మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి...
కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది.
59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది.
కోటాతో రాజకీయ ఆట
అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది.
ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్‌లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు.
హింద్ వర్సెస్ అహిందా
లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్‌లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు.
ఓబీసీలు ఎటువైపో...!
వీరశైవ లింగాయత్‌లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్‌లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment