సమయోచితంగా...
పురానీతి
వానరరాజు సుగ్రీవుడు, ఆయన మంత్రి హనుమంతుడు. ఇద్దరూ ఋష్యమూక పర్వతం మీద అటూ ఇటూ నడుస్తూ ఏదో విషయం మీద సంభాషించుకుంటున్నారు. ఇంతలో సుగ్రీవుడి దృష్టి దూరంగా నడిచి వస్తున్న ఇద్దరు వ్యక్తుల మీద పడింది. చూడటానికి సాధువుల్లా ఉన్నా, ఎంతో బలిష్టంగా, భుజాన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వారి చేతులలో ఉన్న ఖడ్గాలు సూర్యకాంతి పడ్డప్పుడల్లా తళుక్కుమని వజ్రాల్లా మెరుస్తున్నాయి. వారిని చూసి సుగ్రీవుడు భయంతో బిగుసుకుని పోయాడు. మాటలలో తడబాటు, నడకలో తత్తరపాటు మొదలైంది. అది గమనించిన హనుమ, ‘రాజా! నీ భయానికి కారణం నాకు అర్థమైంది.
ఆ వ్యక్తులను చూసే కదా నువ్వు కలవరపడుతున్నావు. నీవు అనుకుంటున్నట్టుగా వాలి ఇటు రాలేడు. ఒకవేళ మూర్ఖత్వంతో వస్తే మతంగ మహర్షి శాపం వల్ల తల వక్కలై మరణిస్తాడు. ఆ విషయం వాలికీ తెలుసు. నీకూ తెలుసు. రాజైనవాడు అవతలి వారి నడక, అవయవాల కదలికను బట్టి, మాటతీరును బట్టి, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనసులో ఏ భావం దాగి ఉందో కనిపెట్టి, అందుకు అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగలడు. అటువంటి సమర్థత నీకుంది. అయినా కూడా నువ్వు భయపడుతున్నావంటే, నీ అన్నగారైన వాలి శక్తిసామర్థ్యాల గురించి నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండటమే కారణం అనుకుంటున్నాను.
అయినా, వారెవరో. ఎందుకు వస్తున్నారో కనుక్కొని వస్తాను. మంత్రిగా అది నా కర్తవ్యం. అంతవరకూ నువ్వు స్థిమితంగా ఉండు’’ అంటూ సుగ్రీవుడి భుజం తట్టాడు హనుమ. కపిశ్రేష్ఠుడైన హనుమ మాటలతో కొండంత ధైర్యం వచ్చింది సుగ్రీవుడికి.
వెంటనే హనుమ తన మనసులో ఇలా అనుకున్నాడు. వారసలే కొత్తవ్యక్తులు. తానేమో వానరుడు. వారేమో నరులు. తనను చూస్తే, వారు సరిగ్గా సమాధానం ఇస్తారో ఇవ్వరో అనే ఉద్దేశంతో వృద్ధబ్రాహ్మణ వేషం ధరించి, వారివద్దకు వెళ్లాడు.
నమస్కరించి, ‘‘అయ్యా! మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? చూడటానికి బ్రాహ్మణుల్లా ఉన్నారు. కానీ, ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. బలిష్టంగా ఉన్నారు. మీ నడకను బట్టి, వేషభాషలను బట్టి మీరు ఈ ప్రాంతానికి కొత్తవారని అర్థమవుతోంది. మీరు ఏ పని మీద వచ్చారో తెలిస్తే, నేను మీకు సాయపడగలను’’ అని ఎంతో వినయంగా అన్నాడు.
హనుమకు ప్రతినమస్కారం చేశాడు రాముడు. తామెవరో, ఏ పని మీద వచ్చారో క్లుప్తంగా తెలియజేశాడు. తన సోదరుడైన లక్ష్మణుని పరిచయం చేశాడు. వారి మాటలకు ఎంతో ఆనందపడ్డాడు హనుమ. ‘‘మా రాజు సుగ్రీవుడు. ఎంతో బలమైనవాడు. అయితే అంతకన్నా బలశాలి, అన్నగారు అయిన వాలితో విరోధం. వాలికి ఎవరూ ఎదురు నిలిచి పోరాడలేరు. ఎందుకంటే తన ఎదురుగా నిలిచిన వారి బలాన్ని గ్రహించే శక్తి కలిగిన అన్నగారంటే అమిత భయం. అందుకే ఆయన కంట పడకుండా ఈ పర్వతం మీద తలదాచుకుంటున్నాడు.
మీరు వచ్చిన కార్యం నెరవేరాలంటే మీరు సుగ్రీవుడితో స్నేహం చెయ్యండి. ఆయనకు అపారమైన వాన రగణం అనుచరులుగా ఉన్నారు. వారి సహకారంతో సీతాన్వేషణ మీకు సులువవుతుంది. అలాగే వాలిని ఎదిరించి పోరాడాలంటే మీవంటి అమిత పరాక్రమశాలురు స్నేహితులుగా ఉండటం సుగ్రీవుడికి కూడా అవసరమే. మీరు నాతో రండి’’ అంటూ ముందుకు దారి తీశాడు.
సమయోచిత వేషధారణ, సమయోచితంగా సంభాషించగలిగే సామర్థ్యాన్ని గురించి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో కూడా బోధిస్తూ ఉంటారు. అలాంటి సమయోచిత వేషధారణ, సంభాషణా చాతుర్యం హనుమకు వెన్నతో పెట్టిన విద్య.
ఎంతో పెద్ద వాగ్విశారదుడని పేరు తెచ్చుకున్న రాముడంతటివాడు అతను మాట్లాడిన నాలుగు మాటలకే ఎంతో ముచ్చటపడి, ‘‘చూశావా లక్ష్మణా! హనుమ ఎలా మాట్లాడాడో, ఆయన మాట లు విన్నావా? ఇలా మాట్లాడేవాడు మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే- వేదాలన్నీ క్షుణ్ణంగా ఔపోసన పట్టినట్లు కనిపిస్తోంది. వ్యాకరణం ఈయనకు కొట్టిన పిండి వంటిదనిపిస్తోంది. ఉపనిషత్తుల అర్థం పూర్తిగా తెలుసనుకుంటా.
అందుకే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడం లేదు. లలాటమూ కదలడం లేదు. వాక్యం లోపలి నుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నట్లు లేదు. గట్టిగానూ లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలాగే పలుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దగ్గరకు వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు’’ అని అన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు హనుమ ఆనాటి గొప్ప కమ్యూనికేటర్ అని.
ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ, మాటలను హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి.