సాక్షి, బెంగళూరు : కింగ్ మేకర్‌గా వెలుగు వెలిగి అధికారం కోల్పోయిన జేడీఎస్‌కు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. పార్టీ అధినేతల వైఖరి నచ్చక చాలామంది నేతలు పార్టీ వీడుతున్నారు. గతేడాది అసమ్మతి పర్వం రూపంలో పలువురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఇంతలో మరికొందరు సీనియర్ నాయకులు రాజీనామాబాటలో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ, మరో నేత మధు బంగారప్ప కూడా వీడ్కోలు చెబుతారనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా తుమకూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు జేడీఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జేడీఎస్ బలం దక్షిణ కర్ణాటకలో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఉత్తర కర్ణాటకలో ఏ జిల్లాలోనూ పార్టీకి బలమైన నాయకులు లేక సతమతమవుతోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత దక్షిణాది జిల్లాల్లో కూడా బీజేపీ ఆపరేషన్ చేపట్టి ఎమ్మెల్యేలను, నాయకులను చేర్చుకోవాలని ఎత్తులు వేస్తోంది.
బుజ్జగింపుల పర్వం
మధు బంగారప్ప, జీటీ దేవెగౌడ జేడీఎస్ వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతేకాకుండా మాజీ మంత్రి జీటీ దేవెగౌడ జేడీఎస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఆ ఇద్దరితో మంతనాలు జరిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటీవల పార్టీ ప్రముఖులతో సమావేశం కూడా నిర్వహించారు. అయినా పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో బుజ్జగించినా ఫలితం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ రమేశ్‌బాబు జేడీఎస్‌కు రాజీనామా చేశారు.
వస్తుంటారు, పోతుంటారు
తాజా పరిణామాలపై దేవెగౌడ స్పందిస్తూ రాజకీయ పార్టీ అంటే వస్తుంటారు.. పోతుంటారు. వెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, జేడీఎస్‌కు ఇది కొత్తేమీ కాదు. పార్టీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment