
కొన్ని సినిమాలకు లాజిక్‌తో పని లేదంటున్నాడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar). కథపై నమ్మకం ఉంటే చాలు అవి హిట్టవుతాయంటున్నాడు. తాజాగా కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మనం ఎంచుకున్న కథను నమ్మడం అన్నింటికన్నా ముఖ్యమైనది. కొందరు ఉత్తమ దర్శకులనే ఉదాహరణగా తీసుకోండి.. వారు లాజిక్స్‌ను పట్టించుకోకుండా కథను నమ్మడం వల్లే పెద్ద విజయాలు అందుకున్నారు.
లాజిక్ లేకపోయినా..
సినిమా నచ్చితే లాజిక్‌ను ఎవరూ పట్టించుకోరు. ఉదాహరణకు రాజమౌళి (SS Rajamouli) సర్ సినిమాలే తీసుకోండి. ఆయన తీసిన సినిమాల్లో లాజిక్స్ గురించి జనాలు మాట్లాడుకుంటారా? లేదు కదా.. ఆయనకు కథపై పూర్తి నమ్మకం ఉంటుంది. ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కించగలరు. యానిమల్, ఆర్‌ఆర్‌ఆర్, గదర్.. ఈ సినిమాలన్నింటికీ ఇదే ఫార్ములా వర్తిస్తుంది.
ప్రేక్షకులు నమ్మారు
ఒక వ్యక్తి సింగిల్ హ్యాండ్‌తో వెయ్యిమందిని కొడుతున్నట్లు చూపించినప్పుడు అది ఎలా సాధ్యం? అని ఎవరూ లెక్కలు వేయరు. సన్నీ డియోల్ (Sunny Deol)కు వెయ్యి మందిని ఓడించే శక్తి ఉందని అనిల్ శర్మ నమ్మాడు. అదే వెండితెరపై చూపించాడు. ప్రేక్షకులూ అదే విశ్వసించారు. అందుకే గదర్ 2 అంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దర్శకులు తమ కథను నమ్మినప్పుడే విజయాలు సాధించగలరు. చేసే పనిని సందేహించినా, ఆడియన్స్ ఏమనుకుంటారోనని లాజిక్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినా సమస్యలు చుట్టుముట్టడం ఖాయం' అని చెప్పుకొచ్చాడు.
నిర్మాతగా ఫుల్ బిజీ
కరణ్ జోహార్ ప్రస్తుతం 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా నిర్మిస్తున్నాడు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్య మల్హోత్రా, రోహిత్ శరఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కరణ్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అక్షయ్‌కుమార్- మాధవన్‌ల కేసరి: చాప్టర్ 2తో పాటు కార్తీక్ ఆర్యన్‌తో మరో సినిమా చేస్తున్నాడు.
చదవండి: ఓటీటీ సెన్సేషన్.. జాన్వీ కపూర్ కంటే గొప్ప నటి.. అయినా పట్టించుకోరే?