ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల (Covid-19) పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా.. 2,995 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 16వేల మార్క్(16, 354) దాటింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ్టి (కేంద్రం గణాంకాల్లో) లెక్కల్లో కాస్త తగ్గుదలే కనిపిస్తున్నా.. రాబోయే రోజుల్లో మాత్రం కేసుల పెరుగుదల గణనీయంగా ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రముఖ మేదాంత ఆస్పత్రి(గురుగావ్) చెస్ట్ సర్జరీ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగొచ్చన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని దేశ ప్రజలకు సూచిస్తున్నారాయన. అయితే భారత్‌లో కరోనా రెండో వేవ్ నాటి ఆక్సిజన్ కొరత, గణనీయమైన మరణాల నమోదు లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారాయన. వ్యాక్సినేషన్ ప్రభావం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారాయన. అయితే..
వైరస్ వేరియెంట్, జనాలు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని, తద్వారా కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందన్నారు. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నా.. దాని వల్ల కొందరు ఇబ్బందులు పడొచ్చని తెలిపారు. పిల్లలకు.. వృద్ధులకు.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లకు, మరీ ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లపై వైరస్ ప్రతికూల ప్రభావం చూపించొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వేరియెంట్‌లలో మార్పులు త్వరగతిన జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు సూచిస్తున్నారు.
కాబట్టి, లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, ఇతర కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. మాస్క్‌లు ధరించడం వల్ల ఎలాంటి నష్టం కలగదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment