హత్య చేసి.. ఆపై ఇన్‌స్టాలో రీల్‌ పోస్ట్‌ చేసి | Youth murdered in gang rivalry in Bachupally: assailants made Instagram video post | Sakshi
Sakshi News home page

హత్య చేసి.. ఆపై ఇన్‌స్టాలో రీల్‌ పోస్ట్‌ చేసి

Published Tue, Apr 9 2024 12:24 AM | Last Updated on Tue, Apr 9 2024 12:49 AM

Youth murdered in gang rivalry in Bachupally: assailants made Instagram video post - Sakshi

పాత కక్షలతోనే తేజస్‌ హతం  

నిజాంపేట్‌: ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ గ్యాంగ్‌ ప్రత్యర్థి కోసం కాపు కాసి పక్కా స్కెచ్‌తో అదును చూసి అంతమొందించింది. ఆపై హత్యకు ఉపయోగించిన కత్తులు పట్టుకొని నృత్యాలు చేస్తూ రక్తంతో తడిసిన చేతులతో రీల్స్‌ చేసి లెక్క సరిపోయింది..పగ తీర్చుకున్నామంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టి సంచలనం సృష్టించింది. కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని బోరబండలో నివాసముండే షేక్‌ షరీఫ్‌ గ్యాంగ్‌స్టర్‌. చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండేవాడు. ఓ కేసు విషయంలో షేక్‌ షరీఫ్‌ జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన దగ్గర నంబర్‌–2గా ఉన్న తరుణ్‌రాయ్‌ గ్యాంగ్‌ మొత్తానికి తన ఆదీనంలోకి తీసుకున్నాడు. దీంతో షరీఫ్, తరుణ్‌రాయ్‌ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2023లో దసర పండగరోజున రావణ దహనం సందర్భంగా షరీఫ్‌ గ్యాంగ్‌ తరుణ్‌రాయ్‌ను హత్య చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాలుపంచుకోగా, ప్రగతినగర్‌లో హత్యకు గురైన తేజస్‌ అలియాస్‌ తేజు అలియాస్‌ డీల్‌ ఏ3గా ఉన్నాడు.  

రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన తేజస్‌ 
బెయిల్‌పై బయటకు వచ్చాక తేజస్‌ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లోబతుకమ్మకుంట వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడు. తన గ్యాంగ్‌ స్నేహితులతో మాట్లాడటం, కలిసి పార్టీలు చేసుకోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో తేజస్‌ తన స్నేహితులతో నెక్ట్స్‌ టార్గెట్‌ సమీర్‌ అని..అతడిని కూడా లేపేస్తామంటూ మాట్లాడినట్టు ప్రత్యర్థులకు తెలిసింది.

ఈ క్రమంలో ఆదివారం తేజస్‌ తల్లి ఇంట్లో లేకపోవడంతో బోరబండ నుంచి స్నేహితులు మహేశ్, శివప్ప, మహేశ్‌లు ప్రగతినగర్‌కు వచ్చారు. తేజస్‌ ఇంట్లో నలుగురు కలిసి మద్యం సేవిస్తున్నారు. వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో శివప్ప రెండు గ్యాంగ్‌లకు కామన్‌ ఫ్రెండ్‌. దీంతో ప్రత్యర్థులు శివప్పతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసి, శివప్పతో లోకేషన్‌ షేర్‌ చేయించుకున్నారు.

దాని ఆధారంగా ప్రగతిగనగర్‌లోని తేజస్‌ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు.. తెల్లవారుజామున ఫుల్‌గా తాగిన తేజస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బైక్‌ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తేజస్‌పై కత్తులతో సమీర్, శివప్ప, సిద్దేశ్వర్, జయంత్‌లు విచక్షణరహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం కత్తులు చూపుతూ రీల్స్‌ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ రీల్స్‌కు రక్తచరిత్ర సినిమాలోని పాటను జత చేశారు. హత్యకు పాల్పడిన వారిని, తేజస్‌తో మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement