటీ క్వీన్ ఎన్జీతో జాకీ ఎఫైర్ సాగించినప్పుడు కలిగిన సంతానమే ఎట్టా. ‘‘ప్రస్తుతం నేను ఉండటానికి ఇల్లు కూడా లేదు, కారణం మా పేరెంట్స్ బిహేవియరే’’ అని ఓ వీడియో అప్లోడ్ చేశారు ఎట్టా. ‘‘నేను జాకీచాన్ కూతుర్ని. నా గర్ల్‌ఫ్రెండ్ పేరు ఆండీ. నెల రోజులుగా మేం ఇల్లు లేకుండా ఉన్నాం. బ్రిడ్జ్‌ల కింద పడుకున్నాం. మా పేరెంట్స్ ‘హోమోఫోబిక్’ బిహేవియర్ కారణంగానే మేం ఇల్లు లేనివాళ్లం అయ్యాం. మేం పోలీసుల దగ్గరకు, హాస్పిటల్స్, ఫుడ్ బ్యాంక్స్, ఎల్జీబీటి (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్) సెంటర్స్‌కు వెళ్లాం సహాయం కోసం. కేవలం మేమిద్దరం లెస్బియన్స్ (స్వలింగ సంపర్కులం) అనే కారణంగానే మాకెవరూ సహాయపడటంలేదు. ఈ కారణంగానే కన్నవాళ్లు కూడా దూరం పెట్టేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టా. అయితే విషయం ఏంటంటే.. జాకీచాన్‌కు ఒకప్పుడు ఎన్జీతో సంబంధం ఉన్నప్పటికీ ఆమె ద్వారా కలిగిన ఎట్టాను ఆయన ఓన్ చేసుకోలేదనే టాక్ ఉంది. -
సౌదీలో ఓ భారతీయుడి కష్టాలు..
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులకు ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదురవుతుంటాయి. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన అబ్దుల్ సత్తార్ మకందర్ (35) అనే భారతీయుడు తన బాధలను చెప్పుకోవడం కూడా నేరమైంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న మకందర్‌కు ఆయన యజమాని తగిన జీతం ఇవ్వకపోగా, భోజనం చేసేందుకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అంతేగాక భారత్‌కు తిరిగి రాకుండా మకందర్ను అడ్డుకున్నాడు. మకందర్ తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఢిల్లీకి చెందిన కుందన్ శ్రీవాత్సవ అనే ఉద్యమకర్త ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. దీనివల్ల మకందర్ కష్టాలు తీరకపోగా, మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. మకందర్ తప్పుడు సమాచారం అందించారనే నేరం కింద సౌదీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ నుంచి ఈ వీడియో నుంచి తొలగించి, క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్ట్ చేయాలని శ్రీవాత్సవను మకందర్ తోటి ఉద్యోగి కోరాడు. శ్రీవాత్సవ ఈ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించడంతో మకందర్ను విడుదల చేశారు. అయితే వేరే అభియోగాలతో మకందర్ను వెంటనే అరెస్ట్ చేశారు. మకందర్తో మాట్లాడేందుకు ఆయన తల్లి ప్రయత్నించినా వీలు కాలేదు. తాను భారత్‌కు తిరిగి వచ్చేందుకు సాయం చేయాల్సిందిగా మకందర్.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విన్నవించాడు. సౌదీలో దాదాపు 28 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఆ దేశంలో భారతీయులు పడుతున్న బాధల గురించి చాలా కేసులు వెలుగుచూశాయి. పనిమనిషిగా వెళ్లిన ఓ భారతీయురాలి చేతిని గతేడాది నరికివేశారు.