
'క్రియేటివిటీని చంపొద్దు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. సృజనాత్మకతను చంపడానికి ప్రయత్నిచడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. తన తాజా చిత్రం 'టీఈ3ఎన్' సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఉడ్తా పంజాబ్' వివాదంపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు.
'ఈ వివాదం గురించి పూర్తిగా నాకు తెలియదు. దీని గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను. క్రియేటివిటీని చంపడానికి ప్రయత్నం చేయొద్దని నేను చెప్పదల్చుకున్నాను. సృజనాత్మకతను చంపితే ఆత్మను నాశనం చేసినట్టే. నిబంధనలు, నియంత్రణల గురించి నాకు తెలుసు. వీటిని అమలు చేయడానికి ప్రభుత్వం ఉంది. కళాకారుడిగా, క్రియేటివ్ పర్సన్ గా సృజనాత్మకతను చంపొద్దని కోరుకుంటున్నా'ని అమితాబ్ పేర్కొన్నారు. సినిమా విడుదల దగ్గరపడే వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్లే నిర్మాతలు ఇబ్బంది పడాల్సివస్తోందని అభిప్రాయపడ్డారు.