rivalry
-
హత్య చేసి.. ఆపై ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసి
నిజాంపేట్: ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ గ్యాంగ్ ప్రత్యర్థి కోసం కాపు కాసి పక్కా స్కెచ్‌తో అదును చూసి అంతమొందించింది. ఆపై హత్యకు ఉపయోగించిన కత్తులు పట్టుకొని నృత్యాలు చేస్తూ రక్తంతో తడిసిన చేతులతో రీల్స్ చేసి లెక్క సరిపోయింది..పగ తీర్చుకున్నామంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టి సంచలనం సృష్టించింది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలోని బోరబండలో నివాసముండే షేక్ షరీఫ్ గ్యాంగ్‌స్టర్. చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండేవాడు. ఓ కేసు విషయంలో షేక్ షరీఫ్ జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన దగ్గర నంబర్–2గా ఉన్న తరుణ్‌రాయ్ గ్యాంగ్ మొత్తానికి తన ఆదీనంలోకి తీసుకున్నాడు. దీంతో షరీఫ్, తరుణ్రాయ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2023లో దసర పండగరోజున రావణ దహనం సందర్భంగా షరీఫ్ గ్యాంగ్ తరుణ్రాయ్ను హత్య చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాలుపంచుకోగా, ప్రగతినగర్‌లో హత్యకు గురైన తేజస్ అలియాస్ తేజు అలియాస్ డీల్ ఏ3గా ఉన్నాడు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన తేజస్ బెయిల్‌పై బయటకు వచ్చాక తేజస్ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లోబతుకమ్మకుంట వద్ద ఓ అపార్ట్మెంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. తన గ్యాంగ్ స్నేహితులతో మాట్లాడటం, కలిసి పార్టీలు చేసుకోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో తేజస్ తన స్నేహితులతో నెక్ట్స్ టార్గెట్ సమీర్ అని..అతడిని కూడా లేపేస్తామంటూ మాట్లాడినట్టు ప్రత్యర్థులకు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తేజస్ తల్లి ఇంట్లో లేకపోవడంతో బోరబండ నుంచి స్నేహితులు మహేశ్, శివప్ప, మహేశ్‌లు ప్రగతినగర్‌కు వచ్చారు. తేజస్ ఇంట్లో నలుగురు కలిసి మద్యం సేవిస్తున్నారు. వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో శివప్ప రెండు గ్యాంగ్‌లకు కామన్ ఫ్రెండ్. దీంతో ప్రత్యర్థులు శివప్పతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసి, శివప్పతో లోకేషన్ షేర్ చేయించుకున్నారు. దాని ఆధారంగా ప్రగతిగనగర్లోని తేజస్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు.. తెల్లవారుజామున ఫుల్‌గా తాగిన తేజస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బైక్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తేజస్‌పై కత్తులతో సమీర్, శివప్ప, సిద్దేశ్వర్, జయంత్‌లు విచక్షణరహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం కత్తులు చూపుతూ రీల్స్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రీల్స్‌కు రక్తచరిత్ర సినిమాలోని పాటను జత చేశారు. హత్యకు పాల్పడిన వారిని, తేజస్‌తో మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
తండ్రి మీద కోపంతో పిల్లలను కారుతో గుద్దించి..
లక్నో: యూపీలోని లక్నోలో ఒక వ్యక్తిపై ఉన్న కోపాన్ని అతని ముగ్గురు పిల్లల మీద చూపిస్తూ వారిని కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశాడు ఓ మూర్ఖుడు. అదృష్టవశాత్తు ఆ పిల్లలకు ఎటువంటి హానీ జరగలేదు. వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై పిల్లల్ను ఆసుపత్రికి తరలించగా ప్రమాదమేమీ లేదని చిన్న చిన్న గాయాలు మాత్రం తగిలాయని తెలిపారు వైద్యులు. మలిహాబాద్ సమీపంలోని సింధర్వ గ్రామం కాజీఖేడలో సీతారాం తన కుటుంబంతో నివసిస్తున్నాడు. సీతారాంకు అతని బంధువు గోవింద్ యాదవ్ తో తరచుగా గొడవలు జరిగేవి. ఇటీవల వారి మధ్య వివాదం మరింత ముదరడంతో సీతారాంపై ఉన్న కోపాన్ని అతని పిల్లలపై ప్రదర్శించాడు గోవింద్. జులై 13న సీతారాం ముగ్గురు పిల్లలు శివాని (8), స్నేహ(4), కృష్ణ(3) మార్కెట్ కు వెళ్తుండగా అటుగా స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన గోవింద్ వారిని చంపాలనే ఉద్దేశ్యంతో నిర్దయాక్షిణ్యంగా కారుతో గుద్దించేశాడు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. అక్కడున్నవారు పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించి నిందితుడు పారిపోకుండా పట్టుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సాక్ష్యాధారాలుగా సేకరించారు పోలీసులు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఇది కూడా చదవండి: బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్ -
సముద్ర గర్భంలో సవాల్! ఇంటర్నెట్ కేబుళ్లపై పెత్తనానికి అమెరికా, చైనా ఢీ
అమెరికా, చైనా ఆధిపత్య పోరు ఇప్పుడు సముద్ర గర్భంలోకి చేరింది. సమాచార విప్లవ వారధులైన సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై పెత్తనానికి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫోన్లు, వీడియో చాట్లు, ఈ మెయిల్స్.. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకు మూలం ఇంటర్నెట్. సముద్రాల్లో ఏర్పాటుచేసిన దాదాపు 9 లక్షల మైళ్ల ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ప్రపంచంలోని 95 శాతం డాటా అనుక్షణం ట్రాన్స్ఫర్ అవుతోంది. ఇప్పుడా కేబుల్ వ్యవస్థలే అమెరికా, చైనా మధ్య సముద్రంలో మంటలు రేకెత్తించాయి. రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికీ ఆయుధాలవుతున్నాయి. చాలాకాలంగా ఈ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ అమెరికా కంపెనీల చేతుల్లో సాగుతోంది. తాజాగా... చైనాకు చెందిన కన్సార్షియం రంగంలోకి దిగటంతో సమస్య మొదలైంది. ఆసియా, పశ్చిమాసియా, ఐరోపాలను కలుపుతూ సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకూ సాగే సముద్ర గర్భ కేబుల్‌లైన్ వేయడానికి అమెరికాకు చెందిన సబ్కామ్ కన్సార్షియానికి పోటీగా ముందుకొచ్చింది చైనా కంపెనీ హెచ్ఎంఎన్ టెక్ కేబుల్ నెట్వర్క్. హెచ్ఎంఎన్ కన్సార్షియంలో వివిధ దేశాల కంపెనీలతో పాటు చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉండటం వివాదానికి దారితీసింది. అయితే.. సబ్‌సీ ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ చైనా చేతుల్లోకి వెళ్లకుండా బలంగానే పావులు కదిపింది అమెరికా. బైడెన్ ప్రభుత్వం పరోక్షంగా రంగంలోకి దిగి కన్సార్షియంలోని కంపెనీలను దారిలోకి తేవడం మొదలుపెట్టింది. సర్కారు ఒత్తిడితో కన్సార్షియంలోని వివిధ దేశాల కంపెనీలు అమెరికన్ సంస్థ సబ్కామ్వైపే మొగ్గు చూపాయి. దీంతో చైనా హెచ్ఎంఎన్ నెట్వర్క్ పోటీ నుంచి వైదొలిగింది. ప్రాజెక్టు సబ్కామ్కే దక్కింది. చైనాపై అమెరికా అనుమానాలు ఆసియా, పశ్చిమాసియా, ఐరోపాలను కలుపుతూ సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకూ సాగే సముద్ర గర్భ కేబుల్‌లైన్ వేయడానికి అమెరికాకు చెందిన సబ్కామ్ కన్సార్షియానికి పోటీగా ముందుకొచ్చింది చైనా కంపెనీ హెచ్ఎంఎన్ టెక్ కేబుల్ నెట్వర్క్. హెచ్ఎంఎన్ కన్సార్షియంలో వివిధ దేశాల కంపెనీలతోపాటు చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉండటం వివాదానికి దారితీసింది. చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థగా పేర్కొంటూ... 5జీ నెట్వర్క్ ఏర్పాటులోనూ ఈ కంపెనీని అమెరికాతోపాటు అనేక యూరప్ దేశాలు దూరం పెట్టాయి. సమాచారం అంతటినీ ఈ కంపెనీ చైనా ప్రభుత్వంతో పంచుకుంటుందనేది ఆరోపణ. తాజాగా సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థపైనా హువావే రూపంలో చైనా ప్రభుత్వం నిఘా పెట్టబోతోందన్నది అమెరికా వాదన. ఈ కేబుళ్ల ద్వారా ప్రసారమయ్యే డేటాను, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను, మిలిటరీ సమాచారాన్ని... చైనా ప్రభుత్వం గుప్పిట పెట్టుకునే ప్రమాదముంది అంటోంది. చైనా కంపెనీలు సైబర్, టెలికాం నెట్వర్క్ ద్వారా నిఘా వేస్తున్నాయనేది అగ్రరాజ్యం అనుమానం. గతంలో అమెరికా కంపెనీలు చైనా టెలికాం పరికరాలు వాడటానికి వీలుండేది. 2021 తర్వాత నుంచి దేశ భద్రతకు ముప్పంటూ చైనా టెలికాం పరికరాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఉపసంహరించింది. అంతేగాకుండా చైనా టెలికాం కంపెనీలు అమెరికాగడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం కూడా విధించింది. తాజాగా సామదానభేద దండోపాయాలను ప్రయోగించి.. ఆసియా-ఐరోపా ఇంటర్నెట్ కేబుల్ లైన్ ప్రాజెక్టు నుంచి చైనా కంపెనీలను తప్పించి.. తమ దేశ కంపెనీకి కట్టబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. Successful U.S. gov. campaign helped US’s SubCom beat China’s HMN Tech to win a $600M contract to build prized SeaMeWe-6 submarine optic cable. Washington pressured foreign countries to shun HMN Tech. It’s one of at least 6 private undersea cable deals in the Asia-Pacific + pic.twitter.com/tWapOm7QXf — Ephemeral (@yawahuguama) March 24, 2023 ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్ -
కాంగ్రెస్ కంచుకోటలో ఆధిపత్య పోరు.. పార్టీని ముంచుతారా?
రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఆ నియోజకర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. రాష్ట్రంలో అధికారం లేకపోయినా.. ఎమ్మెల్యే సీటు ఓడినా హస్తం పార్టీలో కుమ్ములాటలు మాత్రం ఆగలేదు. ఆది నుంచి రెండు కుటుంబాల మధ్యే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నడుస్తోంది. ఎన్నికల సమయంలో మరోసారి ఆ ఇద్దరి మధ్యా పోరు తీవ్రమైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ రెండు కుటుంబాల కథేంటి? స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ తమదే అనే రీతిలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని షేట్కర్ వంశస్తులు వ్యవహరిస్తున్నారు. షేట్కర్ల శిష్యుడుగా రాజకీయ అరంగ్రేటం చేసిన పట్లోళ్ల కిష్టా రెడ్డి మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత శివరాజ్ షేట్కార్ కుమారుడు సురేష్ కుమార్ షేట్కార్ రాజకీయ ప్రవేశంతో పట్లోళ్ల కిష్టారెడ్డి, షేట్కార్ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇరు కుటుంబాలు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండటంతో రాజకీయ పలుకబడి కలిగిన శివరావు షేట్కార్ ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి తన కొడుకుకు సురేష్ షేట్కార్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. అప్పటి నుండి కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న తమకే టికెట్ వస్తుందన్న ధీమాలో షెట్కార్ కుటుంబ సభ్యులు ఉన్నారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పట్లోళ్ల కృష్ణారెడ్డి కుమారుడైన సంజీవరెడ్డి బీజేపీలో చేరి టికెట్ సాధించడంతో వారి మధ్య వైషమ్యాలు తీవ్రస్థాయికి చేరాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సంజీవరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. గత సంవత్సరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని సంజీవరెడ్డి, సురేష్ షేట్కార్ వేరు వేరుగా గ్రామస్థాయిల్లో నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాల ప్రత్యక్ష పోరుకు రచ్చబండే వేదికైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటూ ఎవరి స్థాయిలో వారు జన సమీకరణ చేసి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ పిలుపు మేరకు జరుగుతున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాలను కూడా ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దుకు నిరసనగా చేసిన ధర్నా కార్యక్రమం కూడా వేరువేరు చోట్ల ఒకే రోజు నిర్వహించి వారి మధ్య విభేదాలను మరోసారి కేడర్‌కు చూపించారు. వీరిద్దరి మద్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో గ్రామస్థాయిలోని కేడర్ అయోమయానికి గురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలంతా సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలు బాహాటంగానే నాయకులకు సూచిస్తున్నారు. ఇద్దరు నాయకుల తీరు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరికి కాంగ్రెస్ టికెట్ వస్తే మరొకరు రెబల్ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణ ఖేడ్‌లో కాంగ్రెస్ జండా ఎగరేయడానికి కృషి చేస్తారో తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి పార్టీని బలిచేసుకుంటారో చూడాలనే కామెంట్స్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా? -
మూడు ముక్కలాట.. కమలాపురం టీడీపీలో వర్గపోరు
సాక్షి ప్రతినిధి, కడప: కమలాపురం నియోజకవర్గ టీడీపీలో మూడు ముక్కలాట పతాక స్థాయికి చేరింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి ఈసారి కూడా తనకే టీడీపీ టిక్కెట్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన వ్యక్తికి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చేది లేదంటూ ఆ పార్టీ అధిష్టానం నిబంధన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పుత్తా నరసింహారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా వరుసగా మూడుసార్లు ఓటమి చెందగా, అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకసారి ఓడిపోయారు. ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నాలుగుసార్లు ఓటమి చెందారు. పుత్తా టీడీపీ తరుపున మూడుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరని పార్టీలో ఆయన వ్యతిరేకవర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. మరోవైపు గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తానేనని విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవలే పార్టీ యువనేత లోకేష్‌ను సైతం కలిశారు. టిక్కెట్ తనదేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇంకోవైపు కమలాపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌శర్మ సైతం ఈ దఫా కమలాపురం టిక్కెట్ తనదేనని ప్రచా రం చేసుకుంటున్నారు. చాలాకాలంగా పుత్తా నరసింహారెడ్డి, సాయినాథ్‌శర్మల మధ్య విబేధాలు ఉన్నాయి. దీంతో సాయినాథ్‌శర్మ ‘పుత్తా’కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచా రం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తనకే టీడీపీ టిక్కెట్ అంటూ ఆయన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. టిక్కెట్ ఇస్తే ఎంత డబ్బు అయి నా ఖర్చు చేసేందుకు సిద్ధమని, ఇదే విషయం అధిష్టానానికి సైతం తెలిపినట్లు సాయినాథ్‌శర్మ వర్గం ప్రచారం చేస్తోంది. వరుసగా మూడుసార్లు ఓడిన వారికి పార్టీ టిక్కెట్టు ఇవ్వదని, ఈ లెక్కన తనకే టిక్కెట్టు అంటూ సాయినాథ్‌శర్మ క్యాడర్‌కు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చెల్లాచెదురైన క్యాడర్ నియోజకవర్గంలో ఉన్న ముగ్గురు ముఖ్య నేతలు టిక్కెట్ నాకంటే నాకంటూ ప్రచారం చేసుకుంటుండడంతో ఉన్న క్యాడర్ ఇప్పటికే వర్గాలుగా విడిపోయింది. పైపెచ్చు తమ నేతకే టిక్కెట్టు అంటూ గ్రామ స్థాయిలోనే క్యాడర్ సైతం ప్రచారం చేస్తోంది. పుత్తా నరసింహారెడ్డికి నచ్చజెప్పి రాబోయే ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్టు ఇస్తారని వీరశివారెడ్డి వర్గం చెబుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచామని, ఆర్థికంగా నష్టపోయామని, ఈ పరిస్థితుల్లో మరోమారు కూడా తమ నేతకే టిక్కెట్టు వస్తుందని ‘పుత్తా’వర్గం గట్టిగా చెబుతోంది. ఇదిలా ఉండగా ఒకవేళ తమ నాయకుడికి టిక్కెట్ రాకుంటే వీరశివారెడ్డికి మద్దతు ఇస్తాము తప్పించి పుత్తా నరసింహారెడ్డికి మద్దతు ఇచ్చేది లేదంటూ సాయినాథ్ అనుచర వర్గం చెబుతోంది. ముగ్గురిలో ఏ ఒక్కరికీ అధిష్టానం టిక్కెట్ ఇచ్చి నా మిగిలిన ఇద్దరు సదరు నేతకు మద్దతు పలికే పరిస్థితి లేదు. ఒకవేళ నాయకులు మద్దతు పలికినా కిందిస్థాయిలో క్యాడర్ సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉన్న కాస్త క్యాడర్ సైతం చెల్లాచెదురయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎటూ తేల్చుకోలేని అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఇంట్లో భోజనం చేస్తుండగా బైకుపై వచ్చి.. భార్య కళ్లముందే..
తిరువొత్తియూరు(చెన్నై): తంజై జిల్లాలో ఆడిటర్‌ను హత్య చేసిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తంజై కరంద చేరవై కారన్ వీధికి చెందిన మహేశ్వరన్ (55) ఆడిటర్. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకె 5వ వార్డు ప్రతినిధి రుక్మిణితో విరోధం ఉంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మహేశ్వరన్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో బైకులో వచ్చిన రుక్మిణి కుమారుడు కార్తీక్‌తో సహా నలుగురు కత్తులతో అతని భార్య కళ్లముందే దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో మహేశ్వరన్ అదే చోట మృతి చెందాడు. తంజై వెస్ట్ పోలీసులు మృతదేహాన్ని తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. శిశువును విక్రయించిన వృద్ధురాలి అరెస్టు తిరువొత్తియూరు: మదురై సమీపంలో చిన్నారిని విక్రయించిన వృద్ధురాలిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై మేలూర్ కోటై నత్తం పట్టికి చెందిన ఓ వివాహితకు శివగంగై జిల్లా కల్లల్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె గర్భం దా ల్చింది. ఈమె భర్త విదేశాలలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు గత వారం క్రితం మగబిడ్డ జన్మించింది. ఈ బిడ్డను వృద్ధురాలికి ఇచ్చి పెంచమని చెప్పినట్లు తెలిసింది. కానీ వృద్ధురాలు ఆ బిడ్డను విక్రయించారు. ఈ సంగతి తెలుసుకున్న వివాహిత ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి బిడ్డ ఎక్కడని ప్రశ్నించింది. ఆమె సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వృద్ధురాలి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: ఆమెకు 20, అతడికి 17.. బాలుడిని ఇంటికి పిలిచి.. -
క్రికెట్లో గొడవ.. ఒంటరిగా నడిచి వెళ్తుంటే ఆపి..
తిరువొత్తియూరు: క్రికెట్ ఆడుతున్న సమయంలో ఏర్పడిన గొడవల కారణంగా ఓ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలోని సోమపట్టికి చెందిన సివిల్ ఇంజినీర్ మోహన్‌బాబు (25). ఇతను శనివారం లేఅవుట్ ప్రాంతంలో జరుగుతున్న కట్టడాలను చూడడానికి నడిచి వెళుతున్నాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన పవన్ (23), మూర్తి (20), తిలక్ (22), సురేష్ (20), అప్పు (20), హేమంత్ (20) అడ్డుకుని దాడికి దిగారు. ఇంతకుముందు వారి మధ్య క్రికెట్ గొడవ ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయం అయిన మోహన్ బాబును ఇరుగు పొరుగు వారు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మోహన్‌బాబు మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో ఘటనలో.. హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం నామక్కల్ జిల్లా పాలపట్టి గ్రామానికి చెందిన సెంథిల్ కుమార్ (37) ఈబీ కార్యాలయంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య లత. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో శనివారం సెంథిల్ కుమార్ ఆలనత్తం సమీపంలోని పుదుక్కోట్టై నుంచి దూసై వెళ్లే మార్గంలో సగం కాలిన స్థితిలో శవంగా పడి ఉన్నాడు. ఎరుమంమట్టి పోలీసులు అక్కడికి చేరుకుని విచారణలో అదే ప్రాంతానికి చెందిన నటేశన్ (38)పై అనుమానం వ్యక్తమైంది. దర్యాప్తులో నటేషన్ భార్య జయతో సెంథిల్ కుమార్ వివాహేత సంబంధం కొనసాగిస్తుండడంతో హత్య చేసినట్లు వెల్లడైంది. నటేషన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
IND Vs PAK: 'మౌకా.. మౌకా'.. కింగ్ కోహ్లి.. బాద్షా బాబర్
T20 WC 2021 India Vs Pakistan Rivalry.. టీమిండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ టెన్షన్ ఉంటుంది. అక్టోబర్ 24న జరగబోయే టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కోసం ఇరు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇండియా-పాక్ మ్యాచ్ కోసం స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్ కూడా ఎదురుచూస్తున్నట్లు గా కనిపిస్తుంది. ఎందుకంటే టీమిండియా- పాక్ మ్యాచ్‌కు టీఆర్పీ రేటింగ్ వేరే లెవల్లో ఉంటుంది. దాదాపు టి20 ప్రపంచకప్ ఫైనల్ టీఆర్పీ రేటింగ్‌కు ఈ మ్యాచ్ రేటింగ్ సమానంగా ఉండే అవకాశాలున్నాయి. చదవండి: T20 WC 2021 IND Vs PAK: 'మౌకా మౌకా'... అరె భయ్యా ఈసారైనా ఇక మౌకా.. మౌకా అంటూ సరికొత్తగా యాడ్‌ను డిజైన్ చేసి మార్కెట్లోకి వదిలిన స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం మరో కొత్త యాడ్‌ను తీసుకొచ్చింది. మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వచ్చిన పాక్ అభిమానికి ''బై వన్.. బ్రేక్ వన్'' అంటూ ఇండియా అభిమాని గిఫ్ట్ ఇవ్వడం ట్రండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మ్యాచ్‌పై వేడి పెంచేందుకు మరో కొత్త యాడ్‌ను తీసుకొచ్చింది. ఈ యాడ్‌లో ఇరు జట్ల అభిమానులు మ్యాచ్ విన్నర్ల పేర్లను తమదైన శైలిలో వెల్లడిస్తారు. ''పాక్ అభిమాని బాద్షా బాబర్ అనగానే.. వెంటనే టీమిండియా అభిమాని కింగ్ కోహ్లి అని పేర్కొంటాడు. అలా.. అప్పా షేర్ షాహిన్.. బుమ్ బుమ్ బుమ్రా.. రన్‌మెషిన్ రిజ్వాన్.. హిట్‌మాన్ రోహిత్.. ఫ్రొఫెసర్ హఫీజ్.. సర్ జడేజా'' అంటూ వీడియో ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది. ఇక చివర్లో యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.. అక్టోబర్ 24న తేల్చుకుందాం అంటూ వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌గా మారింది. చదవండి: T20 WC IND Vs PAK: టీమిండియా ఒత్తిడిలో ఉంది.. అందుకే ధోని మెంటార్‌గా ICC Men's #T20WorldCup ke ⚔️ se pehle, shuru ho chuka hai Maukaman aur Lovely Paaji ka 🤜🤛! 💥 Who'll grab the #MaukaMauka to brag this time in #INDvPAK?#Buy1Break1Free | Oct 24, Broadcast: 7 PM, Match: 7:30 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/arSEQw3WHd — Star Sports (@StarSportsIndia) October 19, 2021 -
కోర్టులో షూటౌట్; వెలుగులోకి సంచలన విషయాలు
ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జితేందర్‌ను శుక్రవారం రోహిణి కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగా కాల్చి చంపిన సంగతి విదితమే. అతడి హత్యకు ప్రధాన సూత్రధారుడిగా మరో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పూరియాను పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలం చేకూర్చే ఆధారాలు పోలీసులకు లభ్యమయినట్టు సమాచారం. రోహిణి కోర్టు షూటౌట్‌కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా టిల్లు తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టిల్లు తాజ్పూరియా ప్రస్తుతం తీహార్‌లోని మండోలా జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే జితేందర్ హత్యకు సంబంధించిన విషయాలను తన ఇద్దరు అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు అతడు తెలుసుకున్నట్టు సమాచారం. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. రోహిణి కోర్టుకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు వంటి ప్రశ్నలు.. తన ఇద్దరు అనుచరులను ఫోన్లో టిల్లు అడిగినట్టు తెలుస్తోంది. రోహిణి కోర్టుకు చేరుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని ఉమాంగ్, వినయ్‌లను ఆదేశించాడట. రోహిణి కోర్టులో షూటౌట్‌కు కొద్ది నిమిషాల ముందు కూడా వారికి కాల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘దాడి చేసిన ఇద్దరూ కోర్టు గది లోపల కూర్చున్నారని.. కోర్టు లోపల, బయటా పోలీసు భద్రత కట్టుదిట్టంగా ఉందని తెలుసుకుని.. తన అనుచరులు తప్పించుకోవడం కష్టమని టిల్లు భావించాడు. దీంతో మరోసారి ఫోన్ చేసి వారి ఆచూకీ గురించి అడిగాడు. వారు పార్కింగ్ స్థలంలో ఉన్నారని చెప్పినప్పుడు అక్కడి నుంచి వెంటనే పారిపోవాలని టిల్లు సూచించాడ’ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు? -
ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు?
దేశ రాజధాని ఢిల్లీలో రెండు హంతక ముఠాల గ్యాంగ్‌వార్ పెను సంచలనం రేపింది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించింది. మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్పూరియా గ్యాంగ్‌కు చెందిన వారని అనుమానిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే వైరం జితేందర్ గోగి, టిల్లు తాజ్పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య వైరానికి దారితీశాయి. 2010లో ఔటర్ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు గ్యాంగ్‌వార్‌గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం. ఎవరీ జితేంద్ర? గ్యాంగ్‌స్టర్ జితేంద్ర మన్ అలియాన్ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను తీహార్ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్‌గఢ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్‌లోని సెక్టార్ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. దశాబ్ద కాలంగా గ్యాంగ్‌వార్ టిల్లు తాజ్‌పురియా కూడా తీహార్ జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే ముఠా కార్యాలపాలు సాగించినట్టు ఇతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి గోగి, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్‌వార్ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్‌గా చెప్పుకునే మరో గ్యాంగ్‌స్టర్ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్‌పురియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు. లాయర్ డ్రెస్‌లో వచ్చిన దుండగులు అతడిని తుపాకులతో కాల్చి చంపారు. -
హితోక్తులు
వానర వీరుడైన సుగ్రీవుడికి అనుకోకుండా, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తనకంటే చాలా బలవంతుడైన తన సోదరుడు వాలితో వైరం ఏర్పడింది. అన్న ఏ క్షణానైనా తనను మట్టుపెట్టవచ్చునన్న భయంతో వాలి అడుగు పెడితే చాలు– తల పగిలి మరణిస్తాడన్న శాపం ఉన్న ఋష్యమూక పర్వతంపై జీవనం సాగిస్తున్నాడు.అదే సమయంలో రామలక్ష్మణులు సీతను వెతుకుతూ సుగ్రీవుని కంటపడ్డారు. మహా ధనుర్ధారులైన వారిని చూసి భయపడిపోయిన సుగ్రీవుడు, వారిని గురించి తెలుసుకోమని హనుమంతుని పంపాడు. హనుమ బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి, మంచిమాటలతో వారి వివరాలు కనుక్కొని వారిని సుగ్రీవుని వద్దకు తీసికెళ్ళాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. వారి నుంచి సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెతకడానికి తాను సహాయపడగలనని మాట ఇచ్చాడు సుగ్రీవుడు. అదే సమయంలో తనకు అన్నతో ఏర్పడిన విరోధం గురించి, తనకు అతని వల్ల కలుగుతున్న భయం గురించీ వివరించాడు. వాలిని సంహరించి సుగ్రీవునికి ప్రాణభయం లేకుండా చేస్తానని వాగ్దానం చేశాడు రాముడు. రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. వారిరువురూ ఒకే విధంగా ఉండటంతో వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరమాడాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. ఆ సమయంలో వాలి భార్య తార, ‘ఇంతక్రితమే నీ చేతిలో చావు దెబ్బలు తిని ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వెళ్లిన నీ తమ్ముడు ఇంతట్లోనే మళ్లీ వచ్చి నీపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే, దానివెనక ఏదో మర్మం ఉండి వుంటుంది కాబట్టి ఈ సమయంలో యుద్ధం అంత మంచిది కాదు’ అని హెచ్చరిస్తుంది. వాలి ఆమె మాటలను పెడచెవిన పెట్టి, తమ్ముడి మీదికి యుద్ధానికి వెళతాడు. సమయం చూసి రామచంద్రుడు వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి రాజుగానూ, అంగదునికి యువరాజుగానూ పట్టం కట్టి, తారను తిరిగి సుగ్రీవునికి కట్టబెట్టాడు. రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతూ, రామునికిచ్చిన మాటను దాదాపు మరచిపోతాడు. దాంతో లక్ష్మణుడు ఆగ్రహంతో సుగ్రీవుని సంహరించడానికి వెళ్లబోగా, తార సుగ్రీవుణ్ణి హెచ్చరిస్తుంది. సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకుని, తన సేనాగణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై పడ్డాడు. రాముడు అతణ్ణి క్షమించి ఆలింగనం చేసుకొన్నాడు. అనంతరం సుగ్రీవుడు క్షణం ఆలస్యం చేయకుండా సీతాన్వేషణకు పథకాన్ని సిద్ధం చేసి రాముని అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, చెప్పిన మాటలను వినకపోవడం వల్ల వాలికి కలిగిన చేటును, తార మాటను వినడం వల్ల సుగ్రీవునికి తప్పిన ముప్పును. చేసిన ఉపకారాన్ని మరచి ఇచ్చిన మాటను పెడచెవిన పెడితే వచ్చే అనర్థాన్నీ. – డి.వి.ఆర్.భాస్కర్ -
స్నేహం, శత్రుత్వం రెండూ అవసరం
సూత్రం నం.1 : ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మొదట నిన్ను నువ్వు మూడు ప్రశ్నలు వేసుకో. నేనెందుకు ఈ పని చేస్తున్నాను? ఫలితం ఎలా ఉండబోతోంది? ఇందులో నేను విజయం సాధిస్తానా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తే అప్పుడు నువ్వు ముందుకు వెళ్లవచ్చు. సూత్రం నం. 2 : పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం, ఇతరుల స్వాధీనంలో ఉన్న ఆస్తి.. మన అవసరాలకు ఉపయోగపడవు. చాణక్యుడి అర్థశాస్త్రంలోని సూత్రాలివి. ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయి. అన్నిటి అంతస్సూత్రం ఒకటే.. ‘నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. అది నిన్ను నాశనం చేస్తుంది’. చాణక్యుని కీలక గురుమంత్రం ఇది. నువ్వు బయట పడితే నీకు భయపడడం తగ్గుతుందన్నది అంతరార్థం. చాణక్యుని ‘అర్థశాస్త్రం’లో ఆరువేలకు పైగా సూత్రాలు ఉన్నాయి. ‘చాణక్య నీతి’ అనేది మరో ఉద్గ్రంథం. అందులో నీతి సూత్రాలు ఉన్నాయి. అర్థశాస్త్రంలో డబ్బు గురించి ఉన్నప్పటికీ, డబ్బు గురించి మాత్రమే లేదు. రాజనీతి, యుద్ధనీతి, వ్యక్తి నీతి, సంఘ నీతి... ఇలా అనేక జీవన నీతులున్నాయి. ఇప్పటికీ, ఎప్పటికీ అవి మనిషికి, వ్యవస్థలకు అవసరమైనవి. అప్పుడప్పుడు మన బడ్జెట్ ప్రసంగాలలో చాణక్యుని మాట వినిపిస్తుంటుంది. బడ్డెట్ల రూపకల్పనల్లో చాణక్య నీతి కనిపిస్తుంటుంది. బతకడానికి, బాగా బతకడానికి మధ్య తేడాలను చెప్పిన తాత్విక పండితుడు చాణక్యుడు. అనుభవంతో పండి, అనుభవసారాన్ని పిండి లోకానికి ఉగ్గు పట్టించిన వాడు చాణక్యుడు. వృత్తిలో ఎదగదలచిన వాడికి స్నేహమెంత ముఖ్యమో, శత్రుత్వం కూడా అంత ముఖ్యమని అంటాడు. ఎదుగుతున్న క్రమంలో మంచీచెడూ రెండూ సోపానాలే అంటాడు. ఏదైనా పని మొదలు పెట్టేముందు ఎవరైనా తమ ఇష్టదైవాన్ని స్తుతిస్తారు. చాణక్యుడు మాత్రం ఓం మంచీచెడాయనమః అంటాడు. ఆయన భాషలో అది ‘ఓం నమః శుక్రబృహస్పతిభ్యాం’. అంటే బృహస్పతికొక దండం, శుక్రాచార్యుడికొక దండం అని. బృహస్పతి దేవతల గురువు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. దండం ఇద్దరికీ పెట్టినా అంతర్లయగా మంచికే లయబద్ధుడై ఉన్నాడు చాణక్యుడు. -
స్నేహానికి ‘హద్దు’లుండవ్..!
ఈ ఫొటోలో ప్రత్యేకతేముంది? ఇద్దరు కొరియా అమ్మాయిలు సెల్ఫీ దిగుతున్నారు.. అంతే కదా అనిపిస్తోంది కదూ. ఈ ఇద్దరిలో ఎరుపు, తెలుపు రంగు జెర్సీ ధరించిన అమ్మాయిది ఉత్తర కొరియా. మరొకరిది దక్షిణ కొరియా. ఇప్పుడర్థమైంది కదా అసలు విషయం. తమ రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వం గురించి ఏమాత్రం ఆలోచించని ఈ అథ్లెట్లు ఒలింపిక్స్ విలేజ్‌లో ఇలా ఫొటో దిగి అసలు సిసలు స్నేహాన్ని లోకానికి చాటుకున్నారు. అయితే తన పక్క దేశం నీడను సైతం భరించలేని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడోనని ఆ ఫొటో చూసినవారే హడలిపోతున్నారు. గేమ్స్ అనంతరం ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలని ఇప్పటికే సోషల్ మీడియాలో సానుభూతి కూడా వ్యక్తమవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.