దేశంలో లోకసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగున్నాయి. వివిధ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే జనం చేతిలో ఓటు అనే అయుధం ఉంది. దీనితో వారు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తుంటుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఒక హస్త కళాకారిణి వినూత్న రీతిలో ఓటు హక్కుకున్న ప్రాముఖ్యత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.
జైపూర్‌లోని సాంగనేర్ నివాసి నీరూ చాబ్రా ప్రజలకు ఓటుహక్కు ప్రాముఖ్యతను తెలియజేయాలని భావించారు. ఇందుకోసం ఆమె బియ్యపుగింజలపై ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ రాశారు. ఆమె బియ్యపు గింజపై భారత మ్యాప్‌ను సూక్ష్మ శైలిలో గీయడంతోపాటు ఎన్నికల స్లోగన్ కూడా రాశారు.
ఈ సందర్భంగా నీరూ చాబ్రా మీడియాతో మాట్లాడుతూ 1984 నుంచి తాను బియ్యపు గింజపై సూక్ష్మ అక్షరాలు రాయడాన్ని కొనసాగిస్తున్నానని, కిచెన్‌లో వంట చేసేటప్పుడు తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు. మెల్లమెల్లగా ఈ కళలో ప్రావీణ్యం సంపాదించానని అన్నారు. కాగా నీరూ బియ్యపు గింజపై 108 అక్షరాలు రాసి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నీరూ చాబ్రా ప్రతిభను గతంలో మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment