
ఈ యేడు సాధారణ వర్షపాతం
⇔ ఎల్‌నినో ప్రభావం నామమాత్రమే: ఐఎండీ
⇔ రాయలసీమ, తమిళనాట కాస్త తక్కువ వర్షాలు!
⇔ మార్కెటింగ్ సదుపాయాలు ఉంటేనే రైతులకు లాభం: స్వామినాథన్
⇔ సాధారణం కన్నా తక్కువ వర్షాలే: స్కైమెట్
భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం తన తొలి వాతావరణ అంచనాను వెల్లడించింది. ప్రాంతాలవారీగా ఎంతెంత వర్షపాతం కురవొచ్చన్న వివరాలను జూన్‌లో విడుదల చేసే రెండో అంచనాలో తెలపనుంది. ‘‘దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 96 శాతం వరకు కురవొచ్చు. ఇది 5 శాతం అటుఇటుగా ఉండొచ్చు. ఆత్మహత్యలు, అప్పుల సమస్యలతో సతమతమవుతున్న రైతులతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది శుభవార్తే..’’అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ చెప్పారు. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే 96 శాతం నుంచి 104 శాతం మధ్య వర్షపాతం నమోదైతే దాన్ని సాధారణం వర్షపాతంగా పేర్కొంటారు.
104 శాతం కన్నా ఎక్కువ పడితే అధిక వర్షపాతం అని, 96 శాతం కన్నా తక్కువ పడితే లోటు వర్షపాతంగా వ్యవహరిస్తారు. అయితే ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ‘‘సాధారణ వర్షపాతం నమోదయ్యే ప్రతీసారీ మధ్య భారతం, పశ్చిమ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, తమిళనాడుల్లో మాత్రం కాస్త తక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది’’అని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. స్కైమెట్ వాతావరణ సంస్థ మాత్రం ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని అంటోంది. ముఖ్యంగా పశ్చిమ భారతంలో వర్షపాతం తక్కువగా ఉండొచ్చనీ, ఎల్‌నినో ప్రభావం దీనికి కారణమని చెబుతోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నినో పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నా దాని ప్రభావం నామమాత్రమేనని ఐఎండీ పేర్కొంటోంది. నైరుతి రుతుపవనాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అంటోంది.
కేవలం వర్షం కురిస్తే లాభాలు రావు: స్వామినాథన్
సాధారణ వర్షపాతం కురుస్తుందని ఐఎండీ చెప్పడం పట్ల హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ స్పందించారు. వ్యవసాయానికి ఈ వార్త మంచి ఊపును ఇస్తుందనీ, అదే సమయంలో రైతుకు ఆదాయం రావాలంటే మాత్రం పంట పండితే సరిపోదనీ, సరైన ధరలు, మార్కెటింగ్ సదుపాయాలు కూడా ఉండాలని పేర్కొన్నారు. తగినంత వర్షం పడడం ఎంత ముఖ్యమో, ధరలు, మార్కెటింగ్ సదుపాయాలు కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. పంటకు మంచి ధర వస్తుందని అనుకుంటే రుతుపవనాలు అనుకూలంగా లేకపోయినా రైతు పంట వేయడానికి ప్రయత్నిస్తాడనీ..అంటే వర్షంతోపాటు, మార్కెట్ ధరలు కూడా పంట వేయడానికి కీలకమేనని స్వామినాథన్ చెప్పుకొచ్చారు.
కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభనా పట్నాయక్ మాట్లాడుతూ... ఈ ఏడాది 272 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రాగలదని అంచనా వేస్తున్నామని చెప్పారు. రైతులకు భారీ పంట దిగుబడులు, ఉత్పత్తులకు మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నట్లు వ్యవసాయ–ఆర్థిక వేత్త, సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్టŠస్ అండ్ ప్రైసెస్) మాజీ చైర్మన్ అశోక్ గులాటీ అన్నారు. ఇక్రా లిమిటెడ్ ముఖ్య ఆర్థిక వేత్త అదితి నాయర్ మాట్లాడుతూ.. వర్షపాతం, పంట దిగుబడి పరిమాణం, పంట చేతికొచ్చే సమయం...ఈ మూడింటికి ఈ ఏడాది అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాగా, దేశంలోని రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యంలో ప్రస్తుతం 31 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది.
గతేడాది ఏం చెప్పింది..?
2016లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే చాలాచోట్ల ఆ అంచనాలు తప్పాయి. సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిశాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.