
నేను అడుగుపెడితే విజయమే తప్ప పరాజయం ఉండదు అని నిరూపిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli). ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే! అలాంటి దర్శకుడిని కాపీ కొట్టాలని చూస్తున్నారని.. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్థాయిని అందుకోలేరంటున్నాడు బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap).
రాజమౌళి ఒరిజినల్
తాజాగా అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాన్ ఇండియా హిట్లు తీయగానే రాజమౌళిపి కాపీ కొట్టినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, వారెప్పటికీ ఆయనలా మారలేరు. ఎందుకంటే రాజమౌళి ఒక్కరే.. ఆయన ఒరిజినల్! ఎన్నటికీ ఆ చీప్ కాపీలు రాజమౌళి కాలేవు. అలాగే కేజీఎఫ్ సినిమా హిట్టవగానే చాలామంది అదే తరహా చిత్రాలు తీశారు. ఏవీ వర్కవుట్ కాలేదు.
కాపీ కొట్టడం మానేసి..
అయినా పాన్ ఇండియా ట్రెండ్ ఇప్పటిది కాదు. చిరంజీవి (Chiranjeevi) 'ప్రతిబంధ్', నాగార్జున 'శివ', రజనీకాంత్ 'ఫౌలది ముక్క' (పాయం పులి).. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే.. నా చిన్నతనంలోనే ఈ పాన్ ఇండియా సినిమాలు చూశాను. నేనేమంటానంటే ఎవరికి వారే ప్రత్యేకం. అవతలివారిని కాపీ కొట్టడానికి బదులు తమలోని నైపుణ్యాన్ని బయటకు తీయాలి అని అనురాగ్ చెప్పుకొచ్చాడు.
ఆ సినిమాలెప్పుడు వచ్చాయంటే?
చిరంజీవి 'ప్రతిబంధ్' సినిమా 1990లో వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూహీ చావ్లా కథానాయిక. రజనీకాంత్ హీరోగా నటించిన 'పాయం పులి' సినిమాకు హిందీ డబ్బింగ్ వర్షనే 'ఫౌలది ముక్క'. ఎస్‌పీ ముత్తుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1983లో రిలీజైంది. నాగార్జున హీరోగా నటించిన 'శివ' 1989లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. దీనికి రామ్ గోపాల్‌వర్మ దర్శకుడిగా వ్యవహరించాడు.
చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్