మత్తు వదిలించే సినిమా! | udta punjab movie review | Sakshi
Sakshi News home page

మత్తు వదిలించే సినిమా!

Published Sat, Jun 18 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

మత్తు వదిలించే సినిమా!

మత్తు వదిలించే సినిమా!

 భారత - పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం... చిమ్మచీకటిలో, పొలాల మధ్య నుంచి ముగ్గురు వ్యక్తులు ఒక ద్విచక్రవాహనంపై వస్తారు. వాళ్ళలో ఒకడు తన చేతిలో ఒక చిన్న ప్యాకెట్ లాంటి దాన్ని బలంగా, షాట్‌పుట్ విసిరినట్లు సరిహద్దు ఆవల ఉన్న ఇండియా భూభాగంలోకి విసురుతాడు. ఆ పొట్లంలో ఉన్నది 3 కిలోల ‘సరుకు’... మార్కెట్‌లో అక్షరాలా కోటి రూపాయల పైగా విలువున్న ‘మాల్’... కొన్ని లక్షల మందిని నిత్యం మత్తులో ముంచెత్తే మాదకద్రవ్యం. ఉద్దేశించిన డ్రగ్స్ వ్యాపారులకు కాకుండా, భారత భూభాగం లోని పొలానికి ఆ రాత్రి వేళ వచ్చిన ఒక అమ్మాయి చేతికి ఆ ‘సరుకు’ చిక్కు తుంది. గాలిలోకి విసిరిన ఆ సరుకు ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేస్తుంది... అచ్చంగా ఈ డ్రగ్స్ మత్తుతో గాలిలో తేలుతున్న పంజాబ్ యువతరం లాగే!
 
 ఇది ‘ఉడ్తా పంజాబ్’ ఓపెనింగ్ సీన్. వెల్‌కమ్ టు ‘ఉడ్తా పంజాబ్’... దేశంలోని అందరి కళ్ళూ తెరిపించేలా ఓపెన్‌గా సాగిన సినీ ప్రయత్నం. సెన్సార్ మొదలు రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో సినిమా అంతా లీకైపోవడం దాకా - రకరకాల వివాదాలతో, విడుదలకు ముందే ఇటీవల దేశం మొత్తం దృష్టినీ ఆకర్షించిన సినిమా.  పంజాబ్, ఆ రాష్ట్ర సరిహద్దుల్లోని యువతీ యువకుల్లో కనీసం నూటికి 50 మంది ఏదో ఒక రకమైన మాదక ద్రవ్యా లకూ, మద్యానికీ బానిసలని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ సమకాలీన అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, డ్రగ్స్‌కు రాజధానిగా మారుతున్న పంజాబ్‌లోని వాస్తవ పరిస్థితులకూ, తప్పుదోవ పడుతున్న అక్కడి యువతరానికీ నిలువుటద్దం.
 
 డ్రగ్స్‌కు బానిసైన టామీసింగ్ అలియాస్ గబ్రూ అనే పాప్ గాయకుడు (షాహిద్ కపూర్)... పొలంలో దొరికిన ఆ పొట్లంలోని ‘మాల్’ను అమ్ముకొని జీవితాన్ని కొద్దిగానైనా సుఖవంతం చేసుకోవాలనుకొని అనుకోకుండా ఈ ఊబిలో కూరుకుపోయిన ఒక దిగువ మధ్యతరగతి అమ్మాయి (అలియా భట్)... కేవలం 50 రూపాయలకే దుకాణంలో ఇంజక్షన్ రూపంలో దొరికే డ్రగ్స్‌కు స్నేహితులతో కలసి బానిసైన ఒక కాలేజీ టీనేజ్ కుర్రాడు... ‘మా వాడు మంచోడే! చుట్టుపక్కల ఉన్నవాళ్ళే’ అన్న భ్రమలో బతికి, చివరకు ఆ చిన్నారి తమ్ముణ్ణి కాపాడుకోవడానికి తపించే ఒక చిన్నస్థాయి పోలీసు అధికారి (దిల్జీత్ దోసంఝ్), పంజాబ్‌లోని ఈ డ్రగ్స్ బానిసల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయడమే కాక, సమాజంలో మార్పు తేవాలని తపించే ఒక లేడీ డాక్టర్ (కరీనా కపూర్)... పంజాబ్ అయిదు నదులకు ఆలవాలమైతే, ‘ఉడ్తా పంజాబ్’ సినిమా ఈ అయిదుగురి జీవితాల్లోని సంఘర్షణల సమాహారం. ఈ అయిదుగురి జీవితాలూ ఒకదానికొకటి ముడిపడి, ఎలా పయనించాయన్నది 148 నిమిషాల పైచిలుకు సినిమా. సెన్సార్ బారి నుంచి ఒకే ఒక్క కట్‌తో బయటపడి, మొదలవడానికి ముందు తెర నిండా వివరంగా పే...ద్ద ‘గమనిక’తో జనం ముందుకొచ్చిన ఈ సినిమా ప్రారంభమైన పది నిమిషాల కల్లా తనతో పాటు తెర మీది జీవితంలోకి లాక్కెళుతుంది.
 
  పంజాబీ సమాజంలో నిత్యం మాటల్లో వినిపించే తిట్లతో సహా ఎన్నో పదునైన డైలాగ్స్, నిజజీవిత పాత్రలు అందుకు దోహదం చేస్తాయి. సెకండాఫ్ కొంత సినిమాటిక్‌గా అనిపించినా, ఇప్పటికే డ్రగ్స్ సేద్యంతో ‘రెండో హరిత విప్లవా’నికి ఆలవాలమైన పంజాబ్ మరో మెక్సికో లాగా మారకూడదనే బలమైన సందే శాన్ని హత్తుకొ నేలా చెప్పా లంటే ఆ మాత్రం స్వేచ్ఛ తప్పదని సర్దు కుంటాం. మాటలు, పాటల్లో పంజాబీ పదా లెక్కువ కలగలసిన ఈ సినిమా సబ్‌టైటిల్స్ సాక్షిగా ఆలోచనల్లోకి నెడు తుంది.
 
 షాహిద్, అలియా ఆ పాత్రల్లో చూపిన ఆవేదన, కరీనా లాంటి సీజన్డ్ ఆర్టిస్ట్‌లతో పాటు దిల్జీత్ లాంటి అపరిచిత ముఖాలెన్నో చేసిన అభినయం ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతం, మరీ ముఖ్యంగా హాకీ కర్రతో అలియా భట్, దుండగుల్ని కొట్టే సీన్ లాంటి చోట్ల వినిపించే సంగీతం, తాత్త్వికమైన ‘ఏక్ కుడీ’ అనే ఆఖరి పాట బాగున్నాయి. సమాజంలోని రాజకీయాల్ని కూడా ప్రస్తావించే ఇంత పచ్చి వాస్తవిక చిత్రణను తెరపై చూస్తున్నప్పుడు, ఆ జీవిత వేదనకు అప్రయత్నంగా అనేకసార్లు అయ్యయ్యో అంటాం.
 
 కన్నీళ్ళు కారుస్తాం. ఒక కళారూపానికి అంతకన్నా ప్రయోజనం ఏముంటుంది!
 అయితే, మరో తొమ్మిది నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నవేళ సహజంగానే ఇలాంటి యత్నాలు అధికార పీఠంపై ఉన్నవాళ్ళకు రుచించవు. అందుకే ఈ సినిమాపై అధికార పక్షం చేతి కింది సెన్సార్ బోర్డ్ అభ్యంతరాల మొదలు సెన్సార్ నుంచే ఆన్‌లైన్ లీకేజ్ దాకా అన్నీ జరిగాయన్నది పగవాడికే కాదు, పసివాడికైనా అర్థమైపోతుంది. కానీ, సినిమాతో పాటు ఈ అనుకోని పబ్లిసిటీ కూడా డ్రగ్స్‌పై చైతన్యం తేవాలన్న ఆశయాన్ని కొంత నెరవేర్చింది.
 
 సెన్సార్ వాళ్ళ అధికార మత్తు... హరిత విప్లవానికి ఆలవాలమనీ, సుభిక్షమనీ పంజాబ్ పట్ల ఉన్న అందరికీ ఉన్న భ్రమల మత్తు... కమర్షియల్ సినిమాలకు అలవాటు పడి, వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉండడానికి ఇష్ట పడుతున్న ప్రేక్షకుల మత్తు... అన్నీ వదిలించే ప్రయత్నంగా ‘ఉడ్తా పంజాబ్’ గుర్తుండిపోతుంది. సెమీ డాక్యుమెంటరీ శైలిలో తెరపై ఒక నవల చూస్తున్న అనుభూతిని మిగిల్చిపోతుంది. ఒక్క ముక్కలో - వాస్తవాన్ని తట్టుకొనే గుండె ధైర్యం, హృదయాన్ని మెలిపెట్టే జీవచ్ఛవాల్ని చూసే మనసు తడి ఉన్నవాళ్ళ కోసం ఈ సినిమా. ఇది అక్షరాలా ‘ఉడ్తా’ ఇండియన్ ఫిల్మ్!
 
 చిత్రం: ‘ఉడ్తా పంజాబ్’, తారాగణం: షాహిద్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, దిల్జీత్ దోసంఝ్, స్క్రీన్‌ప్లే: అభిషేక్ చౌబే, సుదీప్‌శర్మ, మాటలు: సుదీప్‌శర్మ
 కెమేరా: రాజీవ్ రవి, నిర్మాతలు: శోభాకపూర్, ఏక్తాకపూర్, అనురాగ్ కశ్యప్, దర్శకత్వం: అభిషేక్ చౌబే, రిలీజ్: జూన్ 17

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement