బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సటీలో విద్యార్థిని ఎంజే గుణ. కొద్ది రోజుల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండాయి. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తమ నాయకుడ్ని ఎన్నుకునే రోజు వస్తుందాని ఆమె ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమె ఉద్దేశంలో నాయకుడంటే బాగా చదువుకుని, దార్శినికుడై ఉండాలి. ‘‘నేను ఓటు వేసే ముందు ఏ పార్టీ అని కూడా చూడను.
మా నియోజకవర్గానికి అభ్యర్థి ఏం చేస్తాడన్నదే ముఖ్యం. ఆ తర్వాత అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్, విద్యార్హతలు, గతంలో చేసిన పని, భవిష్యత్‌లో ఏం చేయగలడు వంటివన్నీ చూశాకే ఓటేస్తా’’అని ఆమె కచ్చితంగా చెప్పింది. సునీత అనే మరొక ఫస్ట్ టైమ్ ఓటరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మనకున్నప్పుడే రాష్ట్రం, దేశం సరైన మార్గంలో వెళతాయని చెప్పుకొచ్చింది. వీరి మాటలు వింటే సంప్రదాయంగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ, తాయిలాల ఆశ చూపిస్తూ వెళ్లే పార్టీల వైపు వీరు చూసే చాన్సే లేదు.
కొత్తగా ఓటు హక్కు పొందడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు సిఫారసు చేశారనో ఎవరికి పడితే వారికి నేటి తరం ఓటు వెయ్యరు. సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన అభ్యర్థికి తొలిసారి ఓటు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. ఓటు వెయ్యడంలో ఉదాసీనత మచ్చుకైనా లేదు. ఉరిమే ఉత్సాహంతో చూపుడు వేలి మీద సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలు దిగి ఓట్ల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. కర్ణాటకలో మెజార్టీ మార్కు దాటడానికి అత్యంత కీలకమైన కొత్త ఓటర్ల మదిలో ఏముంది ?
గత ఎన్నికల్లో...
మొదటి సారి ఓటు వేసే వారిలో కొత్త ఉత్సాహం, ఓటు వెయ్యాలన్న తపన ఎక్కువ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళతారు. గత 3 ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు ఓటు వేసే విధానాన్ని విశ్లేషిస్తే వారి నాడి పట్టుకోవడం కష్టమనే అభిప్రాయం కలుగుతుంది. సీఎస్‌డీఎస్–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే కొత్త ఓటరు అండదండ లేనిదే ఏ పార్టీ కూడా మెజార్టీ మార్క్ సాధించలేదు.
కొత్త ఓటరు ఎటుంటే..
కర్ణాటకలో ఈ సారి 11 లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 7.7 లక్షలుంటే ఈ సారి వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ప్రతీ సారి ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కొత్త ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. మనీ, మద్యం కంటే అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి, చెడులను తామే విశ్లేషించుకునే శక్తి సామర్థ్యాలున్నవారు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైనా పార్టీ మెజార్టీ మార్కు దాటాలంటే కొత్త ఓటర్లు అత్యత కీలకమని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు.
పార్టీల కొత్త పంథా..!
మేము ఏం చేస్తాం అన్నది కాదు.. మీకేం కావాలన్నదే ముఖ్యం అని కొత్త ఓటర్ల మనసులో ఏముందో పార్టీలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘‘సెలబ్రేట్ యువర్ ఓటు’’అనే ప్రచారాన్ని ప్రారంభించింది. 18–23 మధ్య వయసున్న వారే లక్ష్యంగా చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టడం, అందరికీ ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్నివ్వడం ప్రస్తుతం యువత ఆశిస్తుందని తెలుసుకొని ఆ దిశగా వ్యూహాలు పన్నుతోంది. దాంతో పాటు నిరుద్యోగులు తల్లిదండ్రులకి భారంగా మారకుండా రెండేళ్ల పాటు నెలకి రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది.
భారతీయ జనతా పార్టీ యువ సంవాద్ కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల ఆశలు, ఆకాంక్షల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది.కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సిట్టింగ్‌లను కాదని అత్యధికంగా 60 మంది కొత్త ముఖాలకు టికెట్లిచ్చింది. జేడీ(ఎస్) పంచరత్న రథయాత్రలో యువతకే అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కుమారస్వామి ప్రచారంలో యువతతోనే మాట్లాడుతూ వారి నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఓటర్లు తమ వైపేనని ధీమాతో ఉంది. ఢిల్లీ, పంజాబ్‌లో యువ ఓటర్లను అధికంగా ఆకర్షించిన ఆప్ ఈసారి ఉన్నత విద్య అభ్యసించిన వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చింది.
2008: ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కుకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సగటు ఓటు షేరు కంటే కొత్త ఓటరు వేసిన ఓట్ల వాటా (మొత్తం పోలయిన కొత్త ఓటర్ల ఓట్లలో) ఎక్కువగా ఉంది. కొత్త ఓటర్ల ఓటు షేర్ మూడు శాతం ఎక్కువగా ఉంది.
2013: అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కాంగ్రెస్ వైపు స్వల్పంగా మొగ్గు చూపించారు. ఆ పార్టీకి వచ్చిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్లు కాంగ్రెస్‌కు వేసిన ఓటు షేరు ఒక్క శాతం అధికంగా
ఉంది. హస్తం పార్టీ గద్దెనెక్కింది.
2018: బీజేపీ మెజార్టీ మార్కుకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్లేనని సీఎస్‌డీఎస్–లోక్‌నీతి గణాంకాల్లో తేలింది. బీజేపీకి పోలయిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్ల షేరు ఆరు శాతం తక్కువగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది.
2013, 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీకి సగటు ఓటు షేర్ కంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓటు షేర్ నాలుగు శాతం అధికంగా ఉంది. దీంతో పట్టణ యువత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తేలుతోంది.
-సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment