కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం | CM KCR Review Meet on Crop Purchase and Farming | Sakshi
Sakshi News home page

కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

Published Tue, Mar 30 2021 12:57 AM | Last Updated on Tue, Mar 30 2021 10:18 AM

CM KCR Review Meet on Crop Purchase and Farming - Sakshi

సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

హైదరాబాద్‌: రైతులు ఇబ్బంది పడకూడదని, గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటామని ఇటీవల అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ.. యాసంగిలో భారీ విస్తీర్ణంలో వరి సాగు జరిగినందున రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్‌లాగే కొనుగోళ్లు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగిలో పండనున్న వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు.

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 1.17 కోట్ల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 21 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ.20 వేల కోట్ల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.

తక్షణం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కోరారు. హైదరాబాద్‌లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డికి సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి, సీఎస్, అధికారులను ఆదేశించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 2,131, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో 3,964, మరో 313 కేంద్రాలు కలిపి మొత్తం 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. 

తేమ 17 శాతానికి మించకుండా చూసుకోవాలి
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు.. కనీస మద్దతు ధర లభించేలా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. వడ్లు ఎండబోసి, తాలు లేకుండా, తేమ 17 శాతానికి మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ సిద్ధంగా ఉన్నందున, కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వడానికి స్థలాలను ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

మన పత్తికి మంచి డిమాండ్‌
తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్నదని, మంచి క్వాలిటీ ఉండటమే దీనికి కారణమని కేసీఆర్‌ తెలిపారు. ఎక్కువ దిగుబడి వచ్చి.. అధిక ధర లభించే అవకాశం ఉన్నందున, వచ్చే వానాకాలం 75 నుండి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని సీఎం రైతులకు సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌ రెడ్డిని ఆదేశించారు. 20– 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగుకు చర్యలు చేపట్టాలని కోరారు.

పత్తి, కంది పంటలకు నీళ్ల తడులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందని సీఎం తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్, పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు, సెక్రటరీ భూపాల్‌ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌ కుమార్, ఎఫ్‌.సి.ఐ జనరల్‌ మేనేజర్‌ అశ్వినీగుప్తా పాల్గొన్నారు.

80 లక్షల టన్నులకు ఎఫ్‌సీఐ ఓకే
యాసంగిలో భారీ విస్తీర్ణంలో వరి సాగైందని, ధాన్యం తీసుకోవాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను రాష్ట్రం కోరింది. ఈ మేరకు ఇటీవల ఎఫ్‌సీఐతో చర్చలు జరిపింది. దాంతో ఎఫ్‌సీఐ 80 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకునేందుకు సమ్మతించింది. ధాన్యం సేకరణకు 18 కోట్ల గోనె సంచులు అవసరం ఉండగా... 8 కోట్లు లభ్యతగా ఉన్నాయి. మిగతా 10 కోట్ల గోనె సంచుల కోసం పౌర సరఫరాల శాఖ ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు ఆర్డర్‌ ఇచ్చింది. కాగా గ్రేడ్‌–1 రకం ధాన్యానికి రూ. 1,888 మద్దతు ధర ఉండగా, కామన్‌ రకానికి 1,868 రూపాయలు ఉంది. ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 6,506 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు జరిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement