'ఫిలిమ్ ఇండస్ట్రీని అవమానించారు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమాకు బాలీవుడ్ నటులు, దర్శకులు బాసటగా నిలిచారు. మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అనురాగ్ కశ్యప్ పై అసత్య ఆరోపణలు చేసిన సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లజ్ నిహలానీ క్షమాపణలు చెప్పాలని దర్శకులు డిమాండ్ చేశారు. ఆయనను పదవి నుంచి తప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అశోక్ పండిట్ నేతృత్వంలో నటులు, దర్శకులు మీడియాతో మాట్లాడారు.
మన దేశం సౌదీ అరేబియాలా మారరాదని దర్శకుడు మహేశ్ భట్ అన్నారు. సమాజంలో జరిగిన వాటినే సినిమాలు మలుస్తున్నామని, ఊహించి లేదా సృషించి సినిమాలు తీయడం లేదని మరో దర్శకుడు రాహుల్ దొలాకియా తెలిపారు. ఈ సినిమాలోని సందేశం అందరికీ చేరేలా సహకరించాలని హీరో షాహిద్ కపూర్ విజ్ఞప్తి చేశాడు.
సాధారణంగా సినిమా వర్గాలు సైలెంట్ గా మద్దతు తెల్పుతుంటాయని, మొదటిసారిగా ఒక సినిమాకు బహిరంగంగా సపోర్టు చేస్తున్నారని నటుడు, దర్శకుడు సతీశ్ కౌషిక్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి అనురాగ్ కశ్యప్ లంచం తీసుకున్నారని ఆరోపణలు చేసి సినిమా పరిశ్రమను నిహలానీ అవమానించారని అశోక్ పండిట్ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు పదవికి నిహలానీ తగరని ముఖేశ్ భట్ ధ్వజమెత్తారు.