224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. మే 10న ఎన్నికలు జరిగి, 13న ఫలితాలు వెలువడుతాయి. నాలుగు దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలుపొందలేదు. దీన్ని తిరగరాయాలని బీజేపీ అనుకుంటోంది. సంప్రదాయ ధోరణి మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అదే తనను మెజారిటీ మార్కు దాటిస్తుందని ఆశిస్తోంది.
మూడవ స్థానంలో ఉన్న జేడీఎస్, మళ్లీ కింగ్ మేకర్‌గా ఆవిర్భవించే, వీలైతే కింగ్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. చాలామంది ఓటర్లు ఎన్నికల ప్రకటనకు చాలాముందుగానే తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నది నిర్ణయించుకుంటున్నట్లు గత సర్వేలు సూచిస్తున్నాయి. అందువల్ల ఊగిసలాడే ఓటర్లకు ప్రాధాన్యం పెరుగుతుంది.
అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. సుమారు నెల రోజుల్లో రాష్ట్ర రాజకీయ సంక్లిష్టత విషయంలో ఒక స్పష్టత వస్తుంది. కర్ణాటక ఓటర్లు కొత్త ఎన్నికల ట్రెండును మొదలు పెడతారా, లేక పాత రాజకీయ సంప్రదాయాన్నే పాటిస్తారా అనేది ప్రశ్న.
‘రెండో’ గెలుపు ఒక్కసారే...
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కర్ణాటక ఎన్నడూ అధి కారంలో ఉన్న పార్టీకి తిరిగి గట్టి మెజారిటీని కట్టబెట్టలేదు. చివరిసారిగా రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ 1985లో రెండోసారి కూడా స్పష్టమైన మెజారిటీని సాధించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ మెజారిటీతో గెలుపొందలేదు.
2008లో, 2018లో అది మెజారిటీకి సమీ పంలోకి వచ్చింది. 2008లో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో అది మెజారిటీని సాధించగలిగింది. 2018లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా వల్ల బీజేపీ మెజారిటీ సాధించుకుంది. ఈ రెండు ధోరణులను ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ తిరగరాయా లని ఆశ పడుతోంది.
సంప్రదాయ ధోరణి మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అదే తనను మెజారిటీ మార్కు దాటిస్తుందని అనుకుంటోంది. మూడవ స్థానంలో దూరంగా ఉన్న జేడీఎస్, ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించని స్థితిలో అసెంబ్లీలో అధికారంపై ఆశలు పెట్టుకుంటోంది. మళ్లీ ఒకసారి కింగ్ మేకర్‌గా ఆవిర్భవించే అవకాశం కోసం, వీలైతే మరో సారి కింగ్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తోంది.
మరోవైపున కర్ణాటకలో నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి రాష్ట్రాన్ని నిలుపుకొనేందుకు సకల ప్రయ త్నాలూ చేస్తోంది. చతుర్ముఖ వ్యూహంతో అది పనిచేస్తోంది.
ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకుండానే...
మొదటిది: కేంద్రప్రభుత్వం, దాని నాయకత్వానికి స్పష్టంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గత మూడు నెలలుగా జరుగుతున్నది ఒక సూచిక అనుకుంటే, కేంద్ర నాయకత్వమే నేరుగా ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రదర్శించు కోవడంపై దృష్టి పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏదైనా ప్రస్తా వించడం, కొంత ఆలస్యమైన రెండో ఆలోచనగానే కనబడుతోంది.
రెండు: తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అధికారంలో ఉంటు న్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోంది. రాష్ట్ర నాయకులలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్పష్టంగానే పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారు.
రాష్ట్రంలో పార్టీని నిర్మించి ఘనత ఆయ నదే. ఆయన కరిష్మా ఆధారంగానే నిలబడాలని బీజేపీ ఆశలు పెట్టు కుంటోంది. అయితే ఈసారి కాస్త తేడా ఉంది. తాను ఈ దఫా ఎన్ని కల్లో పోటీ చేయనని యడ్యూరప్ప ప్రకటించారు. ఇంతకుముందటి ఎన్నికల్లో పార్టీ తరపున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు కొచ్చారు. ఇదేమైనా వ్యత్యాసం తేగలదేమో చూడటం ఆసక్తికరం.
మూడు: ఉత్తర, కోస్తా కర్ణాటకలో తనకున్న సాంప్రదాయిక మద్దతును నిలబెట్టుకోవలసిన అవసరం బీజేపీకి ఉంది. అలాగే పాత మైసూర్ ప్రాంతంలోకి చొచ్చుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మైసూరు ప్రాంతంలో ఎక్కువగా కాంగ్రెస్, జేడీఎస్ మధ్యే పోటీ ఉంటోంది. అవసరమైన మెజారిటీని సాధించాలంటే ఉత్తర కర్ణా టకలో తన బలమైన ఉనికిని నిలబెట్టుకుంటూనే, పాత మైసూరులో బీజేపీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో బీజేపీ జాతీయ నాయకులు పదేపదే పర్యటనలు చేస్తుండటం దీన్నే తేటతెల్లం చేస్తోంది. చివరగా, కర్ణాటకలో విస్తృతమైన సామాజిక ఏకీభావాన్ని నిర్మించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. పార్టీకి లింగాయతులు తమ మద్దతును ఎప్పటిలా కొనసాగిస్తారని నమ్ముతూనే వక్కళిగలు, ఓబీసీలు, దళితుల మద్దతును కూడగట్టుకోవాలని బీజేపీ ప్రయత్ని స్తోంది. రిజర్వేషన్ కోటాను తిరగరాయడం ఈ కులాల్లోకి వ్యాప్తి చెందే లక్ష్యంలో భాగమేనని చెప్పాలి.
ఐక్యత లేమి పార్టీకి నష్టం
కర్ణాటకలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రధాన పక్షంగానే ఉంటూ వచ్చింది. కానీ ముఠాతత్వం, కీలక సమయాల్లో ఐక్యతా లేమి కారణంగా పార్టీ మట్టికొట్టుకుపోతోంది. అయితే, ఐక్యత లేకుండా ఈ దఫా ఎన్నికల్లో మెజారిటీ వచ్చే అవకాశం కలగానే మిగిలిపోతుందని పార్టీ, ప్రత్యేకించి దాని రాష్ట్ర నాయకత్వం గుర్తిస్తోంది. ఇద్దరు కీలక నేతలు సిద్ధ రామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవిపై తమ ఆకాంక్షలను ఇప్పటికే ప్రకటించారు.
అయితే తమ లక్ష్మణ రేఖను మాత్రం వారు దాటలేదు. ఎన్నికల అనంతరమే ముఖ్య మంత్రి అభ్యర్థి నిర్ణయం జరుగుతుందని వీరు ప్రకటించారు. పార్టీలో ఐక్యత కొన సాగుతుందో లేదో తేల్చడానికి అభ్యర్థలకు టికెట్ల పంపిణీ సమయమే లిట్మస్ పరీక్ష అవుతుంది (అయితే ఇప్పటికి రెండు జాబితాలను కాంగ్రెస్ వెలువరించింది).
ఇంతవరకు పార్టీ స్థానిక సమ స్యలపై, బీజేపీ పాలనపై దృష్టి పెట్టింది. అయితే, లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీ బహిష్కరణను కూడా తమ ప్రచా రంలో అదనపు అంశంగా జోడించింది. సాంప్రదాయకంగా మద్దతు పొందుతున్న పలు వర్గాల పొత్తును కాంగ్రెస్ పట్టుదలతో సాధించిందని గుర్తుంచుకోవాలి.
స్పష్టమైన ఫలితమే...
జేడీఎస్ పార్టీ సుదూరంలోని మూడవ శక్తిగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాజకీయంగా పెను నష్టాన్ని చవిచూసింది. దాంతో పాత మైసూరు రీజియన్లోని జేడీఎస్ సాంప్రదాయిక పునాదిలోకి బీజేపీ చొచ్చుకు వెళ్లడానికి ఇది అనుమతించింది. అయితే కాంగ్రెస్, బీజేపీ రెండూ తమ పార్టీతో టచ్‌లో ఉంటున్నాయని చెప్పడం ద్వారా జేడీఎస్ నేత కుమారస్వామి రాజకీయంగా సంచలనం సృష్టించారు.
చాలామంది ఓటర్లు ఎన్నికల ప్రకటనకు చాలాముందుగానే తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నది నిర్ణయించుకుంటున్నట్లు గత కొన్నేళ్లలో లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ జరిపిన పోల్ అనంతర సర్వేలు సూచిస్తున్నాయి. క్రితంసారి కర్ణాటక ఎన్నికల విషయంలో ఇదే నిజమైంది. కొంతమేరకు ఇది రాజకీయ పోలరైజేషన్‌ను ప్రతిఫలించింది.
ఈ పార్టీలకు ఉన్న నిబద్ధ ఓటర్ల రీత్యా, ఇది అంత ఆశ్చర్యం కలిగించదు. అందువల్ల ఊగిసలాడే ఓటర్లకు ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు తీవ్రమవుతాయి. చాలామంది ఎన్నికల వ్యాఖ్యాతలు ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఊహిస్తున్నారు. కానీ ఈ అసెంబ్లీ ఫలితాలు మరింత స్పష్టతతో వెలువడతాయి.
సందీప్ శాస్త్రి
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు;జాతీయ సమన్వయకర్త, లోక్‌నీతి నెట్‌వర్క్
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment