వాషింగ్టన్: మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ ఉన్నట్లుండి ఆస్పత్రి బయటకు వచ్చి కారులో తన అభిమానులకు అభివాదం చేస్తూ కలియదిరిగారు. ట్రంప్ చర్య సబబుకాదని మిలటరీ ఆస్పత్రి వైద్యుడు, డెమొక్రాట్లు విమర్శలు చేశారు. అయితే తన ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేస్తున్న అభిమానులకు ఉత్తేజం కలిగించేందుకే ఇలా చేసినట్లు ట్రంప్ చెప్పారు. గురువారం ట్రంప్, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే! అనంతరం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం మిలటరీ ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం తన అభిమానుల కోసం ఆయన బయటకు వచ్చి కలియదిరిగారు. ఇదే వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాస్కు ధరించి కనిపించారు. కరోనాపై పలు అంశాలను ఆస్పత్రిలో చేరడంతో తెలుసుకున్నానని ఆయన చెప్పారు. ఈ చక్కర్లకు తగిన భద్రత కల్పించామని వైట్‌హౌస్ అధికారులు చెప్పారు. మెడికల్ టీమ్ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు. అయితే ఒకపక్క 2లక్షలకు పైగా ప్రజలు కరోనాతో మరణించారని, ఈ సమయంలో కూడా ట్రంప్ తన ప్రచార యావ వదలడం లేదని డెమొక్రాట్ నేత హకీమ్ జెఫర్రీస్ విమర్శించారు. అదేవిధంగా ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ జేమ్స్ ఫిలిప్స్ సైతం ట్రంప్ చర్యను తప్పుబట్టారు. ఈ పర్యటనతో కరోనా వ్యాప్తి ముప్పు పెరుగుతుందన్నారు.
ట్రంప్ చర్యతో ఈ చక్కర్లలో పాల్గొన్న వారంతా 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సిఉంటుందన్నారు. ఇది అనాలోచిత చర్యగా విమర్శించారు. డబ్ల్యూహెచ్‌సీఏ సైతం ట్రంప్ చర్యను ఆక్షేపించింది. కాగా, సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) ట్రంప్ డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని, తదుపరి చికిత్స వైట్ హౌజ్‌లో కొనసాగించవచ్చని డాక్లర్లు కూడా చెప్పారన్నాయి. అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల గడువు కూడా లేకపోవడంతో.. అనారోగ్యాన్ని పక్కనబెట్టి మరీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. కాగా వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్‌ఎనానీకి సైతం సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Comments
Please login to add a commentAdd a comment