భారతీయుడి అసాధారణ పోరాటం
దుబాయ్: స్వదేశంలో తల్లి మరణించినా తిరిగి రావడానికి అనుమతి రాలేదు. భారత్ తిరిగొచ్చేందుకు న్యాయపోరాటం ప్రారంభిస్తే విచారణ రెండేళ్లుగా కొననసాగుతోంది. కోర్టుకు హాజరవడానికి దుబాయ్‌లో ఒకటి కాదు రెండు కాదు దాదాపు వేయి కిలోమీటర్లు పైగానే నడిచాడు అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు జగన్నాథన్ సెల్వరాజ్(48). ఆయన స్వస్థలం తమిళనాడులోని తిరుచిరాపల్లి. ప్రయాణ ఖర్చులకు డబ్బు లేకపోవడంతో దుబాయ్‌లో తాను ఉంటున్న సోనాపూర్ నుంచి విచారణ జరుగుతున్న కరామా జిల్లాలోని లేబర్ కోర్టుకు రానుపోను కలిపి నాలుగు గంటల్లో 50 కిలోమీటర్ల చొప్పున 20 సార్లు నడిచాడు. ఈ క్రమంలో ట్రాఫిక్, ఎండ, తుపానులు, అలసట వంటి వాటిని లెక్కచేయలేదు.
‘నా కేసు సంఖ్య 826. కోర్టుకు చేరుకోవాలంటే ఉదయం రెండు గంటలు, తిరిగి వెళ్లాలంటే మరో రెండు గంటలు పడుతుంది. కోర్టు హియరింగ్ ఉన్న రోజు ఉదయం 4 గంటలకే లేవాలి. ఇలా ప్రతి 15 రోజులకోసారి వెళ్లాలి. విచారణ పూర్తయిన తరువాత సాయంత్రం వరకు అక్కడే విశ్రాంతి తీసుకుని బయలుదేరుతా. సాయం చేయడానికి ఎవరూ లేరు. ఎండాకాలంలో నడక కష్టమే అయినా మరో మార్గం లేదు’ అని సెల్వరాజ్ ఖలీజ్ టైమ్స్‌కు చెప్పాడు.
తన తల్లి మరణించిన తరువాత అంత్యక్రియలకు హాజరవయ్యేందుకు భారత్ రావడానికి అనుమతి దొరక్కపోపడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గత కొన్నాళ్లుగా ఓ పార్కులో ఉంటున్నానని, ఆరోగ్యం క్షీణించిందని, భారత్‌కు తిరిగి రావడమే తన ఏకైక కోరిక అని సెల్వరాజ్ అన్నాడు.