వాషింగ్టన్: వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా బారి నుంచి మనల్ని కాపాడే ఆయుధం మాస్క్ అంటూ వైద్యులు, పరిశోధకులు విపరీతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో మాస్క్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసప్పటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ సూచనలు పెద్దగా పట్టించుకోవడం లేదు. స్వయంగా ఆయన కరోనా బారిన పడినప్పటికి మాస్క్ విషయంలో తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఆయన అధికారులు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. మాస్క్ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ట్రంప్ ఉన్నత సలహాదారు ఒకరు కరోనా వ్యాప్తిని అరికట్టడలో మాస్క్ పని చేయదు అంటూ చేసిన ట్వీట్‌ని ట్విట్టర్ తొలగించింది. కరోనా గురించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని షేర్ చేస్తే.. ట్విట్టర్ తొలగించడం చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: మీలో మాస్క్ మహారాజు ఎవరు? )
ఈ నేపథ్యంలో ఆదివారం ట్రంప్ సలహాదారు స్కాట్ అట్లాస్ ‘మాస్క్ పని చేస్తుందా? లేదు’ అంటూ దాని ప్రాముఖ్యతను తగించేలా ట్వీట్ చేయడంతో ట్విట్టర్ దాన్ని తొలగించింది. ఈ చర్యలపై వైట్‌హౌస్ ఇంకా స్పందించలేదు. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 2,17,000 మందికి పైగా అమెరికన్లు మరణించారు. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గినప్పటికి తాజాగా మళ్లీ పెరిగాయి. శుక్రవారం నాడు అమెరికాలో ఏకంగా 69, 400కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో కేసుల సంఖ్య 8 మిలియన్లు దాటింది. తాజాగా కేసుల సంఖ్య పెరగడం పట్ల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం టెస్టులు పెంచడం వల్లే కేసులు పెరిగాయన్నారు. ‘ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలో కేసులు పెరుగుతున్నాయి అంటూ మీడియా అసత్య ప్రచారం చేస్తుంది. కానీ టెస్టులు పెంచడం వల్లనే కేసులు పెరిగాయి’ అన్నారు ట్రంప్. మాజీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ స్కాట్ గాట్లీబ్ మాట్లాడుతూ, "కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేలా జాతీయ వ్యూహం లేకపోతే దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తుంది" అన్నారు. అంతేకాక "రాబోయే మూడు నెలలు అత్యంత కీలకం కానున్నాయి. వైరస్ వ్యాప్తికి మన దగ్గర ఎలాంటి నిరోధం లేదు" అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment