హితోక్తులు | Sugriva welcomed Rama laxman | Sakshi
Sakshi News home page

హితోక్తులు

Published Sun, Sep 30 2018 1:10 AM | Last Updated on Mon, Dec 21 2020 1:10 PM

Sugriva welcomed Rama laxman - Sakshi

వానర వీరుడైన సుగ్రీవుడికి అనుకోకుండా, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తనకంటే చాలా బలవంతుడైన తన సోదరుడు వాలితో వైరం ఏర్పడింది. అన్న ఏ క్షణానైనా తనను మట్టుపెట్టవచ్చునన్న భయంతో వాలి అడుగు పెడితే చాలు– తల పగిలి మరణిస్తాడన్న శాపం ఉన్న ఋష్యమూక పర్వతంపై జీవనం సాగిస్తున్నాడు.అదే సమయంలో రామలక్ష్మణులు సీతను వెతుకుతూ సుగ్రీవుని కంటపడ్డారు. మహా ధనుర్ధారులైన వారిని చూసి భయపడిపోయిన సుగ్రీవుడు, వారిని గురించి తెలుసుకోమని హనుమంతుని పంపాడు. హనుమ బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి, మంచిమాటలతో వారి వివరాలు కనుక్కొని వారిని సుగ్రీవుని వద్దకు తీసికెళ్ళాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. వారి నుంచి సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెతకడానికి తాను సహాయపడగలనని మాట ఇచ్చాడు సుగ్రీవుడు. అదే సమయంలో తనకు అన్నతో ఏర్పడిన విరోధం గురించి, తనకు అతని వల్ల కలుగుతున్న భయం గురించీ వివరించాడు. వాలిని సంహరించి సుగ్రీవునికి ప్రాణభయం లేకుండా చేస్తానని వాగ్దానం చేశాడు రాముడు. 

రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు.  వారిరువురూ ఒకే విధంగా ఉండటంతో వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరమాడాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. ఆ సమయంలో వాలి భార్య తార, ‘ఇంతక్రితమే నీ చేతిలో చావు దెబ్బలు తిని ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వెళ్లిన నీ తమ్ముడు ఇంతట్లోనే మళ్లీ వచ్చి నీపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే, దానివెనక ఏదో మర్మం ఉండి వుంటుంది కాబట్టి ఈ సమయంలో యుద్ధం అంత మంచిది కాదు’ అని హెచ్చరిస్తుంది. వాలి ఆమె మాటలను పెడచెవిన పెట్టి, తమ్ముడి మీదికి యుద్ధానికి వెళతాడు. సమయం చూసి రామచంద్రుడు వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి రాజుగానూ, అంగదునికి యువరాజుగానూ పట్టం కట్టి, తారను తిరిగి సుగ్రీవునికి కట్టబెట్టాడు.

రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతూ, రామునికిచ్చిన మాటను దాదాపు మరచిపోతాడు. దాంతో లక్ష్మణుడు ఆగ్రహంతో సుగ్రీవుని సంహరించడానికి వెళ్లబోగా, తార సుగ్రీవుణ్ణి హెచ్చరిస్తుంది. సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకుని, తన సేనాగణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై పడ్డాడు. రాముడు అతణ్ణి క్షమించి ఆలింగనం చేసుకొన్నాడు. అనంతరం సుగ్రీవుడు క్షణం ఆలస్యం చేయకుండా సీతాన్వేషణకు పథకాన్ని సిద్ధం చేసి రాముని అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక్కడ నీతి ఏమిటంటే,  చెప్పిన మాటలను వినకపోవడం వల్ల వాలికి కలిగిన చేటును, తార మాటను వినడం వల్ల సుగ్రీవునికి తప్పిన ముప్పును. చేసిన ఉపకారాన్ని మరచి ఇచ్చిన మాటను పెడచెవిన పెడితే వచ్చే అనర్థాన్నీ. 
– డి.వి.ఆర్‌.భాస్కర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement