Indian worker
-
భారతీయుడి అసాధారణ పోరాటం
దుబాయ్: స్వదేశంలో తల్లి మరణించినా తిరిగి రావడానికి అనుమతి రాలేదు. భారత్ తిరిగొచ్చేందుకు న్యాయపోరాటం ప్రారంభిస్తే విచారణ రెండేళ్లుగా కొననసాగుతోంది. కోర్టుకు హాజరవడానికి దుబాయ్‌లో ఒకటి కాదు రెండు కాదు దాదాపు వేయి కిలోమీటర్లు పైగానే నడిచాడు అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు జగన్నాథన్ సెల్వరాజ్(48). ఆయన స్వస్థలం తమిళనాడులోని తిరుచిరాపల్లి. ప్రయాణ ఖర్చులకు డబ్బు లేకపోవడంతో దుబాయ్‌లో తాను ఉంటున్న సోనాపూర్ నుంచి విచారణ జరుగుతున్న కరామా జిల్లాలోని లేబర్ కోర్టుకు రానుపోను కలిపి నాలుగు గంటల్లో 50 కిలోమీటర్ల చొప్పున 20 సార్లు నడిచాడు. ఈ క్రమంలో ట్రాఫిక్, ఎండ, తుపానులు, అలసట వంటి వాటిని లెక్కచేయలేదు. ‘నా కేసు సంఖ్య 826. కోర్టుకు చేరుకోవాలంటే ఉదయం రెండు గంటలు, తిరిగి వెళ్లాలంటే మరో రెండు గంటలు పడుతుంది. కోర్టు హియరింగ్ ఉన్న రోజు ఉదయం 4 గంటలకే లేవాలి. ఇలా ప్రతి 15 రోజులకోసారి వెళ్లాలి. విచారణ పూర్తయిన తరువాత సాయంత్రం వరకు అక్కడే విశ్రాంతి తీసుకుని బయలుదేరుతా. సాయం చేయడానికి ఎవరూ లేరు. ఎండాకాలంలో నడక కష్టమే అయినా మరో మార్గం లేదు’ అని సెల్వరాజ్ ఖలీజ్ టైమ్స్‌కు చెప్పాడు. తన తల్లి మరణించిన తరువాత అంత్యక్రియలకు హాజరవయ్యేందుకు భారత్ రావడానికి అనుమతి దొరక్కపోపడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గత కొన్నాళ్లుగా ఓ పార్కులో ఉంటున్నానని, ఆరోగ్యం క్షీణించిందని, భారత్‌కు తిరిగి రావడమే తన ఏకైక కోరిక అని సెల్వరాజ్ అన్నాడు. -
మలేసియాలో భారత కార్మికుడు మృతి
బతుకుదెరువు కోసం మలేసియా వెళ్లిన తెలంగాణ యువకుడు కలవ బాలకృష్ణ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలియని అతని కుటుంబసభ్యులు కలవ బాలకృష్ణ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం(టీమ్)కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో చర్యలు చేపట్టిన టీమ్ కౌలాంలంపూర్ కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట తిగ్గిమ్ ఆసుపత్రిలో ఉన్న బాలకృష్ణ మృత దేహాన్ని మలేసియా, భారతీయ ఎంబసీల సాయంతో హైదరాబాద్ కు పంపించే ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ సొంత ఊరు తెలంగాణలోని నిజామాబాద్ అని తెలిపారు. శవాన్ని దేశానికి పంపేందుకు అయ్యే ఖర్చులను సంఘం సభ్యులు భరిస్తున్నట్లు వివరించారు. -
సౌదీలో ఓ భారతీయుడి కష్టాలు..
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులకు ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదురవుతుంటాయి. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన అబ్దుల్ సత్తార్ మకందర్ (35) అనే భారతీయుడు తన బాధలను చెప్పుకోవడం కూడా నేరమైంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న మకందర్‌కు ఆయన యజమాని తగిన జీతం ఇవ్వకపోగా, భోజనం చేసేందుకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అంతేగాక భారత్‌కు తిరిగి రాకుండా మకందర్ను అడ్డుకున్నాడు. మకందర్ తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఢిల్లీకి చెందిన కుందన్ శ్రీవాత్సవ అనే ఉద్యమకర్త ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. దీనివల్ల మకందర్ కష్టాలు తీరకపోగా, మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. మకందర్ తప్పుడు సమాచారం అందించారనే నేరం కింద సౌదీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ నుంచి ఈ వీడియో నుంచి తొలగించి, క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్ట్ చేయాలని శ్రీవాత్సవను మకందర్ తోటి ఉద్యోగి కోరాడు. శ్రీవాత్సవ ఈ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించడంతో మకందర్ను విడుదల చేశారు. అయితే వేరే అభియోగాలతో మకందర్ను వెంటనే అరెస్ట్ చేశారు. మకందర్తో మాట్లాడేందుకు ఆయన తల్లి ప్రయత్నించినా వీలు కాలేదు. తాను భారత్‌కు తిరిగి వచ్చేందుకు సాయం చేయాల్సిందిగా మకందర్.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విన్నవించాడు. సౌదీలో దాదాపు 28 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఆ దేశంలో భారతీయులు పడుతున్న బాధల గురించి చాలా కేసులు వెలుగుచూశాయి. పనిమనిషిగా వెళ్లిన ఓ భారతీయురాలి చేతిని గతేడాది నరికివేశారు. -
కిందపడేసి కొడుతూ కాలితో తన్ని.. ఉమ్మేశాడు
రియాద్: సౌదీ అరేబియాలో ఓ భారతీయుడిపై దాడి జరిగింది. విచక్షణ రహితంగా ఓ అరబ్ ఇంజినీర్ చేసిన ఈ దాడిని పలువురు ఖండించగా అతడిపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి పలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మక్కా మసీదు ప్రాంతంలో ఓ నిర్మాణం విస్తరణకు సంబంధించిన పనులను అరబ్ దేశానికి చెందిన ఇంజినీర్ భారతీయుడికి అప్పగించాడు. అయితే, తాను నిర్ణయించిన సమయానికి పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఇంజినీర్ ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణ రహితంగా భారతీయ యువకుడిపై దాడి చేశాడు. కిందపడేసి కొడుతూ కాలితో తన్ని ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా అతడిపై ఉమ్మి కూడా వేశాడు. రెండు నిమిషాలపాటు రికార్డయిన ఈ వీడియోను ఓ కెనడా జర్నలిస్టు తారేక్ ఫతా తన ఫేస్బుక్ పేజీలో పెట్టాడు. దీంతో ఆ వీడియో బయటకు వచ్చి ఆ ఇంజినీర్ నిర్వాకంపట్ల విమర్శలు వచ్చాయి. సౌదీకి చెందిన కార్మిక శాఖ డైరెక్టర్ జనరల్ ఘటన స్థలికి వెళ్లి వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే, ఆ ఇంజినీర్ మాత్రం బాధితుడికి క్షమాపణలు చెప్పాడని, దర్యాప్తు మాత్రం చట్ట ప్రకారం జరుగుతుందని చెప్పారు.