కరెంట్ రగడ
- విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై నిలదీసిన కుమారస్వామి
- సమగ్ర దర్యాప్తునకు సభా సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్
- న్యాయ విచారణకు స్పీకర్ సూచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా సాగిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయడానికి సభా సంఘాన్ని నియమించాలని శాసన సభలో జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్‌డీ. కుమారస్వామి డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ పద్దులపై సోమవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన 2007-08 నుంచి 2012-13 వరకు విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతకు ముందు 0.1 శాతంగా ఉన్న విద్యుత్ కొనుగోలు ఆ ఐదు సంవత్సరాల వ్యవధిలో 19 శాతానికి పెరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవధిలో రూ.17,480 కోట్లతో విద్యుత్‌నుకొనుగోలు చేశారని వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు ధరను ఏడు శాతం నుంచి పది శాతానికి పెంచిన విషయాన్ని కూడా ఆయన సభ దృష్టికి తీసుకు వస్తూ, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆసక్తికరమైన చర్చ
విద్యుత్ కొనుగోలు విషయమై సాదాసీదాగా ప్రారంభమైన చర్చ తీవ్ర ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్, కుమారస్వామి వాదనతో ఏకీభవిస్తూ దీనిపై ఏదైనా దర్యాప్తు జరిగితేనే మంచిదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కే చెందిన మరో సభ్యుడు శివమూర్తి ఇదో స్కామ్ అంటూ ఆరోపించారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ రాష్ట్ర అవసరాల దృష్ట్యా విద్యుత్‌ను కొనుగోలు చేస్తే, ఏదేదో ఆపాదిస్తారెందుకని ప్రశ్నించారు.
బీజేపీ అప్పట్లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల కాలానికి ఎందుకు, గత 20 ఏళ్ల వ్యవధిలో జరిగిన విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దశలో బీజేపీ, జేడీఎస్ సభ్యుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై న్యాయ విచారణ జరిపించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఇదే సందర్భంలో ప్రభుత్వానికి సూచించారు.