రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఆ నియోజకర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. రాష్ట్రంలో అధికారం లేకపోయినా.. ఎమ్మెల్యే సీటు ఓడినా హస్తం పార్టీలో కుమ్ములాటలు మాత్రం ఆగలేదు. ఆది నుంచి రెండు కుటుంబాల మధ్యే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నడుస్తోంది. ఎన్నికల సమయంలో మరోసారి ఆ ఇద్దరి మధ్యా పోరు తీవ్రమైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ రెండు కుటుంబాల కథేంటి?
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ తమదే అనే రీతిలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని షేట్కర్ వంశస్తులు వ్యవహరిస్తున్నారు. షేట్కర్ల శిష్యుడుగా రాజకీయ అరంగ్రేటం చేసిన పట్లోళ్ల కిష్టా రెడ్డి మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత శివరాజ్ షేట్కార్ కుమారుడు సురేష్ కుమార్ షేట్కార్ రాజకీయ ప్రవేశంతో పట్లోళ్ల కిష్టారెడ్డి, షేట్కార్ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇరు కుటుంబాలు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండటంతో రాజకీయ పలుకబడి కలిగిన శివరావు షేట్కార్ ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి తన కొడుకుకు సురేష్ షేట్కార్కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు.
అప్పటి నుండి కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న తమకే టికెట్ వస్తుందన్న ధీమాలో షెట్కార్ కుటుంబ సభ్యులు ఉన్నారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పట్లోళ్ల కృష్ణారెడ్డి కుమారుడైన సంజీవరెడ్డి బీజేపీలో చేరి టికెట్ సాధించడంతో వారి మధ్య వైషమ్యాలు తీవ్రస్థాయికి చేరాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సంజీవరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు.
గత సంవత్సరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని సంజీవరెడ్డి, సురేష్ షేట్కార్ వేరు వేరుగా గ్రామస్థాయిల్లో నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాల ప్రత్యక్ష పోరుకు రచ్చబండే వేదికైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటూ ఎవరి స్థాయిలో వారు జన సమీకరణ చేసి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ పిలుపు మేరకు జరుగుతున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాలను కూడా ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దుకు నిరసనగా చేసిన ధర్నా కార్యక్రమం కూడా వేరువేరు చోట్ల ఒకే రోజు నిర్వహించి వారి మధ్య విభేదాలను మరోసారి కేడర్కు చూపించారు. వీరిద్దరి మద్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో గ్రామస్థాయిలోని కేడర్ అయోమయానికి గురవుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలంతా సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలు బాహాటంగానే నాయకులకు సూచిస్తున్నారు. ఇద్దరు నాయకుల తీరు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరికి కాంగ్రెస్ టికెట్ వస్తే మరొకరు రెబల్ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణ ఖేడ్‌లో కాంగ్రెస్ జండా ఎగరేయడానికి కృషి చేస్తారో తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి పార్టీని బలిచేసుకుంటారో చూడాలనే కామెంట్స్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా?
Comments
Please login to add a commentAdd a comment