ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలి
భరతమాత, జైశ్రీరామ్‌ను తమిళనాడు స్వీకరించదు
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగమే ఉండదు
డీఎంకే సీనియర్ నేత ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా మరో వివాదానికి ఆజ్యం పోశారు. బీజేపీ సిద్ధాంతాలైన భరతమాత, జైశ్రీరామ్‌ను తమిళనాడు ఎప్పటికీ స్వీకరించబోదని, అవి తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇండియా ఒకే దేశం కాదని, ఇదొక ఉపఖండం మాత్రమేనని అన్నారు. ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలని చెప్పారు. మధురైలో మంగళవారం డీఎంకే కార్యక్రమంలో ఎ.రాజా ప్రసంగించారు. ‘‘రాముడికి శత్రువు ఎవరు? రాముడి గురించి, రామాయణం గురించి నాకు అంతగా తెలియదు.
వాటిపై నాకు నమ్మకం లేదు. రాముడు సీతతో కలిసి అడవికి వెళ్లాడని చిన్నప్పుడు మా తమిళ టీచర్ చెప్పారు. ఒక వేటగాడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని రాముడు తన సోదరులుగా స్వీకరించాడు. ఇందులో కులం, మతం ప్రసక్తి లేదని అర్థమవుతోంది. ఇండియా ఒకే దేశమని అంటున్నారు. ఒకే దేశమైతే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి ఉండాలి. ఇండియాలో అలా లేదు కాబట్టి ఇదొక ఉపఖండం. ఇండియా గతంలో ఎన్నడూ ఒక దేశంగా లేదు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వాటి సొంత సంస్కృతులు ఉన్నాయి.
భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల సమాహారమే ఇండియా. ఇక్కడ ఒక సామాజిక వర్గం ప్రజలు గొడ్డు మాంసం తింటారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. తమిళనాడులో డీఎంకే లేకపోతే అసలు భారతదేశమే ఉండదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగమే ఉండదు. రాజ్యాంగం లేకపోతే దేశం కూడా మనుగడ కోల్పోతుంది. భారతదేశం లేకపోతే తమిళనాడు రాష్ట్రం ఉండదు. దేశం నుంచి మేము విడిపోతాం. ఇలా జరగాలని భారతదేశం కోరుకొంటోందా?’’ అంటూ ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజాను వెంటనే అరెస్టు చేయాలి
డీఎంకే నేత ఎ.రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎంకే నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవడం లేదని బీజేపీ నేత∙అమిత్ మాలవీయా విమర్శించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ అనుచితంగా మాట్లాడారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే డీఎంకే నేతల కుటిల యత్నమని మండిపడ్డారు. రాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని తిమళనాడు డీఎంకే అధికార ప్రతినిధి తిరుపతి అన్నారు. రాజా వ్యాఖ్యలను డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ సైతం ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించింది. రాజా వ్యాఖ్యలతో విభేదిస్తున్నానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment