సౌదీలో ఓ భారతీయుడి కష్టాలు..
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులకు ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదురవుతుంటాయి. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన అబ్దుల్ సత్తార్ మకందర్ (35) అనే భారతీయుడు తన బాధలను చెప్పుకోవడం కూడా నేరమైంది. డ్రైవర్గా పనిచేస్తున్న మకందర్కు ఆయన యజమాని తగిన జీతం ఇవ్వకపోగా, భోజనం చేసేందుకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అంతేగాక భారత్కు తిరిగి రాకుండా మకందర్ను అడ్డుకున్నాడు. మకందర్ తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఢిల్లీకి చెందిన కుందన్ శ్రీవాత్సవ అనే ఉద్యమకర్త ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్చేశారు.
దీనివల్ల మకందర్ కష్టాలు తీరకపోగా, మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. మకందర్ తప్పుడు సమాచారం అందించారనే నేరం కింద సౌదీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ నుంచి ఈ వీడియో నుంచి తొలగించి, క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్ట్ చేయాలని శ్రీవాత్సవను మకందర్ తోటి ఉద్యోగి కోరాడు. శ్రీవాత్సవ ఈ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించడంతో మకందర్ను విడుదల చేశారు. అయితే వేరే అభియోగాలతో మకందర్ను వెంటనే అరెస్ట్ చేశారు. మకందర్తో మాట్లాడేందుకు ఆయన తల్లి ప్రయత్నించినా వీలు కాలేదు. తాను భారత్కు తిరిగి వచ్చేందుకు సాయం చేయాల్సిందిగా మకందర్.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు విన్నవించాడు.
సౌదీలో దాదాపు 28 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఆ దేశంలో భారతీయులు పడుతున్న బాధల గురించి చాలా కేసులు వెలుగుచూశాయి. పనిమనిషిగా వెళ్లిన ఓ భారతీయురాలి చేతిని గతేడాది నరికివేశారు.