సుప్రీంకు చేరిన ఉడ్తా పంజాబ్ వివాదం
న్యూఢిల్లీ: అనేక మలుపుల మధ్య 'ఉడ్తా పంజాబ్' వివాదం చిట్టచివరకు సుప్రీంకోర్టుకు చేరింది. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ పంజాబ్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశ ఉంది. ఉడ్తా పంజాబ్ సినిమాలో ఒక్క సీన్ మాత్రమే కట్ చేసి, విడుదలకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.
కాగా పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న డ్రగ్ కల్చర్ మీద తీసిన ఉడ్తా పంజాబ్ విడుదలకు ముందే లీక్ అయింది. సినిమా మొత్తం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు సెన్సార్ సభ్యులే ఈ సినిమాను లీక్ చేసినట్లు చిత్ర నిర్మాత ఆరోపిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్ని అడ్డంకులు తొలగిపోతే ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.