కోలుకుంటున్నాను.. కానీ... | Donald Trump says next few days of COVID-19 treatment will be real test | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్నాను.. కానీ...

Published Mon, Oct 5 2020 1:49 AM | Last Updated on Mon, Oct 5 2020 9:28 AM

Donald Trump says next few days of COVID-19 treatment will be real test - Sakshi

మిలిటరీ ఆస్పత్రి నుంచి విధులు కొనసాగిస్తున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్నాయంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వైట్‌హౌస్‌ కూడా అధ్యక్షుడి ఆరోగ్యంపై పూటకో రకంగా ప్రకటనలు చేయడం, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడంతో ట్రంప్‌ ఆరోగ్యం ఎలా ఉందా అన్న సందేహాలు అందరినీ వేధించాయి.

ప్రధానంగా వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మీడోస్‌ ట్రంప్‌ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉందని, మరో రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని, తన పేరు బయటకు వెల్లడి చేయొద్దంటూ విలేకరులకు చెబుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయన నేరుగా మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడిని ఆస్పత్రికి తీసుకురావడానికి ముందు ఆక్సిజన్‌ లెవల్స్‌ బాగా తగ్గిపోయాయని, ఆయనకు కృత్రిమంగా శ్వాస అందించామని వెల్లడించారు. వైద్య నిపుణుల సలహా మేరకే ఆయనను మిలటరీ ఆస్పత్రికి తరలించామన్నారు. తన ఆరోగ్యం గురించి అలా మాట్లాడిన మీడోస్‌పై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. కాగా ట్రంప్‌ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యబృందం తెలిపింది.

రాబోయే రోజుల్లో అసలు పరీక్ష  
ఈ పరిణామాలతో ట్రంప్‌ శనివారం స్వయంగా వాల్టర్‌ రీడ్‌ ఆస్పత్రి నుంచి ఒక వీడియో విడుదల చేశారు. నాలుగు నిమిషాలు ఉన్న ఆ వీడియోలో తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలోనే ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. అయితే రాబోయే రోజుల్లోనే అసలైన పరీక్ష ఎదురవబోతోందన్నారు. ‘‘నేను ఆస్పత్రికి వచ్చిన సమయానికి నాకు వంట్లో అంతగా బాగా లేదు. కానీ ఇక్కడ చికిత్స మొదలయ్యాక బాగానే ఉంది.

నేను కోలుకోవడానికి అందరం కలిసి అత్యంత శ్రమిస్తున్నాం. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలపడానికి నేను త్వరగా బయటకి రావాలి’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘‘నేను కరోనా వైరస్‌తో పోరాడుతున్నాను. త్వరలోనే దానిని ఓడిస్తాను. ఇంకా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాల్సి ఉంది. కానీ అసలు సిసలైన పరీక్ష ముందుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలీదు.

ఈ సమయంలో అన్ని వర్గాల వారు నాకు అండగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. మెలానియా కూడా ధైర్యంగా పోరాడుతున్నారు’’ అని ట్రంప్‌ ఆ వీడియోలో చెప్పారు. తాను గతంలో కరోనా వైరస్‌కు ఇవ్వాల్సిన మందుల గురించి చెబితే అందరూ తనని హేళన చేశారని, ఇప్పుడు అవే ఔషధాలు తనకు ఇవ్వడం వల్ల త్వరగా కోలుకుంటున్నానని ట్రంప్‌ చెప్పారు. ఆ వీడియోలో ట్రంప్‌ తెల్ల షర్టు, బ్లూ కోటు వేసుకొని ఉన్నారు. ఆయన చూడడానికి బాగానే ఉన్నప్పటికీ, మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఉన్నంత ఉత్సాహం కనిపించలేదు. ఆస్పత్రిలోనే ఉంటూ ట్రంప్‌ అధ్యక్షుడిగా రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.  

ఆరోగ్యం ప్రమాదకరమా?  
ట్రంప్‌ వీడియో విడుదల చేయడానికి ముందు వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ సీన్‌ కాన్లే అధ్యక్షుడు ఇంకా ప్రమాదం నుంచి బయటడపడలేదని వెల్లడించారు. అయితే ఆస్పత్రి వైద్యులు ట్రంప్‌ త్వరగా కోలుకుంటారన్న ఆశాభావంతో ఉన్నారని అన్నారు. గత 24 గంటల్లో ట్రంప్‌కి జ్వరం కూడా రాలేదన్న కాన్లే మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్‌లో ఆక్సిజన్‌ లెవల్స్‌ కూడా బాగానే ఉన్నాయని తెలిపారు. ట్రంప్‌కి రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ రెండో డోసు ఇచ్చా మని చెప్పారు. మరోవైపు వైట్‌ హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మీడోస్‌ కూడా ట్రంప్‌ బాగా కోలుకుంటున్నారని చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఓ ఇంటర్వ్యూలో..ఆస్పత్రిలో చేరిన తర్వాత ట్రంప్‌ ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చిందన్నారు.   

వీడియో ఎడిట్‌ చేశారా?
అధ్యక్షుడు ట్రంప్‌కి దగ్గు బాగా ఎక్కువగా ఉందని, ఆ విషయం తెలీకుండా ఆయన విడుదల చేసిన వీడియోని ఎడిట్‌ చేశారన్న ప్రచారం సాగుతోంది. ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో ఆ వీడియో చూసిన నెటిజన్లు ట్రంప్‌ మధ్యలో కాస్త వెక్కినట్టుగా అనిపించిందని, ఆయన భుజం కూడా కాస్త పైకి కదిలిన శబ్దం వినిపించిందని సందేహాలు వ్యక్తం చేశారు. ట్రంప్‌ మాట్లాడుతుండగా దగ్గు వచ్చిందని, అది తెలీకుండా ఆ వీడియోని ఎడిట్‌ చేసి పోస్టు చేశారని
అంటున్నారు.  

ఎంఏజీఏ ప్రచారం ప్రారంభం
కోవిడ్‌–19తో ట్రంప్‌ ఆస్పత్రిలో పోరాడుతూ ఉన్న సమయంలోనే ఆయన శిబిరం కొత్త ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ (ఎంఏజీఏ) అన్న కలని సాకారం చేసుకోవడానికి ఆపరేషన్‌ ఎంఏజీఏ పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్, ట్రంప్‌ కుటుంబ సభ్యులు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ట్రంప్‌ కరోనాతో పోరాడుతున్నప్పటికీ ఏ మాత్రం వెనుకబడి పోకుండా ఉండడానికి స్వింగ్‌ స్టేట్స్‌లో ఈ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement